• Home »
  • DTH »
  • చందాలు పెంచిన డిష్ టీవీ

చందాలు పెంచిన డిష్ టీవీ

ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో చందాదారునుంచి వచ్చే సగటు ఆదాయాన్ని కనీసం 6 నుంచి 7 శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న డిష్ టీవీ ఇప్పుడు నెలసరి చందాలు పెంచింది. ముఖ్యంగా  ఉత్తర భారతదేశంలో అనేక పాకేజీల రేట్లు పెంచింది. మొత్తంగా చూస్తే కనెక్షన్ కు నెలకు సగటునరూ.10 పెరిగినట్టు తెలుస్తోంది.

మొదటి దశ డిజిటైజేషన్ జరిగిన నాలుగు మెట్రో నగరాలలో ఇప్పటికే రకరకాల పాకేజీలు ప్రవేశపెట్టి ఉండటం వలన అక్కడ మాత్రం పెరుగుదల తక్కువగానే ఉంది. ఈ నెల 4 వ తేదీ అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చిన కొత్త ధరలు 42 నగరాలలోని చందాదారులమీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.

హెచ్ డి చానల్స్ జోడించటం ద్వారా 5-7 శాతం చందా రేట్లు పెంచగా జింగ్ చందాదారులమీద ఎలాంటి భారమూ మోపలేదు. ఎక్కడికక్కడే ప్రాంతీయంగా పాకేజీలు తయారు చేసి ఆకట్టుకుంటున్న జింగ్ ను అదే విధంగా కొనసాగించాలని డిష్ యాజమాన్యం నిర్ణయించింది. డిజిటైజేషన్ జరుగుతున్న సమయంలో కేబుల్ కంటే మెరుగైనదనే అభిప్రాయం కలిగించటానికి డిష్ టీవీ జింగ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం డిష్ టీవీ కనెక్షన్ల సగటు రాబడి రూ. 173 ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 శాతం పెరగాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. హెచ్ డి చందాదారుల సంఖ్య బాగా పెరుగుతున్నప్పటికీ దీనిమీద వచ్చే ఆదాయం కంటే జింగ్ కోసం ఇస్తున్న సబ్సిడీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనప్పటికీ గత ఆగస్టులో చందారేట్లు పెంచిన డిష్ టీవీ ఇప్పుడు మళ్ళీ ఏడాది గడవగానే చందాలు పెంచింది.