• Home »
  • BARC »
  • ఎదుగూబొదుగూ లేని డిడి చానల్స్: బార్క్ రేటింగ్స్ వెల్లడి

ఎదుగూబొదుగూ లేని డిడి చానల్స్: బార్క్ రేటింగ్స్ వెల్లడి

దాదాపుగా అన్ని దూరదర్శన్ చానల్స్ రేటింగ్స్ పరంగా దిగువస్థాయిలోనే ఉన్నట్టు రేటింగ్స్ లెక్కింపు సంస్థ  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) సమాచారం వెల్లడించింది. ప్రభుత్వం నియామకాలతోబాటు బడ్జెట్ పరంగా కేటాయింపులు పెంచినప్పటికీ ప్రేక్షకాదరణలో మాత్రం మెరుగుపడలేదంటూ ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఈ రోజు ఒక వార్తాకథనం ప్రచురించింది.

బార్క్ సమాచారం ప్రకారం 15 ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో డిడి నేషనల్ 13 వ స్థానంలో ఉండగా 13 స్పోర్ట్స్ చానల్స్ లో డిడి స్పోర్ట్స్ స్థానం 10 లో ఉంది. అదే విధంగా 14 న్యూస్ చానల్స్ లో డిడి న్యూస్ ఎనిమిదో స్థానంలోనూ, సంస్కృతి ప్రధానాంశంగా ఉన్న 11 చానల్స్ లో డిడి భారతి 10 వ స్థానంలోనూ ఉన్నాయి.

ఇటీవలే ప్రారంభించిన డిడి కిసాన్ సైతం అదే పరిస్థితి కనబరుస్తోంది. ఈ విభాగంలో 11 చానల్స్ ఉండగా డిడి కిసాన్ తొమ్మిదో స్థానంలో ఉంది. మొత్తం 67 డిడి ప్రాంతీయ చానల్స్ ప్రేక్షకాదరణ సైతం అత్యంత దయనీయంగా ఉన్నట్టు బార్క్ లెక్కలు చూపిస్తున్నాయి. వీటిలో డిడి ఉర్దూ, డిడి బంగ్లా, డిడి గిర్నార్, డిడి కశ్మీర్, డిడి మరాఠీ, డిడి ఒడియా ఉన్నాయి. ఇది మే 18- జూన్ 8 మధ్య కాలానికి సంబంధించిన అధ్యయన ఫలితం.

అయితే, ప్రసార భారతి సీఈవో జవహర్ సర్కార్ మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తున్నారు. బార్క్ రేటింగ్స్ లెక్కింపులో 40 శాతం ప్రజలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, గ్రామీణ ప్రాంత ప్రజలను పూర్తిగా వదిలేయటం వలన ఫలితాలు తారుమారవుతున్నాయని వ్యాఖ్యానించారు.  తరువాత దశలో బార్క్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీటర్లు పెట్టినమీదట మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.