• Home »
  • Cable »
  • కేబుల్ ఒక్కటే.. రెండు ఫీడ్స్ ప్రసారం : నెక్స్ట్ డిజిటల్ కు అందివచ్చిన అవకాశం

కేబుల్ ఒక్కటే.. రెండు ఫీడ్స్ ప్రసారం : నెక్స్ట్ డిజిటల్ కు అందివచ్చిన అవకాశం

డిజిటైజేషన్ పర్వంలో మరిన్ని అద్భుతాలు జరుగుతాయనటానికి నిదర్శనం సరికొత్తగా నెక్స్ట్ డిజిటల్ వారు అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ. ఒక సారి సెట్ టాప్ బాక్స్ పెడితే చందాదారుణ్ణి పెరట్లో కట్టిపడేసుకున్నట్టే అని భావించినా, ఆపరేటర్ ను చిన్న చూపు చూడవచ్చునని భావించినా అలాంటి డిజిటల్ ఎమ్మెస్వోకు గుడ్ బై చెప్పటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ఆపరేటర్ల స్వేచ్ఛను, స్వతంత్ర ఎమ్మెస్వోలుగా ఉండాలనుకునేవారి ఆలోచనను బలపరచటానికి ఇది పనికొస్తుంది.

ఒక ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటూ ఉన్నప్పటికీ అసంతృప్తితో ఉన్న ఆపరేటర్ మారాలనుకుంటే అదనంగా ఖర్చయ్యేది సెట్ టాప్ బాక్స్ ఒక్కటే. అప్పటికే పాత ఎమ్మెస్వోతో అనుసంధానమై ఉండటం వలన మళ్ళీ బాక్స్ కొనగలిగే పరిస్థితి ఉండదు. అందువలన బాక్స్ ధర సబ్సిడీగా ఇవ్వగలిగితే సర్వీస్ ప్రొవైడర్ ని మార్చేయటం చాలా సులభం. ఒక ఎమ్మెస్వో నుంచి మరో ఎమ్మెస్వోకు మారటంలో ఎదురయ్యే ఇబ్బందుల సంగతేంటనేది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న.

ఇంటింటికీ ప్రసారాలందించే కేబుల్ ద్వారా ఫ్రీక్వెన్సీని విభజించి పంచటానికి నెక్స్ట్ డిజిటల్ ఫీడ్ వెసులుబాటు కల్పిస్తుంది. అందువలన ఒక సిటీ కేబుల్ ఆపరేటర్ ఏకకాలంలో సిటీ కేబుల్ ఫీడ్ తోబాటు నెక్స్ట్ డిజిటల్ ఫీడ్ కూడా పంపవచ్చు. అదే విధంగా హాత్ వే పరిధిలో ఉండే ఆపరేటర్ కూడా నెక్స్ట్ డిజిటల్ ఫీడ్ పంపవచ్చు. అంటే, ఇప్పటివరకూ ఒక పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటున్నవారు సైతం క్రమంగా అది వదులుకొని స్వయంగా ఎమ్మెస్వోగా మారటానికి నెక్స్ట్ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

దీని వలన నెక్స్ట్ డిజిటల్ కి మాత్రమే ప్రయోజనం కలగటానికి అసలు కారణం మరొకటుంది. అలా భిన్నమైన ఫ్రీక్వెన్సీలు పంపడమనేది రెండింటిలో ఒకటి నెక్స్ట్ డిజిటల్ ఫీడ్ అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే, సిటీ కేబుల్ లైన్లో హాత్ వే గాని, హాత్ వే లైన్లో డిజి కేబుల్ సిగ్నల్ గాని పంపటానికి వీల్లేదు. నెక్స్ట్ డిజిటల్ తో బాటు మరో ఎమ్మెస్వో ఫీడ్ మాత్రమే పంపటానికి వీలుంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర ఎమ్మెస్వోలుగా మారాలనుకుంటున్నవాళ్ళు క్రమంగా మార్కెట్లోకి విస్తరిస్తూ వెళ్ళవచ్చు. మొదట్లో పాత సర్వీస్ ప్రొవైడర్ నే కొనసాగిస్తూ, దశలవారీగా కొత్త ఎమ్మెస్వోను ఆశ్రయించవచ్చు. మధ్యలో సంధికాలం లేకపోవటం బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఎమ్మెస్వో కాకపోయినా భవిష్యత్తులో ఎమ్మెస్వోగా మారటానికి నెక్స్ట్ డిజిటల్ ఎలాగూ అభ్యంతరం చెప్పదు కాబట్టి ఆపరేటర్లు, స్వతంత్ర ఎమ్మెస్వోలు ఈ పద్ధతిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇక నెక్స్ట్ డిజిటల్ విషయానికొస్తే, ఆలస్యంగా మార్కెట్లో ప్రవేశించినంత మాత్రాన నష్టమేమీ లేదన్న ధీమా కనబడుతోంది. 500 కు పైగా చానల్స్ ఇవ్వగలిగిన ఏకైక ప్లాట్ ఫామ్ గా ఒకవైపు, ఆకర్షణీయమైన పాకేజీలు మరో వైపు ఎలాగూ స్వతంత్ర ఎమ్మెస్వోలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఎవరు ఎమ్మెస్వోగా మారాలనుకున్నా వ్యతిరేకించకపోవటం, బ్రాడ్ కాస్టర్లతో బేరసారాలకు, కారేజ్ ఫీజు రాబట్టుకోవటానికి సహకరించటం లాంటి విధానాలు సానుకూలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ , రాయల సీమ జిల్లాల్లో పది లక్షల మైలురాయిని త్వరలో దాటబోతోంది.

ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పాత ఎమ్మెస్వోల బకాయిలు ఎగ్గొట్టి కొత్త ఎమ్మెస్వో పంచన చేరాలనే ఆలోచన చేస్తే మాత్రం చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. నెలవారీ చందా పాకేజీలు ఆకర్షణీయంగా ఉన్నందున మారాలనుకుంటే మాత్రం ఆపరేటర్లకు ఇది ఒక వరంలాంటిది. సద్వినియోగం చేసుకుంటే ఇది విప్లవాత్మకమైన మార్పులకు దారితీస్తుంది. డిజిటైజేషన్ అంటే ఎమ్మెస్వోకు కట్టుబానిసగా మిగిలిపోవటమేనన్న అభిప్రాయం పూర్తిగా పోతుంది. అప్పుడు ఎమ్మెస్వోలు కూడా తన ఆపరేటర్ ను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాడు.