• Home »
  • News »
  • ఏషియానెట్ : రెండు దశాబ్దాల వార్తాప్రయాణం

ఏషియానెట్ : రెండు దశాబ్దాల వార్తాప్రయాణం

కేరళలో మొదటి ప్రైవేట్ శాటిలైట్ చానల్ గా అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రేక్షకులకు నివేదిస్తూ వచ్చిన ఏషియానెట్ తన ఇరవయ్యేళ్ల వార్తాప్రస్థానాన్ని 20 ఎపిసోడ్స్ గా అందిస్తోంది. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఈ గంటనిడివి డాక్యుమెంటరీ వరుసగా 20 వారాలపాటు ప్రసారమవుతుంది. చానల్ సంపాదకుడు ఎం జి రాధాకృష్ణన్ స్వయంగా రాసి సమర్పిస్తున్నారు.

అరుదైన, అద్భుతమైన ఏషియానెట్ కి మాత్రమే సొంతమైన లైబ్రరీ క్లిప్ప్పింగ్స్  సాయంతో రూపొందే ఈ కార్యక్రమం గడిచిన రెండు దశాబ్దాలకాలంలో అత్యంత కీలకఘట్టాలను, వివిధ రంగాలలో వచ్చిన మార్పులను గుర్తుచేస్తూ రాజకీయ, సామాజిక, సాహిత్య, క్రీడా, సినీ రంగాలను స్పృశిస్తూ ముందుకు సాగుతుంది. చరిత్రను పునర్నిర్మిస్తూ , జ్ఞాపకాలను తిరగదోడుతూ అందరినీ వెనకటి రోజుల్లోకి నడిపిస్తుంది.

ముఖ్యమంత్రి పదవి నుంచి  కరుణాకరన్ ను తొలగించిన సందర్భం కావచ్చు, సిపిఎం లో అంతర్గత కలహాలు, గౌరియమ్మ తొలగింపు, మాజీ ముఖ్యమంత్రులు ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఇకెనయనార్, కరుణాకరన్, పికెవాసుదేవన్ నాయర్ కన్నుమూసిననాటి ఘట్టాలు కావచ్చు అన్నీ మరోమారు ప్రేక్షకుల కళ్ళముందు మెదులుతాయి. అంజుబాబీ జార్జ్ కావచ్చు, శ్రీశాంత్ లాంటివారు క్రీడల్లో ఎదిగిన తీరు మొదలుకొని దళితుల పోరాటాల దాకా రెండు దశాబ్దాల కీలకసమయంలో కేరళలో వచ్చిన మార్పును ఈ డాక్యుమెంటరీలు అద్భుత దృశ్యకావ్యాలుగా అలరిస్తాయి.