• Home »
  • BARC »
  • నెం.1 స్థానం నిలబెట్టుకున్న ఈటీవీ

నెం.1 స్థానం నిలబెట్టుకున్న ఈటీవీ

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇస్తున్న టీవీ రేటింగ్స్ లో ఈటీవీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏడాది 49 వ వారానికి గాను తాజా రేటింగ్స్ సమాచారం వెలువడగా తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఈటీవీ ముందంజలో ఉంది. ఇప్పటికే కొద్దివారాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉండటంతో ఈటీవీ తెరమీద ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వస్తున్న విషయం ప్రేక్షకులు గమనించే ఉంటారు.

ఈటీవీ తెలుగు నెంబర్ వన్ స్థానం సంపాదించుకోగా, అంతకంటే దాదాపు 20 శాతం తక్కువ ఆదరణ పొందిన జీ తెలుగు రెండో స్థానంలో ఉంది. కొద్దిపాటి తేడాతో మాటీవీ మూడో స్థానానికి పరిమితమైంది. మొదటి స్థానంలో ఉన్న ఈటీవీ కంటే దాదాపు 40 శాతం ప్రేక్షకాదరణ తక్కువగా నమోదు చేసుకున్న జెమిని టీవీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, జెమిని మూవీస్ కి ఐదో స్థానం దక్కింది.

దక్షిణాదిన ఒక్క తమిళంలో తప్ప సన్ నెట్ వర్క్ చానల్స్ ఎక్కడా నెంబర్ వన్ స్థానంలో లేకపోవటం గమనార్హం. పదిహేనేళ్ళకు పైగా తెలుగులో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన జెమినీ టీవీ సైతం ఇప్పుడు తెలుగులో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే విధంగా కన్నడలో కలర్స్ కన్నడ, సువర్ణ మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఉదయ మూవీస్ మూడో స్థానంలో, ఉదయ మెయిన్ చానల్ ఐదో స్థానంలో ఉన్నాయి. మలయాళంలో కూడా సన్ గ్రూప్ వారి సూర్య టీవీ మూడో స్థానానికి పరిమితమైంది.