• Home »
  • Cable »
  • వినోదపు పన్నును జి ఎస్ టి లోనే కలపాలి: ఎమ్మెస్వోలు

వినోదపు పన్నును జి ఎస్ టి లోనే కలపాలి: ఎమ్మెస్వోలు

ఒక్కో రాష్టంలో ఒక్కో విధంగా అపరిమితంగా విధిస్తున్న వినోదపు పన్నును ఇక మీదట జి ఎస్ టి లో భాగం చేయటం ద్వారా కేబుల్ పరిశ్రమ మీద, ప్రధానంగా ప్రేక్షకుల మీద భారం తగ్గించాలని ఆలిండియా డిజిటల్ కేబుల్ సమాఖ్య విజ్ఞప్తి చేసింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్ టి ) మీద ఏర్పాటైన్ సెలెక్ట్ కమిటీని కలిసి ఈ మేరకు తన వినతి పత్రాన్ని అందజేసింది.

ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వినోదపు పన్ను విధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సెలెక్ట్ కమిటీ దృష్టికి తెచ్చారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్కో కేబుల్ కనెక్షన్ కు రూ. 45 చొపున వసూలు చేస్తున్నారని, ఇటీవలే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 నుంచి రూ.40 కి పెంచిందని గుర్తు చేశారు. దీంతో ఇప్పటికే రకరకాల పన్నుల భారం మోస్తున్న టీవీ పరిశ్రమ మరింతగా సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కొన్ని చోట్ల రాష్ట్రప్రభుత్వాలకు తోడు మున్సిపాలిటీలు సైతం వినోదపు పన్ను విధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, మున్సిపాలిటీలలోనూ వినోదపు పన్నును జి ఎస్ టి లోనే అంతర్భాగం చేయాలని కోరుతునట్టు డిజిటల్ కేబుల్ సమాఖ్య చెప్పింది. దీనివలన ఒకే విధమైన పన్ను విధానం అమలు చేసినట్టవుతుందని కూడా సమాఖ్య అభిప్రాయపడింది. ఇలా ఉండగా డిటిహెచ్ ఆపరేటర్ల సంఘం కూడా ఇదే రకమైన వినతి పత్రాన్ని జి ఎస్ టి సెలెక్ట్ కమిటీ కి అందజేసింది.