• Home »
  • BARC »
  • తెలుగులో నెంబర్ వన్ చానల్ ఈటీవీ : జీ తెలుగు కు రెండో రాంక్

తెలుగులో నెంబర్ వన్ చానల్ ఈటీవీ : జీ తెలుగు కు రెండో రాంక్

అధికభాగం ప్రాంతీయ చానల్స్ తరహాలోనే తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లోనూ ప్రేక్షకాదరణ లో పెద్దగా మార్పు కనబడలేదు. ఈ ఏడాది ఐదోవారానికి సంబంధించిన బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగేళ్ళు పైబడిన ప్రేక్షకాదరణ ఆధారంగా ఈ లెక్కింపు జరిగింది.

ఈటీవీ తెలుగు తన మొదటి స్థానాన్ని కొనసాగించింది. జీ తెలుగు రెండో స్థానంలో ఉండగా మాటీవీ మూడో స్థానానికే పరిమితమైంది. జెమిని టీవీ తన నాలుగో స్థానంలోనే మిగిలిపోయింది. ఈటీవీకి 42,68,74,000, జీ తెలుగుకు 37,03,62,000, మా టీవీకి 36,46,18,000, జెమిని టీవీకి 19,45,87,000 పాయింట్లు లభించాయి.

కన్నడ మార్కెట్లో కలర్స్ కన్నడ రేటింగ్స్ లో కొంత తగ్గుదల నమోదైనా తన మొదటి స్థానాన్ని కాపాడుకుంది. జీ కన్నడ చానల్ కు గతవారం కంటే రేటింగ్స్ స్వల్పంగా పెరిగినా రెండో స్థానంలోనే ఉంది.  ఉదయ మూవీస్ మూడో స్థానానికి ఎగబాకగా, సువర్ణ టీవీ నాలుగో రాంకుకు పడిపోయింది.ఉదయ టీవీ కేవలం ఐదో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

తమిళంలో ఎప్పటిలాగే సన్ టీవీ తన తిరుగులేని ఆధిక్యంతో మొదటి స్థానంలో ఉంది. కేవలం అందులో 30 శాతమే తెచ్చుకున్న సన్ గ్రూప్ వారి మరో చానల్ కె టీవీ రెండో స్థానంలో ఉంది. స్టార్ విజయ్ మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చింది.  అయితే, పాలిమర్ టీవీ ఒక స్థానం పెరిగి నాలుగో రాంక్ దక్కించుకుంది. గతవారం నాలుగో స్థానంలో ఉన్న జీ తమిళ్ ఇప్పుడు మరింత పడిపోయి ఐదో స్థానానికి దిగజారిపోయింది.

మలయాళంలో ఏషియానెట్ మొదటి స్థానం కొనసాగిస్తూ ఉండగా అందులో కేవలం ముప్పైశాతమే ఉన్న మనోరమ గ్రూప్ వారి మళవిల్ మనోరమ రెండో స్థానంలో ఉంది. ఫ్లవర్స్ టీవీ మూడో స్థానంలోనే కొనసాగుతూ ఉండగా ఏషియానెట్ మూవీస్ నాలుగో స్థానానికి ఎగబాకింది. గతవారం ఐదో స్థానంలో ఉన్న సూర్య టీవీ ఒక స్థానం దిగజారి ఐదో స్థానానికి వచ్చింది.

మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మరాఠీలో వరుసగా ఐదు చానల్స్ అదే క్రమంలో ఉండిపోయాయి. జీ మరాఠీ తన మొదటి స్థానం కాపాడుకున్నట్టే కలర్స్ మరాఠీ రెండో స్థానంలో ఉండిపోయింది. జీ టాకీస్ మూడో స్థానంలో ఉండగా స్టార్ ప్రవాహ్ నాలుగో స్థానంలోనే ఉంది. ఇలా ఉండగా ఐదో స్థానంలో మైబోలి చానల్ కొనసాగుతోంది.

ఒడిశాలో సార్థక్ టీవీ తన మొదటి స్థానాన్ని ఈ వారం కూడా కొనసాగించింది. అయితే రెండో స్థానంలో ఉన్న తరంగ్ టీవీకి కేవలం నాలుగో వంతు ప్రేక్షకాదరణ మాత్రమే లభించింది.  కలర్స్ ఒడియా కు మూడో స్థానం రాగా ఒడిశా టీవీకి నాలుగో స్థానందక్కగా కొత్తగా మొదలైన అలంకార్ టీవీ కి ఐదో స్థానం దక్కటంతో  ప్రార్థన టీవీ టాప్ ఫైవ్ జాబితా నుంచి వైదొలగాల్సి వచ్చింది.

బెంగాలీ మార్కెట్లో స్టార్ జల్సా మొదటి స్థానంలో ఉండగా అందులో 55 శాతం కంటే తక్కువగా ఉన్న జీ బంగ్లా రెండో స్థానంలో ఉంది.  జల్సా మూవీస్ మూడో రాంక్ తెచ్చుకోగా, జీ బంగ్లా సినిమా ఒక స్థానం పైకి ఎదిగి నాలుగా స్థానంలోకి రాగా , కలర్స్ బంగ్లా ఒక స్థానం పడిపోయి ఐదో రాంకుకు పడిపోయింది.

 

భోజ్ పురి మార్కెట్లో మొత్తంగా రేటింగ్స్ తగ్గినప్పటికీ బిగ్  గంగా మొదటి స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో గణనీయంగా రేటింగ్స్ తగ్గిన భోజ్ పురి సినిమా తన మొదటి స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి దిగజారింది. దబాంగ్ మూడో స్థానం నిలబెట్టుకోగా దంగల్ టీవీ నాలుగో స్థానంలో ఉండిపోయింది. ఈటీవీ బీహార్ ఝార్ఖండ్ ఐదో స్థానంలో మిగిలింది.