• Home »
  • DTH »
  • రూ. 2 వేల కోట్ల డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు వచ్చే 12న టిడిశాట్ లో మళ్ళీ విచారణ

రూ. 2 వేల కోట్ల డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు వచ్చే 12న టిడిశాట్ లో మళ్ళీ విచారణ

డిటిహెచ్ ఆపరేటర్లు లైసెన్స్ ఫీజు బకాయిలకింద రూ. 2,066 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసును మళ్ళీ టిడిశాట్ విచారించబోతోంది. ఇదే విషయం మీద సుప్రీంకోర్టులో కూడా అప్పీళ్లు దాఖలు కావటంతో రెండు తీర్పులమధ్య ఘర్షణ నివారించేందుకు టిడిశాట్ గత ఫిబ్రవరిలో విచారణ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పిటిషన్లను తోసిపుచ్చటంతో టిడిశాట్ తన విచారణను పునరుద్ధరించబోతోంది.

సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నిరుడు మార్చి లో డిటిహెచ్ ఆపరేటర్లకు నోటీసులు జారీచేస్తూ మొత్తం రూ. 2066 కోట్ల లైసెన్స్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. దీనిమీద టాటా స్కై టిడిశాట్ లో అప్పీల్ చేసింది. విచారణ సమయంలో టాటా స్కై తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ తన వాదన వినిపిస్తూ ఈ వ్యవహారం కేవలం వడ్డీ విధింపునకు మాత్రమే పరిమితమన్నారు. డిటిహెచ్ ఆపరేటర్లు పెద్దమొత్తంలో ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు సహా అన్ని రకాల చెల్లింపులూ చేస్తూనే ఉన్నారని, అయినప్పటికీ వాటిమీద వడ్డీ అడగటం అర్థరహితమని అన్నారు.

అయితే, అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు ఉన్నట్టు తేలటంతో టిడిశాట్ ఈ విచారణను నిరవధికంగా వాయిదావేసింది. సుప్రీంకోర్టు లో తేలిన తరువాత మాత్రమే విచారణ చేపట్టగలనని పేర్కొంది. టాటా స్కై తరఫున హరీశ్ సాల్వే వాదనలు విన్న అనంతరం ఆగస్టు 27 న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమజిత్ సేన్, జస్టిస్ శివ కీర్తి తమ ముందున్న అప్పీళ్లను తోసిపుచ్చింది. అయితే, అపరాధరుసుము, లేదా వడ్డీ ఎంత అనేది నిర్ణయించాల్సిన టిడిశాట్ విచారణకు, ఈపిటిషన్ల తోసివేతకు సంబంధం లేదని కూడా స్పష్టం చేయటంతో టిడిశాట్ ఇప్పుడు విచారణ పునరుద్ధరణకు సిద్ధమైంది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే టిడిశాట్ మధ్యంతర ఆదేశాలిస్తూ డిటిహెచ్ ఆపరేటర్లమీద చెల్లింపులకోసం వత్తిడి చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. సవరించిన స్థూల ఆదాయం మీద 10 శాతం లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నది ప్రభుత్వ వాదన. చందా ఆదాయాలను మాత్రమే లైసెన్స్ ఫీజుకు ప్రాతిపదికగా తీసుకోవాలి తప్ప డివిడెండ్, వడ్డీ లాంటి ఇతర ఆదాయాలను కూడా కలపటం తగదని డిటిహెచ్ ఆపరేటర్లు వాదిస్తున్నారు.
ఒకవైపు ఈ వ్యవహారం టిడిశాట్ లోనూ, సుప్రీంకోర్టులోనూ ఉండగానే ట్రాయ్ సరికొత్త సిఫార్సులు చేస్తూ లైసెన్స్ ఫీజు స్థూల ఆదాయం మీద 8 శాతం ఉండాలని పేర్కొంది. అందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్వీస్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్, వాట్ లాంటివి మినహాయించిన తరువాత ఉన్న ఆదాయాన్నే ప్రాతిపదికగా తీసుకొవాలని కూడా వివరణ ఇచ్చింది. అయితే, ఈ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.