• Home »
  • Cable »
  • బ్రాడ్ కాస్టర్లతో సిటీకేబుల్, డిష్ టీవీ ఉమ్మడిగా బేరసారాలు

బ్రాడ్ కాస్టర్లతో సిటీకేబుల్, డిష్ టీవీ ఉమ్మడిగా బేరసారాలు

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డిష్ టీవీ, సిటీ కేబుల్ ఉమ్మడిగా బేరసారాలు నడపాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ప్రారంభిస్తున్నాయి. దీని ప్రభావం వలన గట్టిగా బేరమాడి తక్కువ ధరలకే పే చానల్స్ అందుకోవటానికి, కారేజ్ ఫీజు ఎక్కువగా సంపాదించుకోవటానికి వీలవుతుందని సిటీ కేబుల్ సీఈవో విడి వాధ్వా చెప్పారు.

ఇప్పటివరకూ సిటీ కేబుల్ సొంతగానే ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం ప్రైవేటు ఒప్పందాలు కుదుర్చుకుంటూ వచ్చామని, ఇక మీదట  మాత్ర  సి అండ్ ఎస్ మీడియానెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ ద్వారా గరిష్టంగా లబ్ధిపొందుతామని చెప్పారు. ఇందులో డిష్ టీవీ వాటా 52 శాతం, సిటీ కేబుల్ వాటా 48 శాతం ఉంటుందన్నారు. ఈ రెండు సంస్థలూ ఎస్సెల్ గ్రూప్ ప్రమోట్ చేసినవేనన్న సంగతి తెలిసిందే.

వచ్చే రెండేళ్ళ కాలంలో కారేజ్ ఫీజు ద్వారా వచ్చే ఆదాయం 8 నుంచి 10 శాతం పెరుగుతుందని సిటీ కేబుల్ భావిస్తోంది. నిజానికి చాలా నెట్ వర్క్ లలో కారేజ్ ఆదాయం తగ్గుతున్నప్పటికీ సిటీ కేబుల్ పెంచుకోగలగటం విశేషం. గడిచిన మూడేళ్ళ కాలంలో పది శాతం మేర పెరిగినట్టు వెల్లడించారు.