• Home »
  • DTH »
  • డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు నిరవధిక వాయిదా

డిటిహెచ్ లైసెన్స్ ఫీజు కేసు నిరవధిక వాయిదా

డైరెక్ట్ టు హోమ్ ( డిటిహెచ్) ఆపరేటర్లు దాఖలు చేసిన లైసెన్స్ ఫీజుల కేసు ను నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్టు టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్) ప్రకటించింది. ఇదే వ్యవహారం మీద హైకోర్టులలో కూడా కేసులు దాఖలై ఉండటంతో ముందుగా అక్కడ తీర్పులు వెలువడిన తరువాత మాత్రమే విచారించబోతున్నట్టు వివరణ ఇచ్చింది. అందుకే వివిధ హైకోర్టులలో దాఖలైన రిట్ పిటిషన్ల మీద విచారణ వీలైనంత త్వరగా జరిగేట్టు చూడాలని ఆ తరువాత మాత్రమే ఇక్కడ వేగవంతం కోసం కోరాలని కూడా ప్రభుత్వానికి తెలియజేసింది.

డిటిహెచ్ ఆపరేటర్లకు ఇచ్చే లైసెన్సుల నిబంధనల ప్రకారం వారి స్థూల ఆదాయంలో 10 శాతం లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. ఆవిధంగా 2014 నాటికి ఆరు డిటిహెచ్ ఆపరేటర్లు కలిసి ప్రభుత్వానికి రూ.2066 కోట్ల రూపాయలు బకాయి పడినట్టు తేలింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలంటూ 2014 లో ప్రభుత్వం ఇచ్చిన నోటీసు మీద డిటిహెచ్ సంస్థలు టిడిశాట్ లో పిటిషన్ వేశారు.

డిష్ టీవీ రూ.625 కోట్లు, టాటా స్కై రూ.620 కోట్లు. ఎయిర్ టెల్ డిజిటల్ రూ. 298 కోట్లు, సన్ డైరెక్ట్ రూ. 230 కోట్లు, వీడియోకాన్ డి2హెచ్ రూ.157 కోట్లు, రిలయెన్స్ డిజిటల్ రూ. 136 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టు ప్రభుత్వం పంపిన నోటీసులలో ఉంది. అయితే, స్థూల ఆదాయంలో 10% లైసెన్సు ఫీజుగా ఉండాలా, సవరించిన స్థూల ఆదాయంలోనా అనేది సమస్య తెచ్చిపెట్టింది. ఈ స్పష్టత ఇవ్వాల్సిందేనని డిటిహెచ్ సంస్థలు పట్టుబట్టాయి.

మామూలు ఆదాయానికీ, పెనాల్టీల వంటి ఆదాయానికీ తేడా ఉన్నందున అలాంటి అదనపు ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా లెక్కబెట్టకూడదనేది డిటిహెచ్ ఆపరేటర్ల వాదన. సవరించిన స్థూల ఆదాయం అనే విషయమై 2009 లోనేడిటిహెచ్ ఆపరేటర్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖమీద కోర్టుకు వెళ్ళారు. అందువలన ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పిటిషన్లలో 2014 లో దాఖలైన వాటితోబాటు 2009 నాటివీ ఉన్నాయి. బకాయిల నోటీసుల మీద దాఖలైన పిటిషన్లను విచారణకు తీసుకున్న  జమ్మూ కాశ్మీర్, కేరళ హైకోర్టులు స్టే మంజూరు చేస్తూ చెల్లింపులకోసం వత్తిడి చేయవద్దని ఆదేశించాయి.