• Home »
  • Cable/DTH/HITS »
  • న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో డిటిహెచ్ లైసెన్స్ మార్గదర్శకాలు

న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో డిటిహెచ్ లైసెన్స్ మార్గదర్శకాలు

తాజాగా రూపొందించిన డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) మార్గదర్శకాలు ప్రస్తుతం న్యాయమంత్రిత్వశాఖ పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పదిహేడేళ్ల కిందట జారీచేసిన డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) మార్గదర్శకాలను పునఃపరిశీలించాల్సిన అవసరం రావటంతో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఒక చర్చాపత్రం ద్వారా అభిప్రాయ సేకరణ జరిపి తన సిఫార్సులను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపింది. అయితే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు గాని వాటిని న్యాయశాఖకు పంపినట్టు సమాచార, ప్రసార శాఖామంత్రి స్మృతి ఇరానీ ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్ సభకు తెలియజేశారు.

ప్రస్తుతం ఆరు ప్రైవేట్ డిటిహెచ్ ఆపరేటర్లు ఉండగా ప్రసార భారతి ఆధ్వర్యంలో దూరదర్శన్ వారి ఫ్రీడిష్ కూడా పనిచేస్తోందని, సంఖ్యాపరంగా డిటిహెచ్ అనుమతులమీద ఎలాంటి పరిమితీ లేదని కూడా తెలియజేశారు. ఒక్కో డిటిహెచ్ ఆపరేటర్ లైసెన్స్ పొందటానికి రూ.10 కోట్లు  ప్రవేశ రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాకుండా ఏటా స్థూల ఆదాయం మీద 10 శాతం వార్షికలైసెన్స్ ఫీజు రూపంలో చెల్లించాలని వెల్లడించారు.

అయితే డిటిహెచ్ ఆపరేటర్లు దాదాపు రెండేళ్ళుగా ఈ మార్గదర్శకాలను మార్చాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరోమారు సమీక్షించి తగిన మార్పులు చేయాలన్నది వారి ప్రధానమైన డిమాండ్. ఏటా చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజును ఆదాయంలో 6-8 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొన్ని డిటిహెచ్ సంస్థలకు పదేళ్ళ లైసెన్స్ గడువు కూదా పూర్తవటంతో తాత్కాలిక లైసెన్స్ మీద నడుస్తున్నాయి.పూర్తి స్థాయి మార్గదర్సకాలు వెలువడిన తరువాత వాటికి అనుగుణంగా రెన్యూవల్ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో మొదటి డిటిహెచ్ లైసెన్సు ఇచ్చి పదేళ్ళు పూర్తవడంతో కొత్త లైసెన్సుల జారీకి ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలో సమాచారప్రసారాల మంత్రిత్వశాఖ కోరిన మీదట ఒక చర్చా పత్రం విడుదల చేసి, సంబంధిత వర్గాలతో ట్రాయ్ చర్చించిన విషయం తెలిసిందే.  డిటిహెచ్ లైసెన్సుల నియమాల మీద, పే చానల్స్ పంపిణీ సంస్థల నియంత్రణ మీద మార్గదర్సకాలు రూపొందించిన మీదట ట్రాయ్ ఆ సిఫార్సులను, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు అందజేసినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.

ట్రాయ్ కి డిటిహెచ్ సమస్యల చిట్టా

అయితే, అంతకుముందే డిటిహెచ్ ఆపరేటర్లు ట్రాయ్ కి తమ సమస్యలను వివరించారు. టీవీ కార్యక్రమాల పంపిణీ రంగంలో డిటిహెచ్ ఎన్నో సమస్యలనెదుర్కుంటున్నదంటూ మొరపెట్టుకున్నారు. ఓవర్ ద టాప్ (ఒటిటి) వేదికలనుంచి, దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ డీడీ ఫ్రీడిష్ నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడటం గురించి, లైసెన్సింగ్ విధానం ప్రతికూలంగా ఉండటం, శాటిలైట్ ట్రాన్స్ పాండర్లు అవసరానికి తగినంతగా అందుబాటులో లేకపోవటం గురించి ప్రధానంగా ఫిర్యాదు చేశారు.

డిటిహెచ్ ఆపరేటర్ల తరఫున వీడియోకాన్ డి2హెచ్ ప్రతినిధి ట్రాయ్ అధికారులకు ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఒటిటి ప్లాట్ ఫామ్స్ ను అదుపుచేయని పక్షంలో డిటిహెచ్ మనుగడ అసాధ్యమని అందులో తేల్చి చెప్పారు. ఒటిటి సర్వీసులకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేకపోవటంతో వాటిమీద నియంత్రణ ఏదీ లేదన్న విషయం గుర్తు చేశారు. కనీసం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేకపోవటంతో వాటితో పోటీ పడటం డిటిహెచ్ ఆపరేటర్లకు సాధ్యం కావటం లేదని పేర్కొన్నారు.

టీవీ పంపిణీ సంస్థలైన కేబుల్ టీవీ, డిటిహెచ్ లాంటివి మాత్రం ఎంటర్టైన్మెంట్ టాక్స్ చెల్లిస్తూ ఉండగా ఒటిటి ప్లాట్ ఫామ్స్ కు అది కూడా లేకపోవటం ఒక విధంగా వివక్ష చూపడమేనని వీడియోకాన్ ఆక్షేపించింది. బ్రాడ్ కాస్టింగ్ రంగంలో సునాయాసంగా వ్యాపారం చేసుకోవటం మీద ట్రాయ్ జారీచేసిన ముందస్తు చర్చా పత్రానికి స్పందనగా వీడియోకాన్ ఈ లేఖ రాసింది. సంప్రదాయ పంపిణీ సంస్థల తరహాలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒటిటి సంస్థలు లబ్ధిపొందుతున్నాయని అందులో పేర్కొంది.

ఒకే రకమైన కంటెంట్ అందుబాటులో ఉండటం వలన ఒటిటి ప్లాట్ ఫామ్స్ ద్వారా పైరసీ జరగటానికి ఎక్కువగా ఆస్కారమున్న విషయాన్ని  కూడా ట్రాయ్ గుర్తించాలని కోరింది. అధికశాతం ఒటిటి వేదికలు ఉచితంగా అందుబాటులో ఉండటం వలన వాణిజ్యపరంగా డిటిహెచ్ లాంటి పంపిణీ సంస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలున్నాయన్న విషయాన్ని కూడా ట్రాయ్ దృష్టికి తెచ్చింది. బ్రాడ్ కాస్టర్లు కూడా ఒటిటి ప్లాట్ ఫామ్స్ కు ఉచితంగా కంటెంట్ అందిస్తూ డిటిహెచ్, కేబుల్ సంస్థలనుంచి డబ్బు వసూలు చేయటం వలన ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోందని వీడియోకాన్ ఫిర్యాదు చేసింది.

దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ తో సమానావకాశాలు లేకపోవటం వలన పోటీపడటం అసాధ్యంగా తయారైందన్న విషయం కూడా గుర్తుచేసింది. బ్రాడ్ కాస్టింగ్ స్పెక్ట్రమ్ కేటాయింపు సింగిల్ విండో విధానంలో జరిగినప్పుడే కేటాయింపు వ్యవస్థ సజావుగా ఉంటుందని, అనవసరమైన ఖర్చులు నివారించవచ్చునని సూచించింది. టాటా స్కై కూడా సింగిల్ విండో విధానంలో స్పెక్ట్రమ్ కేటాయింపు జరగాలని తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.  ఫ్రీక్వెన్సీ కేటాయింపు లేఖ మొదలుకొనిచివరగా అప్ లింకింగ్ అనుమతి దాకా దాదాపు ఆరు నెలల సమయం పడుతున్న విషయాన్ని ప్రస్తావించింది.

డిటిహెచ్ ఆపరేటర్లు ఎలాంటి అదనపు చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకుండా రేడియో సర్వీసు కూడా అందించేలా అవకాశమివ్వాలని వీడియోకాన్ సంస్థ ట్రాయ్ కి విజ్ఞప్తి చేసింది.  డిటిహెచ్ ఆపరేటర్లు చెల్లిస్తున్న ఎన్ ఒ సి సి, డబ్ల్యు పిసి చార్జీలను హేతుబద్ధం చేయాల్సిన అవసరముందని కూడా డిష్ టీవీ, టాటా స్కై అభిప్రాయ పడ్డాయి.  ఈ రెండూ గణనీయమైన మొత్తాలు ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ప్రస్తుతం ఎన్ ఒ సిసి కింద ఒక్కో మెగాహెర్ట్జ్ కి రూ.60,000, డబ్ల్యు పిసి కి ఒక్కో మెగా హెర్ట్జ్ కి రూ.90,000 చొప్పున  చెల్లిస్తున్న విషయం గుర్తు చేస్తూ అన్ని క్లియరెన్సులూ పొందటానికి పెద్దమొత్తంలో ఖర్చవుతోందని పేర్కొన్నాయి.

డబ్ల్యు పి సి, ఎన్ ఒ సి సి అనేవి కేవలం పాలనాపరమైన అనుమతులే కాబట్టి అంత పెద్ద మొత్తంలో వసూలు చేయాల్సిన అవసరం లేదని టాటా స్కై అభిప్రాయపడింది. ఇలాంటివి నామమాత్రపు చార్జీలతో సరిపెట్టటం సమంజసమని ట్రాయ్ కి సూచించింది. ఆయాశాఖలకయ్యే ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి తప్ప క్లియరెన్సుల పేరుతో అదనంగా ఆదాయం సమకూర్చుకునే ధోరణి సమంజసం కాదని గుర్తుచేసింది.

ఎన్ ఒ సి సి లక్ష్యం డిటిహెచ్ ప్రసారాల పర్యవేక్షణే అయినా, ఆచరణలో అలాంటిదేమీ జరగటం లేదని వీడియోకాన్ తన లేఖలో ప్రస్తావించింది. విదేశీ ఉపగ్రహాల ద్వారా ప్రసారాలు జరుగుతున్నప్పుడు ఎన్ ఓ సి సి కి ఎలాంటి పాత్రా లేకపోవటమ్ కూడా గమనించాల్సి ఉందని గుర్తుచేసింది. ప్రస్తుతం అధికభాగం డిటిహెచ్ సంస్థలు విదేశీ ఉపగ్రహాల సేవలనే వాడుకోవటం వలన ఎన్ వో సి సి అవసరమే లేదని కూడా పేర్కొంది. ఒకసారి లైసెన్స్ వచ్చిన తరువాత మాటిమాటికీ అదనపు అనుమతుల పేరుతో ఆలస్యం చేయటం మంచిది కాదన్నారు.

డైరెక్టర్ల సెక్యూరిటీ క్లియరెన్స్ నిబంధన సైతం డిటిహెచ్ ఆపరేటర్లకు ఇబ్బందికరంగా తయారైందని, డైరెక్టర్లుగా నియమించుకోగానే అనుమతులు రావటం లేదని గుర్తుచేశాయి. అందుకే ఇప్పుడున్న విధానాన్ని సవరించి డైరెక్టర్ల నియామకాన్ని సులభతరం చేయాలని డిటిహెచ్ ఆపరేటర్లు ట్రాయ్ కి విజ్ఞప్తిచేశారు. ప్రతి మూడు నెలలకొకసారి సమర్పించే పి ఎం ఆర్ ను పూర్తిగా రద్దు చేయాలని, లేని పక్షంలో సమీక్షించి సరళీకృతం చేయాలని డిటిహెచ్ ఆపరేటర్లు సూచించారు. డిటిహెచ్ ఆపరేటర్లకు ఆయా ప్రభుత్వ సంస్థలు, శాఖలు డిజిటల్ ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా డిటిహెచ్ ఆపరేటర్లు నేరుగా విదేశీ శాటిలైట్ యాజమాన్యాలతో బేరసారాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యలో యాంట్రిక్స్ కార్పొరేషన్ ప్రమేయాన్ని తొలగించాలని కోరారు. లైసెన్స్ ఒప్పందంలోని టెక్నికల్ ఇంటరాపరబిలిటీ నిబంధన స్థానంలో కమర్షియల్ ఇంటరాపరబిలిటీ నిబంధన చేర్చాలని రిలయెన్స్ డిజిటల్ కోరింది. దీనివలన  సెట్ టాప్ బాక్స్ ధర రూ. 125 నుంచి రూ.300 వరకు తగ్గుతుందని, ఇది విదేశీ మారకద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఆదా చేసుకోవటానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. డిటిహెచ్ లైసెన్స్ నిబంధనలలోని ఆర్టికిల్ 10 ని సవరించాల్సిన అవసరముందని, దీని వలన శాటిలైట్ సాయంతో ఇంటరాక్టివ్ సేవలు అందించే అవకాశముంటుందని కూడా రిలయెన్స్ డిజిటల్ సూచించింది.

పదిహేనేళ్ళు నిండిన డిటిహెచ్ : డిష్ టీవీకి లైసెన్స్ పొడిగింపు

భారతదేశంలో డైరెక్ట్ టూ హోమ్ ప్రసారాలకు అనుమతించి పదిహేనేళ్లయింది. కేబుల్ ఆపరేటర్ తో పనిలేకుండా, ఆ మాటకొస్తే కేబుల్ అవసరమేలేకుండా నేరుగా ఇంటికి ప్రసారాలు అందే వ్యవస్థ కు శ్రీకారం చుడుతూ 2003 అక్టోబర్ 1న డిష్ టీవీకి పదేళ్ళ లైసెన్స్ ఇచ్చారు. ఇప్పుడాపదేళ్ళ వ్యవధి పూర్తయినా, ప్రభుత్వం ఎలాంటి విధానమూ రూపొందించలేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా లైసెన్స్ పొడిగించినట్టు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో డిష్ టీవీ తన వ్యాపార కార్యకలాపాలను యధావిధిగా సాగించే వీలు కలిగింది. ప్రస్తుతం దేశంలో ఆరుగురు డిటిహెచ్ ఆపరేటర్లుండగా ఒక్క డిష్ టీవీ పరిధిలోనే కోటి మందికి పైగా చందాదారులున్నారు.

డిటిహెచ్ లైసెన్సుల జారీకి ఇప్పుడున్న నిబంధనలమీద అభ్యంతరాలు, కొత్త సూచనలు పంపాల్సిందిగా కోరుతూ ట్రాయ్ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. లైసెన్స్ ఇచ్చే సమయంలో ఫీజు వసూలు చేయటం సమర్థనీయమా, ఎంతమొత్తం ఉండాలి తదితర అంశాలమీద అభిప్రాయ సేకరణ జరిపింది. అదే విధంగా ఏటా వసూలు చేయాల్సిన ఫీజు ఉండాలా, ఆదాయంలో వాటా ఉండాలా అనే విషయం మీద కూడా సంబంధితులనుంచి అభిప్రాయాలు కోరింది. అలా వచ్చిన అభిప్రాయాల  ఆధారంగా సిఫార్సులు రూపొందించి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపింది.