• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ తరువాత విశాఖలో భారీగా పెరిగిన వినోదపు పన్ను వసూళ్ళు

డిజిటైజేషన్ తరువాత విశాఖలో భారీగా పెరిగిన వినోదపు పన్ను వసూళ్ళు

డిజిటైజేషన్ వలన ప్రజలు బాగా లబ్ధిపొందుతారనే ప్రచారం జరిగినప్పటికీ అసలు లబ్ధిదారులు పే చానల్ యజమానులు, ఆ తరువాత ప్రభుత్వమేనన్నది కొద్దికాలంలోనే తేలిపోయింది. ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఒక మోస్తరుగా లాభం పొందినా అధిక భారం పడి నష్టపోయింది మాత్రం సామాన్య ప్రేక్షకులేనని ఇప్పుడు అర్థమైంది.

వినోదపు పన్ను వసూళ్ళమీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటికే మొదటి రెండు దశలు పూర్తయిన నగరాల్లో వినోదపు పన్ను వసూళ్ళు 2 నుంచి 3 రెట్లు పెరగటమే అందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి దశలో ఒక్క నగరమూ లేకపోగా రెండో దశలో హైదరాబాద్, విశాఖపట్టణం ఉన్నాయి.

విశాఖ నగరంలో 2012-13 సంవత్సరంలో డిజిటైజేషన్ కు ముందు వినోదపు పన్ను కింద రూ.2 కోట్ల 46 లక్షల 20 వేలు వసూలు కాగా డిజిటైజేషన్ అమలు జరుగుతూ ఉండగా 2013-14 లో అది దాదాపు 30శాతం ఒఎరిగి రూ. 3 కోట్ల 15 లక్షల 70 వేల రూపాయలకు చేరింది. ఆ తరువాత సంవత్సరం 2014-15 లో దాదాపు 140 శాతం పెరిగి రూ. 7 కోట్ల 49 లక్షల 30 వేలకు చేరింది.

ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే సామర్థ్యం రావటం వలన కారేజ్ ఫీజు 30 శాతం మేరకు తగ్గినట్టు కూడా ఎం ఐ బి తేల్చింది. ఆరు న్యూస్ చానల్స్, నలుగురు ఎమ్మెస్వోలు అందించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. అదే సమయంలో  పే చానల్స్ చందా ఆదాయాలు 40 శాతం మేరకు పెరిగాయి. కనెక్షన్ల సంఖ్యలో పారదర్శకత కారణంగానే ఆదాయం పెరిగినట్టు స్పష్టంగా కనబడుతోంది.