• Home »
  • DTH »
  • డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు ఆగస్టు 23 కు వాయిదా

డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు ఆగస్టు 23 కు వాయిదా

డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు మళ్ళీ వాయిదా పడింది. టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) మొదట ఫివరి 25 న కేసు విచారణకు చేపట్టినప్పుడు మే 10వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ రోజు కూడా మళ్ళీ వాయిదా నిర్ణయమే తీసుకుంటూ ఆగస్టు 23 న విచారణ జరపాలని నిర్ణయించింది. లైసెన్స్ ఫీజుకు సంబంధించిన కొన్ని అంశాలు వివిధ హైకోర్టులలో పెండింగ్ ఉన్నందున  విచారణ వాయిదావేయాలని డిటిహెచ్ ఆపరేటర్లు కోరటంతో టిడిశాట్ ఈ వాయిదా నిర్ణయం తీసుకుంది.

స్థూల ఆదాయంలో 10% మొత్తాన్ని లైసెన్స్ ఫీజుగా చెల్లించాలన్న నిబంధననుంచి తాత్కాలిక ఊరట కోసం డిటిహెచ్ ఆపరేటర్లు అనేక కోర్టులలో కేసులు దాఖలు చేశారు. 2015 నవంబర్ లో డిష్ టీవీకి జమూకాశ్మీర్ హైకోర్టు, సన్ డైరెక్ట్ కు కేరళ హైకోర్టు లైసెన్స్ ఫీజు విషయంలో ఈ తరహా ఊరటనిచ్చాయి.

2014 లో డిటిహెచ్ ఆపరేటర్లకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నోటీసులు జారీచేస్తూ మొత్తం 2,066 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో డిటిహెచ్ ఆపరేటర్లు టిడిశాట్ ను ఆశ్రయించారు. అయితే, ఈ వ్యవహారం మీద విచారణ ఒక కొలిక్కి వచ్చేదాకా డిటిహెచ్ ఆపరేటర్లమీదవత్తిడి తీసుకురావద్దంటూ మంత్రిత్వశాఖను టిడిశాట్ ఆదేశించింది.

ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ మంత్రిత్వశాఖ డిమాండ్ చేయటాన్ని డిటిహెచ్ ఆపరేటర్లు తప్పుబట్టారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు లో తేలిన తరువాతనే విచారణ చేపడతానని టిడిశాట్ నిరుడు ఫిబ్రవరిలో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో చాలాకాలంగా ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది.

అయితే టాటా స్కై, భారత ప్రభుత్వం వేసిన అప్పీళ్ళను సుప్రీకోర్టు గత ఆగస్టు 27న  తేల్చేయటంతో  టిడిశాట్ లో విచారణ పునఃప్రారంభమైంది. ప్రస్తుత నిబంధనలప్రకారం డిటిహెచ్ ఆపరేటర్లు తమ స్థూల ఆదాయంలో 10% మొత్తాన్ని లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే డిటిహెచ్ ఆపరేటర్ల వాదన ఏంటంటే చందా దారులనుంచి వసూలయ్యే చందా ఆదాయంలో పది శాతం మాత్రమే చెల్లించగలం తప్ప స్థూల ఆదాయంలో చెల్లించటం అర్థరహితమని. కొన్ని సందర్భాలలో పెనాల్టీలు, వడ్డీలు కూడా వసూలు చేసుకుంటామని, అవి వ్యాపార లాభాలు కాదుగాబట్టి ఆ ఆదాయంలో కూడా వాటా అడగటం తగదని ప్రభుత్వంతో వాదిస్తున్నారు.