• Home »
  • Cable/DTH/HITS »
  • సెట్ టాప్ బాక్స్ ఫీచర్స్ పెంచుతున్న డిటిహెచ్ కంపెనీలు టాటా స్కై, వీడియోకాన్

సెట్ టాప్ బాక్స్ ఫీచర్స్ పెంచుతున్న డిటిహెచ్ కంపెనీలు టాటా స్కై, వీడియోకాన్

డిజిటైజేషన్ నేపథ్యంలో కేబుల్ కంటే ముందుండటానికి డిటిహెచ్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. నిజానికి ముందుగా డిజిటైజేషన్ జరిగింది డిటిహెచ్ తోనే. అయితే, ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు కేబుల్ డిజిటైజేషన్ తో మాత్రమే సాధ్యమన్న ప్రచారాన్ని తిప్పికొట్టటానికి వీలుగా డిటిహెచ్ కంపెనీలు కూడా వ్యూహ రచన చేస్తున్నాయి. తన సెట్ టాప్ బాక్సులను అప్ గ్రేడ్ చేస్తూ సరికొత్త ఇంటర్నెట్ ఫీచర్లను జోడిస్తున్నాయి.

వీడియోకాన్ డి2హెచ్ సంస్థ హెచ్ డి స్మార్ట్ సెట్ టాప్ బాక్సులు అందించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ బాక్సుల వలన ప్రస్తుతం వాడే ఎల్ ఇ డి టీవీలు స్మార్ట్ టీవీలుగా మారిపోతాయి. అదే సమయంలోసోషల్ మీడియా బ్రౌజింగ్ కి వీలుకల్పిస్తుంది. వాయిస్ ఆన్ డిమాండ్, ఒటిటి యాప్స్ లాంటివి కూడా అందుబాటులోకి వస్తాయి.

ఇలా ఉండగా టాటా స్కై సంస్థ నేరుగా తన సెట్ టాప్ బాక్స్ లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ అప్లికేషన్స్ ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. దీనివలన టాటా స్కై చందాదారులు ఇకమీదట తమ సెట్ టాప్ బాక్స్ ద్వారా ఇంటర్నెట్ యాప్స్ ని బ్రౌజ్ చేసే వీలుంటుంది. స్మార్ట్ టీవీ అవసరం లేకుండా సెట్ టాప్ బాక్స్ సాయంతో దాదాపు అన్ని టీవీ సెట్లలోనూ ఇది సాధ్యమవుతుంది. ఎలాంటి అదనపు భారమూ మోపకుండా తన చందాదారులకు త్వరలో ఈ సౌకర్యం అందించబోతున్నట్టు టాటా స్కై వెల్లడించింది.

తమను తాము కేవలం డిటిహెచ్ ఆపరేటర్ గా కాకుండా కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫామ్ గా భావిస్తున్నామని టాటా స్కై సీఈవో హరిత్ నాగ్ పాల్ చెప్పుకున్నారు.  చందాదారుడు తనకు కావాల్సిన కంటెంట్ ను కోరుకున్న మాధ్యమంలో ఎంచుకున్న తెరమీద చూసే అవకాశం కల్పిస్తున్నామంటున్నారు. అలాంటి స్థాయిలో కన్వర్జెన్స్ మీద టాటా స్కై దృష్టి సారించిందన్నారు.