• Home »
  • DTH »
  • డిజిటైజేషన్ తో నష్టం డిటిహెచ్ కి, లాభం చానల్స్ కి

డిజిటైజేషన్ తో నష్టం డిటిహెచ్ కి, లాభం చానల్స్ కి

DTH Operatorsమార్పు శాశ్వతమైనది. మార్పు మంచికే. కానీ చూడబోతే మార్పు ప్రతిసారీ మంచికి కాకపోవచ్చునని పిస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఆన్ లైన్ వీడియోలకు ఊతమిస్తుండగా అది బ్రాడ్ కాస్టర్లకు ఒక పెద్ద వరంలా మారింది. అయితే, అదే సమయంలో నష్టపోతున్నది మాత్రం డిటిహెచ్ ఆపరేటర్లు.

బాంక్ ఆఫ్ అమెరికా, మెర్రిల్ లించ్ జరిపిన పరిశోధన ఫలితాల నివేదిక ఒకటి ఈ మధ్యనే విడుదలైంది. పశ్చిమ దేశాల తరహాలో ఆన్ లైన్ వీడియో కంటెంట్ వలన భారతదేశపు పే టీవీ మార్కెట్ బాగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. బ్రాడ్ కాస్టర్లకు ఎలాగూ ప్రకటనలద్వారా వచ్చే ఆదాయం ఎలాగూ ఉంటుంది. కానీ డిటిహెచ్ ఆపరేటర్లకు మాత్రం సగటు తలసరి తక్కువగా ఉండటం వల్ల నష్టాలు తప్పకపోవచ్చు. పైగా ధరలను బాగా పట్టించుకునే భారత వినియోగదారుడు ఒకవైపు ఆన్ లైన్ లో కంటెంట్ దొరుకుతుండగా ప్రీమియం ధరలు చెల్లించటానికి ఇష్టపడే పరిస్థితి ఉండదు.

బ్రాడ్ కాస్టర్లు మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా తమ కంటెంట్ మీద డబ్బు సంపాదించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఫలితంగా ప్రకటనల ఆదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికరంగం పుంజుకోవటం అందుకు కారణం. డిజిటైజేషన్ నేపథ్యంలో ఒకవైపు కనెక్టివిటీ కచ్చితమైన సంఖ్యలు వెల్లడికావటం వల్ల, మరో వైపు కంటెంట్ కు అదనపు ఆదాయం రావటం వలన బ్రాడ్ కాస్టర్లకు మెరుగైన పరిస్థితి ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది.

అదే సమయంలో డిటిహెచ్ కంపెనీలకు మాత్రం డిజిటైజేషన్ లో ఆలస్యం జరుగుతున్నప్పటికీ ఒక్కో కనెక్షన్ కి వచ్చే సగటు ఆదాయంలో మెరుగుదల ఉంటుందని విశ్లేషించింది. హెచ్ డి చానల్స్ పెరగటం ఒక కారణమైతే, నెలవారీ చందాలు అవసరాలకు తగినట్టుగా వేరు వేరుగా ఉండటం రెండో కారణం. ఎమ్మెస్వోలు లాభదాయకత కోసం నెలవారీ చందాలు పెంచటం కూడా డిటిహెచ్ ఆపరేటర్లకు కలిసి వస్తున్న మూడో అంశం. ఇంతకుముందు ఎమ్మెస్వోల ధరకూ, డిటిహెచ్ ధరకూ తేడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎమ్మెస్వోలు కూడా భారీగా పెంచటం వలన చందాదారులు డిటిహెచ్ కే మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది.
చానల్స్ తరఫున జీ టీవీని, డిటిహెచ్ తరఫున డిష్ టీవీని పరిగణనలోకి తీసుకుంటూ మెర్రిల్ లించ్ ఈ విశ్లేషణ చేసింది. రిస్క్ లను కూడా లెక్కలోకి తీసుకుంటూ సాగిన ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలనే తన నివేదికలో పొందుపరచింది. ఈ నివేదిక ప్రకారం జీ టీవీ పనితీరు ఎనిమిది శాతం తక్కువగా కనబడింది. కొత్త చానల్స్ లో పెట్టుబడులు పెట్టటం లాంటి కారణాలవలన మార్కెట్ వాటాలో తగ్గుదల నమోదైంది.  షేర్ ధరలో తగ్గుదలను గమనించిన తరువాత రిస్క్ కు తగిన ఫలితముందేమో విశ్లేషించినప్పుడు ఆశాజనకంగా కనబడలేదు. కొత్త కంటెంట్ వలనగాని, ప్రకటనలలో పెరుగుదలగాని, డిజిటైజేశ్జన్ ప్రయోజనాలుగాని పెద్దగా అనుకూలించలేదని ఆ నివేదిక పేర్కొంది.

ఇక డిష్ టీవీ విషయానికొస్తే, డిజిటైజేషన్ అనివార్యమే అయినప్పటికీ, అంచనాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పూర్తి ఫలితాలు అందుబాటులోకి రావటానికి 2020-21 సంవత్సరం వరకు డిటిహెచ్ వేచి ఉండాల్సిందేనన్న విషయం స్పష్టమవుతుందని నివేదిక భావిస్తోంది. అయినా సరే, వచ్చే ఏడాది కాలంలో ఒక్కో కనెక్షన్ సగటు ఆదాయం పెరగటానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఎమ్మెస్వోలు లాభాలు నిలకడగా ఉండటం కోసం చందా ధరలు పెంచటం 2. హెచ్ డి చానల్స్ బాగా అందుబాటులోకి రావటం 3. పట్టణ ప్రాంతాల్లో వేరువేర్తు చందారేట్లు అందుబాటులోకి రావటం. దీంతో మార్కెట్లో డిష్ టీవీ 65 శాతం అదనపు సామర్థ్యం కనబరచింది.

డిజిటైజేషన్ ఎదుగుదల నెమ్మదిగా సాగుతుందని ఈ నివేదిక పేర్కొంది. మార్కెట్ ఊహిస్తున్నదానికంటే డిజిటైజేషన్ వేగం చాలా తక్కువగా ఉన్నదని చెబుతూ, ఇందుకు ప్రధాన కారణం డిజిటైజేషన్ శక్తి సామర్థ్యాలను పంపిణీదారులైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో సరిగా అంచనా వేయకపోవటమేనని విశ్లేషించింది. పైగా, డిజిటైజేషన్ ఫలాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే లోగానే కొత్త తరం విచ్ఛిన్నకారులైన ఇంటర్నెట్ ఆధారిత మొబైల్, టీవీ-పిసి దాని ఆదాయంలోకి చొరబడి తినేయటం మొదలవుతుంది. పశ్చిమదేశాల్లో ఇలాగే ఎమ్మెస్వోలకు ఇదే పరిస్థితి ఎదురైంది.

అంతే కాకుండా, మొదటి రెండు దశల డిజిటైజేషన్ లో ఊహించిన ప్రయోజనాలు సంబంధిత వర్గాలకు అందుబాటులోకి రాలేదు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య కొనసాగుతున్న ప్రతిష్ఠంభన కాగా, కస్టమర్ బిల్లింగ్ వ్యవహారం మరో కారణం. దీన్ని పరిష్కరించటానికి కొంత ప్రయత్నం జరుగుతున్నమాట నిజమే అయినా, ఇంకా పూర్తి స్థాయిలో సమస్య ఒక కొలిక్కి రాలేదు. మూడు, నాలుగు దశలు వేగం పుంజుకునేకొద్దీ ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. డిజిటైజేషన్ వేగం పుంజుకుంటున్నకొద్దీ, వచ్చే కొద్ది సంవత్సరాలలో భారత మీడియా రంగంలో అనేక మార్పులు రావటం, ఆన్ లైన్ కంటెంట్ పోటీ పెరగటం కారణంగా బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు ఎవరికి వాళ్ళు సరైన బిజినెస్ మోడల్ ఎంచుకుంటారు.

బ్రాడ్ కాస్టర్లకే అనుకూలం

స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల కారణంగా ప్రకటనల ఆదాయం పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. రకరకాల కంటెంట్ తో లబ్ధి పొందాలనుకుంటున్న జీ గ్రూప్ వంటివి ఆ ట్రెండ్ ని సమర్థంగా వాడుకుంటాయని భావిస్తోంది. ప్రేక్షకుల రద్దీ మెల్లగా మొబైల్, టాబ్ వంటి స్మార్ట్ డివైస్ ల వైపు మారేకొద్దీ వీడియో కంటెంట్ వాడకం బాగా పెరిగిపోతుంది. దీనివలన బ్రాడ్ కాస్టర్లు తమ కంటెంట్ మీద డబ్బు సంపాదించుకోవటం కూడా బాగా పెరిగిపోతుంది. ఆ విధంగా ఒకవైపు డిజిటైజేషన్ లాభాలు, మరోవైపు మల్టిపుల్ ప్లాట్ ఫామ్స్ కారణంగా వచ్చే అదనపు ఆదాయాలు చానల్ యజమానులకు వరంగా మారబోతున్నాయి. అదే సమయంలో ఆన్ లైన్ కంటెంట్ కి డబ్బు చెల్లించటానికి పెద్దగా ఇష్టపడని భారత ప్రేక్షకుల సంఖ్య అపరిమితంగా ఉండటం వలన ప్రకటనల ఆదాయానికి ప్రాధాన్యం పెరిగిపోతుంద

డిటిహెచ్: సగటి ఆదాయం పెరుగుదల

డిజిటైజేషన్ వేగం తగ్గువగా ఉన్నప్పటికీ, డిష్ టీవీ లాంటి కంపెనీలు వచ్చే 12-18 నెలల్లో వాటి సగటు కనెక్షన్ ఆదాయాన్ని పెంచుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా సగటు ఆదాయం పెరగటానికి ప్రధానంగా కనిపిస్తున్న కారణాలివి: 1. చందామొత్తాలు పెంచాల్సిందిగా చానల్ యజమానులనుంచి ఎమ్మెస్వోలు తీవ్రమైన వత్తిడి ఎదుర్కుంటున్నారు. 2. హెచ్ డి చానల్స్ బాగా అందుబాటులోకి వస్తున్నాయి. 3. డిష్ టీవీ లాంటి సంస్థలు ఎక్కడికక్కడ వేరు వేరు ధరల విధానాన్ని అమలు చేస్తున్నాయి. జింగ్ లాంటి ఆఫర్లతో లాభాలౌ సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నాయి.

ఎమ్మెస్వోలు : బ్రాడ్ బాండ్ పాత్ర కీలకం
ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఎమ్మెస్వోలకు డిజిటైజేషన్ పూర్తి లాభాలు అందటం మొదలవుతుంది. అప్పుడే ఎమ్మెస్వోలు ఇతర ఆదాయ మార్గాలమీద దృష్టిపెడతారు. ఎమ్మెస్వోలు బ్రాడ్ బాండ్ కవరేజ్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని బాంక్ ఆఫ్ అమెరికా, మెర్రిల్ లించ్ అధ్యయనంలో తేలింది. దీనివలన ఆదాయం పెరగటంతోబాటు చందాదారులమీద మరింత పట్టు పెరిగే అవకాశముంటుందని ఎమ్మెస్వోలు భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెస్వోలు జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణప్రాంతాల్లో హై స్పీడ్ బ్రాడ్ బాండ్ మీద ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. మెల్లగా చిన్నపట్టణాలకూ, మేజర్ గ్రామ పంచాయతీలకూ విస్తరిస్తారు.

ప్రధానమైన్ రిస్క్ లు

  1. ఆర్థిక రంగం పుంజుకోవటం లేదు. ఊహించిన దానికంటే వేగం తక్కువైన పక్షంలో దాని ప్రభావం వలన ముందుగా అంచనా వేసుకున్న ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోవచ్చు.
  2. ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య వివాదాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవటం మరో సమస్య. చందాదారుల వివరాలను ఎమ్మెస్వోలకు ఇవ్వటానికి ఆపరేటర్లు ఒప్పుకోవటం లేదు. తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. దీనివలన ఎమ్మెస్వోల సగటు కనెక్షన్ ఆదాయం మీద దెబ్బ పడవచ్చు.
  3. పైరసీకి ఆస్కారముంది. ఆన్ లైన్ కంటెంట్ పెద్ద ఎత్తున పెరగటం వల్ల, వాడకానికి కొత్త మాధ్యమాలు అందుబాటులోకి రావటం వల్ల పైరసీ విజృంభించే ప్రమాదముంది. అలాంటి పరిస్థితిలో కంటెంట్ ను ఆదాయంగా మార్చుకోవటం కష్టమవుతుంది కాబట్టి అది మొత్తం పరిశ్రమనూ ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.