• Home »
  • Broadcasting »
  • ముంబయ్ ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సుతోబాటే అంతర్జాతీయ ప్రసారాల మార్కెట్

ముంబయ్ ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సుతోబాటే అంతర్జాతీయ ప్రసారాల మార్కెట్

భారత వాణిజ్య, పరిశ్రమల మండలుల సమాఖ్య (ఫిక్కీ) మార్చి 5-7 తేదీల మధ్య ముంబయ్ లోని గ్రాండ్ హయత్ ఓ ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. దీంతోబాటే అంతర్జాతీయ కంటెంట్ మార్కెట్ కు కూడా వేదిక సిద్ధం చేసింది.దాదాపు 50 దేశాలకు చెందిన ప్రసారాల అమ్మకపు సంస్థలు, కొనుగోలు దారులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వైస్, స్టార్ ఇండియా,సిబిఎస్, వయాకామ్ 18 తోబాటు అనేక జాతీయ అంతర్జాతీయ ఒటిటి వేదికల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

అసియా ఖండంలో తయారవుతున్న కంటెంట్, మరీ ముఖ్యంగా భారత కంటెంట్ అమ్ముకోవటానికి ఇదొక కీలకమైన వేదికగా తయారవుతుందని భావిస్తున్నారు. ఇందులో సినిమా, టీవీ,డాక్యుమెంటరీ, యానిమేషన్ విభాగాలుంటాయి. ఒటిటి వేదికలు విపరీతంగా పెరిగిపోతూ ఉండటం, కాపీరైట్ హక్కులు కచ్చితంగా అమలవుతూ ఉండటం దీనికి ప్రాధాన్యం తెచ్చిపెడుతోంది.  భారతదేశంలో ఏటా సగటున 1500 చిత్రాలు తయారవుతూ ఉందటం, దాదాపు 900 టీవీ చానల్స్ ఉండటం గమనార్హం.

మార్కెట్ విభాగంలో అమ్మకం దారులు, కొనుగోలుదారులు ఉంటారు. విదేశీ సంస్థలు భారత్ లో అమ్మటానికి, భారత సంస్థల కార్యక్రమాలు విదేశీ సంస్థలకు అమ్మటానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది.   బాగా పెరుగుతున్న ఒటిటి వేదికలు ఈ అవకాశాన్ని వాడుకోవటానికి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాయి. ఈ మధ్యనే హాట్ స్టార్ ఆన్ లైన్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరపటం, కొరియన్, టర్కిష్ చిత్రాలు కూడా ప్రదర్శించటం చూస్తే అంతర్జాతీయ మార్కెట్ వైపు అందరికళ్ళూ ఉన్నాయని అర్థమవుతూ ఉంది.