టీవీ పరిశ్రమపై ఫిక్కీ నివేదిక – 2014

2014 లో టీవీ పరిశ్రమ చాలా చురుకైన వాతావరణంలో ముందుకు సాగింది. ఒకవైపు డిజిటైజేషన్ ప్రక్రియ సాగుతుండగా అడ్రెసబిలిటీ పెరగటం, ఎమ్మెస్వోల లాభదాయకతలో కనబడుతున్న మార్పు, పే చానల్స్ కు వచ్చే చందా ఆదాయాలు పెరగటం, డిటిహెచ్ చందాల్లో పెరుగుదల లాంటి పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకున్నాయి. కంటెంట్ అగ్రిగేటర్ల మీద ట్రాయ్ ఉక్కుపాదం మోపినప్పటికీ పెద్ద పెద్ద చానల్ గ్రూపులమీద అంతగా ప్రభావం కనబడలేదు. అయితే, చిన్న చానల్స్ మీద మాత్రం ఆ ప్రభావం స్పష్టంగా కనబడే అవకాశాలున్నాయి. ఏడాది ముగిసే సమయంలో స్టార్ ఇండియా సంస్థ ఆని చానల్స్ నూ పారదర్శకంగా రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ విధానంలో ఒప్పందం మేరకు ఇవ్వాలని నిర్ణయించుకోవటం, చానల్ ప్లేస్ మెంట్, అందుబాటు ఆధారంగా ఎమ్మెస్వోలు ప్రోత్సాహకాలు ప్రకటించటం ఒక ప్రత్యేకత. దీనివలన ఎమ్మెస్వోలు తమదైన పద్ధతిలో ప్యాకేజీలు ప్రకటించి ధరలు పెంచే అవకాశముంది. ఫలితంగా పరిశ్రమలోని అన్ని వర్గాలూ లబ్ధిపొందుతాయి.. కానీ ఇతర పెద్ద చానల్స్ కూడా మద్దతు తెలిపినప్పుడే ఇది విజయవంతమవుతుంది. అయితే, 2015 లో ప్రధానంగా చూడాల్సిన విషయమేంటంటే ఎమ్మెస్వోలు ఎంత సమర్థంగా మొదటి రెండు దశల డిజిటైజేషన్ జరిగిన చోట్ల చానెల్ పాకేజింగ్ అమలుచేస్తారనేది. అదే విధంగా మూడోదశలో సెట్ టాప్ బాక్స్ ల అమరిక ఎంతగా ముందడుగు వేస్తుందనేది.

ఎన్నికల సంవత్సరం కావటం వల్ల సహజంగానే ప్రకటనల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆర్థిక వాతావరణం చురుగ్గా ఉండటం కూడా బాగానే అనుకూలించింది. కంపెనీలు ప్రకటనలమీద బాగానే ఖర్చుపెట్టాయి. మీడియా లో ఈ-కామర్స్ ఒక కీలక రంగంగా మారింది. ఆ తరువాత మొబైల్ ఫోన్ల హవా కనబడింది. సంప్రదాయ భారీ ప్రకటనకర్తలైన ఎఫ్ ఎమ్ సీ జీ, ఆటోమొబైల్స్ కూడా మరింత అభివృద్ధి చవిచూశాయి. ఇదే విధమైన టీవీ ప్రకటనల ఆదాయ ధోరణి 2015 లోనూ కొనసాగుతుందని మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. టామ్ స్థానంలో ఈ ఏడాది మొదలవుతున్న సరికొత్త ప్రేక్షకాదరణ లెక్కింపు విధానం బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) వలన ప్రకటనలమీద వెచ్చించే విధానంలో గణనీయమైన మార్పులు రావచ్చునని భావిస్తున్నారు. శాంపిల్ సైజు పెంచటం, కొత్తమార్కెట్ల లెక్కింపు అందుకు ప్రధాన కారణాలు.

2014 లో భారత టీవీ పరిశ్రమ పరిమాణాన్ని 47,500 కోట్ల రూపాయలుగా అంచనావేశారు. అది ఏటా 15.5 శాతం చొప్పున పెరుగుతూ 2019 నాటికి 97500 కోట్లకు చేరుకుంటుందని భారత వాణిజ్య, పరిశ్రమల మండల్ల సమాఖ్య తేల్చింది. పే చానల్స్ కోసం వచ్చే చందాల ఆదాయం 16 శాతం చొప్పున పెరుగుతూ, 14 శాతం చొప్పున పెరిగే ప్రకటనల అదాయాన్ని సైత మించి పోతుందని ఫిక్కీ అంచనావేసింది. దీనికి ప్రధాన కారణంగా డిజిటైజేషన్ ను చూపిస్తోంది.

పే చానల్స్ తీసుకునే కేబుల్ కనెక్షన్ల సంఖ్య 2019 నాటికి 90 శాతానికి చేరుకుంటుందని కూడా ఫిక్కీ అధ్యయనం తేల్చింది. నిజానికి భారతదేశంలో టీవీ ఉన్న ఇళ్ళ సంఖ్య 2014 నాటికి 16 కోట్ల 80 లక్షలకు చేరింది. అంటే మొత్తంలో 61 శాతం ఇళ్లలో టీవీ ఉన్నట్టు లెక్క. కేబుల్ టీవీ చందాదారుల సంఖ్య 2014 లో కోటి పెరిగింది. ఆ విధంగా అది 14 కోట్ల 90 లక్షలకు చేరింది. డిడి డైరెక్ట్ ని మినహాయిస్తే, కేబుల్ లో పే టీవీ చందాదారుల సంఖ్య సుమారు 13 కోట్ల 90 లక్షలు. అంటే, కేబుల్ టీవీ 82 శాతం ఇళ్లకు చేరినట్టు. ఇది 2019 నాటికి 90 శాతం ఇళ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ 17 కోట్ల 50 లక్షలకు చేరుతుందని అంచనా.
పంపిణీ
16 కోట్ల 80 లక్షల టీవీ ఇళ్లతో చైనా తరువాత భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీవీ మార్కెట్. కానీ మార్కెట్ అంతా చెల్లాచెదురుగా ఉంటుంది. కేబుల్ డిజిటైజేషన్ సగం పూర్తయినట్టేనని చెబుతున్నప్పటికీ, పూర్తిస్థాయిలో అమలు చేయటంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ అదొక సవాలుగానే మిగిలిపోయింది. అందువల్లనే అడ్రెసబిలిటీలోనూ, ఆదాయం పెరుగుదలలోనూ ఆశించిన పురోగతి లేదు. డిజిటల్ సెట్ టాప్ బాక్సుల పంపిణీ కూడా 2014 లో మందగించగా ఎమ్మెస్వోలు మొదటి రెండు దశల నగరాల్లో ప్రధానంగా బిజినెస్ మోడల్ ను మెరుగుపరచుకోవటం మీద, ఈ మార్పు వలన అంతర్గత ప్రక్రియలలో కలిగే పరిణామల మీద దృష్టిపెట్టారు. దీంతోబాటే స్థానిక ఆపరేటర్ల నుంచి వస్తున్న ప్రతిఘటన కూడా మొదటి రెండు దశల్లో గ్రాస్ బిల్లింగ్ వేగాన్ని, చానల్ పాకేజీ అమలు వేగాన్ని తగ్గించింది.
పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం ఒక్కో చందారునుంచి ఎమ్మెస్వోలకు, తద్వారా చానల్ యజమానులకు అధిక వసూళ్ళు రావటమనేది చందాదారులు తాము చూసిన చానల్స్ అన్నిటికీ చెల్లించటం మొదలైనప్పటి నుంచే వస్తుంది. అంతే తప్ప బేసిక్ పాకేజ్ వలన రాదు. మరోవైపు డిటిహెచ్ ఆపరేటర్లు హెచ్ డి చానల్స్ , ప్రీమియం చానల్స్, వాల్యూ యాడెడ్ సేవల ద్వారా మరింతగా చొచ్చుకుపోవటానికీ, ఆదాయం పెంచుకోవటానికీ ప్రయత్నంచి విజయం సాధిస్తున్నాయి.

మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ గడువు పెంచటం, భౌగోళికంగా చాలా విస్తృతమైన ప్రాంతంలో ఈ రెండు దశలూ ఉండటం, భారీగా నిధులు అవసరం కావటం, సగటు ఆదాయం తక్కువగా ఉండే అవకాశం వల్ల చాలా ప్రాధాన్యం సంతరించుకుని అతిపెద్ద సవాలుగా మారింది. మూడు, నాలుగుదశల్లో పోటీ ప్రధానంగా డిటిహెచ్, హిట్స్ మధ్య ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. వినియోగదారులపరంగా చూస్తే డిటిహెచ్ కి మొగ్గు చూపేవారు పెరగవచ్చునని, ఎమ్మెస్వోలపరంగా చూస్తే కార్పొరేట్ ఎమ్మెస్వోలకంటే హిట్స్ నే ఎక్కువగా ఆశ్రయించవచ్చునని భావిస్తున్నారు. జనాభా బాగా తక్కువగా ఉండే ప్రదేశాలలో డిటిహెచ్ సంస్థలు సరికొత్త పాకేజీలతో తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ఎమ్మెస్వోలకంటే ఎక్కువ ఆర్థిక పుష్టి ఉండటం కూడా డిటిహెచ్ ఆపరేటర్లకు కలిసి వస్తోంది. సెట్ టాప్ బాక్సులు అమర్చటం అనుకున్నంత సులభంగా పూర్తి కాకపోవచ్చునని, ఆఖరిదశ డిజిటైజేషన్ 2016 డిసెంబర్ లోగా పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ మరో ఏడాది పట్టటం ఖాయమని ఫిక్కీ అంచనావేసింది. ఒక వైపు ప్రభుత్వం అసహనం ప్రకటిస్తూ ఆలస్యాన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరికలు, ప్రకటనలు గుప్పించినా అది 2018 కి వెళ్ళినా ఆశ్చర్యం లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. 2019 చివరికల్లా డిజిటల్ కేబుల్ చందాదారుల వాటా 55 శాతం, డిటిహెచ్ 45 శాతం ఉంటాయని అంచనావేస్తున్నారు. అప్పటికి కేబుల్ చందాదారుల సంఖ్య 9 కోట్ల 40 లక్షలకూ, డిటిహెచ్ చందాదారల సంఖ్య 7 కోట్ల 60 లక్షలకూ చేరుకుంటుందని ఫిక్కీ అంచనావేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా డిజిటైజేషన్ 2020 కల్లా దాదాపుగా పూర్తి
మొత్తం 138 దేశాల అంచనా ఆధారంగా 2020 నాటికల్ల 98 శాతం ఇళ్లకు టీవీ ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. అంటే, 2010 లో ఉన్న 40 శాతం నుంచి 2014 లో 68 శాతానికి చేరుకోగా 2020 కి 98 శాతం అవుతుంది. 2013 వరకు 12 దేశాలు మాత్రమే పూర్తి స్థాయిలో డిజిటైజ్ కాగా 2020 నాటికి 94 దేశాల్లో పూర్తవుతుంది. అప్పటికి దాదాపు 124 దేశాల్లో 90 శాతానికి పైగా డిజిటైజేషన్ పూర్తవుతుంది. కేబుల్ ప్రధానంగా చైనా, భారత్, అమెరికా లో ఎక్కువగా వాడే టెక్నాలజీ. భారత్ లో 2013 నాటికి 58 శాతం ఇళ్లలో కేబుల్ ఉండగా చైనాలో 56 శాతంగా, అమెరికాలో 51 శాతంగా ఉంది. ఈ దేశాలు మినహాయిస్తే 2013 నాటికి కేబుల్ ద్వారా ప్రసారాలు అందుకునే ఇళ్లు ప్రపంచంలో 21 శాతమే.

క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంతోనే డిజిటైజేషన్ విజయవంతం
స్థానిక కేబుల్ ఆపరేటర్లు కూడా డిజిటైజేషన్ ప్రక్రియ నిదానంగా జరగాలనే కోరుకుంటున్నారు. వినియోగదారులు లబ్ధి పొందుతున్నంతకాలం వాళ్ళుకూడా సగటు యూనిట్ ఆదాయంతో లాభం పొందుతారు. క్షేత్ర స్థాయిలో వ్యాపారం నిర్వహించేది వారే కాబట్టి వాల్యూ యాడెడ్ సర్వీసులవంటి వాటివలన ప్రయోజనం పొందగలుగుతారు. అయితే ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్యన, ఎమ్మెస్వోలకూ పే చానల్ యజమానులకూ మధ్యన ఆదాయం పంపిణీ విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. స్థానిక ఆపరేటర్లకు కూడా తమ నెట్ వర్క్ ను మెరుగుపరచుకోవటానికి, సర్వీసింగ్ కూ మౌలిక సదుపాయాల మెరుగుదలకూ కొంత పెట్టుబడి అవసరం. నియంత్రించాల్సిన ట్రాయ్ కి క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం కావాలి. అప్పుడే రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ లను సైతం ప్రామాణీరించగలుగుతుంది. అప్పుడే ఎవరూ ఒప్పుకోకపోవటం ఉండదు. ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య బేరసారాలకూ తావుండదు. అప్పుడే ఒక సరైన బిజినెస్ మోడల్ తయారవుతుంది. ఒకసారి నెట్ వర్క్ లన్నీ ఏకమయ్యాక అందరూ లబ్ధి పొందుతారు. ప్రభుత్వంతో సహా అందరూ కేబుల్ టీవీ మౌలిక సదుపాయాల ద్వారా ఇంటింటికీ బ్రాడ్ బాండ్ సేవలు అందాలని చెప్పేవారే తప్ప స్థానిక ఆపరేటర్ తన మౌలిక సదుపాయాలు పెంచుకోవటానికి సాయం గురించి మాత్రం మాట్లాడరు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్న వినోదపు పన్ను (ఎంటర్టైన్మెంట్ టాక్స్) ఏకరూపంగా ఉండేట్టు చేయాల్సిన అవసరముంది. అప్పుడే సరైన బిల్లింగ్ చేయటానికీ, వినియోగదారులనుంచి సక్రమంగా వసూలు చేయటానికీ వీలవుతుంది. దీనివల్ల మొత్తంగా ఇందులోని అన్నిదశల లబ్ధిదారులకూ ఆదాయాల ప్రవాహం ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. ఫలితంగా వినియోగదారుడు కూడా ప్రయోజనం పొందగలుగుతాడు.

– రూప్ శర్మ, అధ్యక్షురాలు. భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య

మొదటి రెండుదశల్లోనూ నత్తనడక
డిజిటైజేషన్ లోని మొదటి రెండు దశల్లో సెట్ టాప్ బాక్సుల పంపిణీ, అమరిక దాదాపుగా 2013 డిసెంబర్ నాటికే పూర్తయ్యాయి. 2014 మొత్తం గ్రాస్ బిల్లింగ్ కూ, చానల్ పాకేజింగ్ కూ పనికిరావాల్సి ఉంది. దానివలన కేబుల్ రంగంలోని పే చానల్ యజమానులు, ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల మధ్య ఆదాయపంపిణీ సక్రమంగా జరగాల్సి ఉంది. కానీ అది మాత్రం ఇంకా పూర్తిగా జరగనే లేదు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్ళే అందుకు కారణం. ఈ అంశాలను ట్రాయ్ ముందస్తుగా ఊహించలేకపోవటం ఒక విషాదం. కస్టమర్లమీద యాజమాన్యాన్ని వదులుకోవటానికి స్థానిక ఆపరేటర్లు విముఖత చూపుతుండగా ఎమ్మెస్వోలు నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని చోట్ల నెట్ వర్క్ లను కొనేస్తున్నారు. కొన్ని నగరాలలో చానల్ పాకేజీలు మొదలైనప్పటికీ ఆపరేటర్లు మాత్రం పాత పద్ధతిలో ఒక్కో చందాదారునికి ఇంత చొప్పున స్థిరమైన మొత్తాలు చెల్లించటమే కొనసాగిస్తున్నారు. ఒకే ఒక సానుకూల విషయమేమిటంటే పెద్ద పెద్ద ఎమ్మెస్వోలు స్థానిక ఆపరేటర్లను ఒకరి పరిధినుంచి మరొకరు కొనుగోలు చేయటం ఆపాలనే అవగాహనకు రావటం.

డిజిటైజేషన్ లో అడుగడుగునా సవాళ్లే
వినియోగదారుల దరఖాస్తులు, ఎస్ ఎమ్ ఎస్

• వినియోగదారుల వివరాలు ఇవ్వటం వలన వారిమీద యాజమాన్యం ఎమ్మెస్వోల్కు వెళ్ళిపోతుందేమోనన్ని ఆపరేటర్లు భయపడుతున్నారు
• రకరకాల సెట్ టాప్ బాక్సులతో పనిచేయగల మిడిల్ వేర్ ను వాడుకోవటం ద్వారా ఉమ్మడి చందాదారు నిర్వహణ వ్యవస్థ ( ఎస్ ఎమ్ ఎస్ ) ను నడపాలనుకోవటం ఎమ్మెస్వోలకు తలనొప్పిగా మారింది
• మొదటి దశ నగరాలలో చందాదారు దరఖాస్తులు సేకరించటం దాదాపుగా 100 శాతం, రెండో దశలో 90 శాతం వరకు పూర్తయినప్పటికీ, చాలా సందర్భాలలో వినియోగదారుల గుర్తింపు సమాచారం తప్పులతడకగా ఉంది
• వినియోగదారులు ఎస్ ఎమ్ ఎస్ లో ఉన్నప్పటికీ, దరఖాస్తులోని సమాచారం మాత్రం విశ్వసనీయంగాలేదు

స్థూల బిల్లింగ్ – పన్నులతో కలిపి బిల్లింగ్

• బిల్లింగ్ హక్కులను ఎమ్మెస్వోలకు వదులుకోవటానికి, చందాదారులమీద ఆధిపత్యం వదులుకోవటానికీ స్థానిక ఆపరేటర్లు సిద్ధంగా లేరు
• పన్నులు ఎవరు చెల్లించాలనేది మరో సమస్య. అటు సర్వీస్ టాక్స్, ఇటు ఎంటర్టైన్మెంట్ టాక్స్ కూడా స్థానిక ఆపరేటర్లే చెల్లిస్తూ ఉండటంతో అది ప్రస్తుతానికి పరిష్కారమైనట్టే అనిపించినా శాశ్వత పరిష్కారం దొరకలేదు
• పన్నులు ఎవరు చెల్లించాలనేది ముంబై లో కోర్టుకేసుల్లో చిక్కుకుంది. ఎంటర్టైన్మెంట్ టాక్స్ మీద కూడా హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.
• ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆమోదయోగ్యమైన ఆదాయపంపిణీ విధానాన్ని బేరమాడుకోవటం

చానల్ పాకేజ్ ని బట్టి బిల్లింగ్ – చానల్ పాకేజ్ ని బట్టి వసూలు
• వినియోగదారులు చానల్ పాకేజీలు ఎంచుకున్నప్పటికీ, వాళ్ళు చెల్లించిన మొత్తాలను సైతం ఎమ్మెస్వోలకు ఇవ్వటానికి ఆపరేటర్లు ఇష్టపడటం లేదు.
• గట్టిగా అడిగితే ఆపరేటర్లు మరో ఎమ్మెస్వో పరిధిలోకి మారేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా సెట్ టాప్ బాక్సులల్లో పెట్టిన భారీ పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఎమ్మెస్వోలకు ఉంటుంది.
• ఏ వినియోగదారుడు చెల్లిస్తున్నాడో, ఎవరు చెల్లించటంలేదో ఎమ్మెస్వోకు తెలియదు కాబట్టి ఆ నిర్దిష్టమైన సెట్ టాప్ బాక్సుకు ప్రసారాలు నిలిపివేయటం ఎమ్మెస్వోకు కుదరదు. కొంతమంది ఎమ్మెస్వోలు అక్కడక్కడా కొంతమందికి ప్రసారాలు నిలిపివేయటమ్ ద్వారా వినియోగదారులనుంచి ఆపరేటర్ మీద వత్తిడి పెరిగేట్టు చేస్తున్నారు. అయితే, అలాంటి పరిస్థితిలో ఎమ్మెస్వోనే మార్చేయటం ద్వారా మొదటికే మోసం తెస్తున్నారు.

డిజిటైజేషన్ ప్రభావం
ఆపరేటర్లను అడ్డదారుల్లో ఆకట్టుకోవటానికి కార్పొరేట్ ఎమ్మెస్వోలు నానారకాలుగా ప్రయత్నించారు. అవతలి ఎమ్మెస్వోకి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టేలా ప్రోత్సహించినవారు కొందరైతే , ఉన్న బాక్సుల స్థానంలో కొత్త బాక్సులిచ్చి కనెక్షన్లను సొంతం చేసుకున్నవాళ్ళు మరికొందరు. ఈ విధంగా మొదటి రెండు దశల్లో రకరకాల అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనివలన ఎమ్మెస్వోలు ఆదాయం పంపెణీలో బేరమాడే శక్తి కోల్పోయారు. పైగా ఆపరేతర్ మారిపోవటం వల్ల అంతకుముందు ఇచ్చిన సెట్ టాప్ బాక్సులన్నీ పోగొట్టుకున్నట్టే. ఆ విధంగా పెట్టుబడి నష్తాలతోబాటు భవిష్యత్ ఆదాయాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 2013 అంతా ఇదే వాతావరణం నెలకొన్నది, అయితే, ఏడాది చివరికల్లా పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఎమ్మెస్వోల మధ్య ఒక అవగాహన కుదిరింది. ఒకరి కనెక్షన్లను మరొకరు తీసుకొకూడదని నిర్ణయించుకున్నారు.

క్షేత్ర స్థాయిలో ఉండే అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని, స్వదేశీ సెట్ టాప్ బాక్సులను ప్రోత్సహించటానికి వీలుగా ప్రభుత్వం మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ గడువు తేదీలను పొడగించింది. అదే సమయంలో ఈ రెండు దశల ఎమ్మెస్వోలు లైసెన్స్ పొందటానికి తగిన అవకాశమివ్వటమూ ఈ పొడగింపు లక్ష్యాల్లో ఒకటి. మొదటి రెండు దశల్లో 7 కోట్ల సెట్ టాప్ బాక్సులు వాడగా మూడు, నాలుగు దశల్లో దాదాపు 25 కోట్లవరకూ అవసరమవుతాయని అంచనావేశారు. గడువు పెంపును పరిశ్రమలో కొంతమంది స్వాగతించగా మరికొందరు వేగం తగ్గిపోతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, ప్రభుత్వం మాత్రం మూడు, నాలుగు దశల్లో వేగం ఎంతమాత్రమూ తగ్గబోదని చెబుతూ వస్తోంది. ఆలస్యం కాకుండా ఉండేలా డిసెంబర్ లోనే ఎమ్మెస్వోలను లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పటం, ఆ తరువాత ఎమ్మెస్వోల కోరికమీద గడువు పెంచటం తెలిసిందే. డిజిటైజేషన్ అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి వీలుగా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయటంతోబాటు వివిధ వర్గాల అభ్యర్థనలకు అనుగుణంగా అందులో స్వతంత్ర ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ కూడా అవకాశం కలిగించింది. ఈ టాస్క్ ఫోర్స్ తరచు సమావేశమవుతూ డిజిటైజేషన్ పురోగతిని చర్చిస్తూ వచ్చింది. అదే విధంగా స్వదేశీ సెట్ టాప్ బాక్స్ తయారీదారులకు కొన్ని పన్ను రాయితీలు కూడా ఇచ్చి దిగుమతి చేసుకున్న సెట్ టాప్ బాక్సులతో పోటీ పడేట్టు చేసింది. టెలికామ్ శాఖ వీటిని టెలికామ్ నెట్ వర్క్ పరికరాలుగా గుర్తించటం వల్ల సెంట్రల్ సేల్స్ టాక్స్ 2 శాతానికి తగ్గిపోయింది. అంతకుముందు 12-14 శాతం వ్యాట్ వసూలు చేసేవారు.

మూడు, నాలుగు దశల్లో చిన్న ఎమ్మెస్వోల హవా

మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ ప్రధానంగా అన్ని మున్సిపల్ పట్టణాలు, గ్రామాలకు పరిమితం కావటం వల్ల చిన్న ఎమ్మెస్వోల పాత్ర ఇక్కడ కీలకమవుతుంది. ఇక్కడ ఆదాయం కూడా తక్కువే. ప్రస్తుతం అనలాగ్ లో సగటు యూనిట్ ఆదాయం మూడో దశలో రూ.100 నుంచి రూ. 150 వరకు, నాలుగో దశలో రూ. 60 నుంచి 80 వరకూ ఉంది. డిజిటైజ్ అయిన తరువాత ఇది ఈ మొత్తం మూడో దశలో రూ.160 నుంచి రూ. 200 వరకు, నాలుగో దశలో రూ. 120 నుంచి 160 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తక్కువ ఆదాయాలే పెట్టుబడులు పెట్టటానికి వెనకాడేట్టు చేస్తున్నాయి. డిజిటల్ హెడ్ ఎండ్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన సెట్ టాప్ బాక్సులకు సబ్సిడీలు ఇచ్చిన మొదటి రెండు దశల ఎమ్మెస్వోలు ఇంకా ఆదాయాలు రాకపోతుండటంతో అయోమయానికి లోనవుతున్నారు. మరో వైపు చిన్న ఎమ్మెస్వోలకు డిజిటైజేషన్ మీద ముందస్తు అనుభవం లేకపోవటంతో బాటు పెట్టుబడి కూడా తగినంత లేదు. అందుకే చాలామంది దగ్గర్లో ఇప్పటికే పెద్దనగరంలో ఉన్న డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి సిగ్నల్స్ అందుకునే దిశలో ఆలోచిస్తున్నారు. కానీ అది కూడా ఖర్చుతో కూడుకొని ఉండటం వల్ల హిట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రభుత్వం ఆశించిన విధంగా డిజిటైజేషన్ లక్ష్యాలు సాధించటం కష్టమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణాలు:
i. ఇంత తక్కువ కాలంలో స్వదేశీ సెట్ టాప్ బాక్సులు తగినన్ని తయారు కావటం సాధ్యం కాకపోవచ్చు
ii. ఎమ్మెస్వోలకు అవసరమైన విధంగా పరపతి సౌకర్యం కల్పించటానికి విదేశీ తయారీదారుల సంసిద్ధత
iii. చాలా సందర్భాలలో విదేశీ సెట్ టాప్ బాక్సుల నాణ్యత బాగా ఉంటుంది
iv. స్వదేశీ సెట్ టాప్ బాక్సులు వాడినందుకు వినియోగదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలూ లేవు.

ఏమైనప్పటికీ, ప్రభుత్వం పొడిగించిన గడువుతో సంబంధం లేకుండా కొంతమంది ప్రాంతీయ ఎమ్మెస్వోలు మూడు, నాలుగు దశల్లో డిజిటల్ సెట్ టాప్ బాక్సులు అమర్చటం మొదలుపెట్టారు. వాటిలో గుజరాత్, పశ్చిమబెంగాల్ లోని గుజరాత్ టెలీలింక్ ప్రైవేట్ లిమిటెడ్ (జిటిపిఎల్), కేరళలో ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, కేరళ కమ్యూనికేషన్స్ కేబుల్ లిమిటెడ్, పశ్చిమబెంగాల్ లోని మంథన్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పంజాబ్ లోని పాస్ట్ వే ట్రాన్స్ మిషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఒడిశాలోని ఆర్టెల్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఉన్నాయి. మరో కీలకమైన ధోరణి ఏంటంటే, చిన్న చిన్న ఎమ్మెస్వోలు కొంతమంది కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడి నిధులు సమకొర్చుకొని డిజిటైజేషన్ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మూడు, నాలుగు దశలమీద డిటిహెచ్ కన్ను
చందాదారులను ఆకట్టుకునే పోరు మూడు, నాలుగు దశలలో ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తుండగా అందులో ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లే ప్రధాన పోటీదారులవుతున్నారు. మొదటి రెండు దశల్లో అనలాగ్ నుంచి డిజిటల్ కి మారే క్రమంలో దాదాపు 20 శాతం మంది కొత్తగా డిటిహెచ్ ఎంచుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు మూడు, నాలుగు దశల్లో డిటిహెచ్ ఆపరేటర్లు ఇంకా మెరుగైన పరిస్థితిలో ఉంటారని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కేబుల్ ఆపరేటర్ ఉనికిలేని చోట సహజంగానే డిటిహెచ్ చొచ్చుకుపోవటమే అందుకు కారణమంటున్నారు. పైగా, డిటిహెచ్ సంస్థలు పెద్దవి కావటం వల్ల వాళ్ళు భారీ పెట్టుబడులతో సరికొత్త ఆకర్షణీయమైన పాకీజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిష్ టీవీ ఇప్పటికే జింగ్ పేరుతో సబ్ బ్రాండ్ రూపొందించి ప్రాంతీయ భాషల చానల్స్ కోసం పాకేజీలు తయారుచేసి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్, త్రిపుర, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జింగ్ అమలులో ఉంది. డిజిటల్ కేబుల్ పాకేజీలకంటే జింగ్ పాకేజ్ తక్కువగా ఉండటం వల్ల సహజంగానే చందాదారులు ఆకర్షితులవుతున్నారు.
హిట్స్ మరింత కీలకమవుతుందా?
నూటికి నూరు శాతం డిజిటైజేషన్ లక్ష్యాన్ని సాధించటంలో హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ( హిట్స్ ) చాలా కీలపాత్ర పోషించబోతున్నట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డిటిహెచ్ ఆపరేటర్లు ఒక్కో చందాదారునూ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉండగా, హిట్స్ మాత్రం నేరుగా ఎమ్మెస్వోలను లక్ష్యంగా చేసుకుంది. హిట్స్ విధానంలో హెడ్ ఎండ్ కేంద్రీకృతమై ఉండగా అక్కడినుంచి బ్రాడ్ కాస్ట్ సిగ్నల్స్ ను ఆపరేటర్ దాకా అందించే వీలుంది.ఎన్ క్రిప్షన్, ఎస్ ఎమ్ ఎస్, బిల్లింగ్ లాంటి వ్యవహారాలన్నీ హిట్స్ ఆపరేటర్ చూసుకుంటూ ఉంటే, ఆపరేటర్ మాత్రం వినియోగదారులను సమకూర్చుకోవటం, సేవలందించటం మీద దృష్టి సారిస్తాడు. డిటిహెచ్ లో ఆపరేటర్ స్వయంగా పాకేజింగ్ చేస్తుండగా, హిట్స్ లో మాత్రం స్థానికంగా ఉండే ఆపరేటర్ అక్కడి అవసరాలకు తగినట్టుగా పాకేజింగ్ చేసే వెసులుబాటు ఉంది.

హిట్స్ లైసెన్స్ పొందిన అపరేటర్లు ఇద్దరే ఉన్నారు. ఒకటి జైన్ గ్రూప్, మరొకటి హిందుజా గ్రూప్. జైన్ టీవీ గ్రూప్ వారి జైన్ హిట్స్ పది లక్షల సెట్ టాప్ బాక్సులు అమర్చి ఉండగా తాజాగా లైసెన్స్ పొందిన హిందుజా గ్రూప్ వారి గ్రాంట్ హిట్స్ మే, జూన్ నెలల్లో కార్యకలాపాలు ఉధృతం చేస్తుందని భావిస్తున్నారు. “ ఆపరేటర్లు తమ స్వతంత్రత కోల్పోకూడదని కోరుకుంటున్నారు. మా సర్వే లో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. అదే విధంగా వాళ్ళే స్వయంగా పాకేజింగ్, బండ్లింగ్ చేయాలని కోరుకుంటున్నారు. స్థానిక కేబుల్ చానల్స్ ఇవ్వాలనేది కూడా వాళ్ళ డిమాండ్. అందుకే ఈ మూడు ప్రధానమైన డిమాండ్లకు అనుగుణంగా గ్రాంట్ హిట్స్ రూపొందించాం” అంటున్నారు హిందుజా మీడియా గ్రూప్ సీఈవో టోనీ డిసిల్వా.

చైనా నేర్పిన పాఠాలు

భారతదేశం కంటే పదేళ్ళముందే డిజిటైజేషన్ ప్రారంభించిన చైనాలో ఏం జరిగిందో ఇక్కడా అదే జరుగుతోంది. ఆశించిన వేగంలో డిజిటైజేషన్ సాగటం లేదు. 2003 లో మొదలైన డిజిటైజేషన్ చైనాలో 2003 చివరినాటికి 72 శాతం మాత్రమే పూర్తి చేసుకోగలిగింది. అక్కద కూదా భారత్ లో లాగే బహుళ సమస్యలున్నాయి. 2013 నాటికి చైనాలో 40 కోట్ల ఈల్లలో టీవీలుండగా టీవీలు లేని ఇళ్లు మూడు శాతమే. అక్కడా కూడా కేబుల్ గుత్తాధిపత్యాలున్నాయి. ఐదుగురు ఆపరేటర్ల చేతిలో44 శాతం మార్కెట్ ఉంది. మిగిలినది చిన్న ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఉంది. భారతదేశంలో 50 శాతం మార్కెట్ ఐదుగురి చేతుల్లో ఉంది. కాకపోతే, చైనాలో ఏదో ఒక స్థాయిలో కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వం యాజమన్యంలో ఉంటారు. ఏమైనప్పటికీ అక్కడ పదేళ్ళుగా డిజిటైజేషన్ ప్రక్రియ సాగుతూనే ఉంది.

అయితే, చైనాలో ప్రభుత్వం బలవంతంగా ప్రజలమీద డిజిటైజేషన్ రుద్దలేదు. మార్కెట్ స్వయంగా అందుకు సానుకూలంగా ప్రోత్సహించేలా చేసింది. అనలాగ్ లో బేసిక్ పాకేజ్ కింద 40 చానల్స్ ఇస్తూ ఉండగా డిజిటైజేషన్ లో అది కేవలం 60 చానల్స్ కే పెరగటం లాంటి అంశాలవల్ల ప్రజలనుంచి పెద్దగా సానుకూల స్పందన రాలేదు.
చైనాలో కూడా ఎప్పటికప్పుడు గడువు తేదీలు పొడిగిస్తూ రాక తప్పలేదు. దీంతో ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని తప్పనిసరి డిజిటైజేషన్ ప్రకటించింది. అదే సమయంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయటానికి సహకరిస్తూ కేబుల్ కంపెనీలకు రుణాలివ్వటం, సబ్సిడీలివ్వటం, వినియోగదారులకు సెట్ టాప్ బాక్సులు ఉచితంగా ఇవ్వటం లాంటి పనులు చేసింది. 2018 నాటికి డిజిటైజేషన్ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. ప్రజలకు సెట్ టాప్ బాక్సులు ఉచితంగా ఇవ్వటమన్నది చాలా పెద్ద నిర్ణయం కాబట్టి అక్కద అమలు ఇప్పుడు వేగం పుంజుకుంది. భారతదేశంలో ప్రభుత్వం జులుం ప్రదర్శించటానికే మొగ్గు చూపుతోంది.

పెరిగిన డిటిహెచ్ ఆదాయం
డిటిహెచ్ తో పోల్చుకుంటే డిజిటల్ కేబుల్ లో సగటు యూనిట్ ఆదాయం పెరగటం లేదు. డిటిహెచ్ ఆపరేతర్లు చందాదారులను పెంచుకోవటం కంటే అదనపు చానల్స్ ఇవ్వటం, హెచ్ డి చానల్స్ ఇవ్వటం, సరికొత్త పాకేజీలు ప్రకటించటం లాంటి చర్యల ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరిశ్రమ అంచనాల ప్రకారం డిటిహెచ్ ఆపరేటర్లు యూనిట్ 2014లో సగటు ఆదాయాన్ని 12 నుంచి 15 శాతం పెంచుకోగలిగారు. దీనికి ప్రధాన కారణం హెచ్ డి చానల్స్, ప్రీమియం చానల్స్ ఇవ్వటం, లాంటి అదనపు సేవలే. మరోవైపు డిజిటల్ కేబుల్ ఆపరేటర్లు ఇంకా తమ బిజినెస్ మోడల్ ను సరిదిద్దుకోలేకపోతున్నారు. ఫిక్కీ అంచనాల ప్రకారం 40 లక్షలమంది హెచ్ డి చందాదారులున్నారు. అంటే మొత్తం డిటిహెచ్ చందాదారుల్లో పది శాతం మంది. 2014 లో ఇది 15 నుంచి 20 శాతానికి పెరిగింది. దాదాపు అందరు డిటిహెచ్ ఆపరేటర్లూ టీవీ ఎవ్విరివేర్ యాప్స్ ప్రారంభించారు. మొబైల్స్ లో టాబ్స్ లో చూసే అవకాశం కల్పించారు. తమ చందాదారులతో చందాల చెల్లింపు సంబంధాల ఆధారంగా ఇలాంటి సేవలు అందించటం ద్వారా వాళ్లను బాగా ఆకట్టుకోగలుగుతున్నారు.
ఎమ్మెస్వో- ఆపరేటర్ సంబంధాలు
ఎమ్మెస్వోలు 2014 మొత్తం తమ కార్యకలాపాలను సుస్థిరం చేసుకోవటం మీదనే వెచ్చించారు. అదే సమయంలో మొదటి రెండు దశల్లో ఆపరేటర్లతో ఏర్పడిన విభేదాల పరిష్కారానికే మొగ్గుచూపారు. పెద్ద ఎమ్మెస్వోలు టెక్నాలజీ మీద ఆధారపడుతూ అడ్రెసబిలిటీని మెరుగుపరచటం మీద, వసూళ్ళమీద దృష్టి పెట్టారు. చందాదారుల స్థాయి అడ్రెసబిలిటీ ఇంకా ఒక సవాలుగానే మిగిలిపోయింది. సెట్ టాప్ బాక్సులను ట్రాక్ చేయటం, ఆపరేటర్ స్థాయిలో వసూళ్ళు జరిగేలా చూడటం ఇప్పుడు ప్రధానమయ్యాయి. అదే సమయంలో ఎమ్మెస్వోలు ప్రె పెయిడ్ విధానం మీద కూడా దృష్టి పెట్టారు. హత్ వే సంస్థ కొన్ని చోట్ల ఆపరేటర్లను బేసిక్ పాకేజ్ మించిన మొత్తాన్ని ముమ్దుగానే డిపాజిట్ చేయాలని కోరుతోంది. అదే సమయంలో ఇండస్ ఇండ్ మీడియా కమ్యూనికేషన్స్ కూడా అ లా కార్టే విధానం ఎంచుకున్న వినియోగదారులకు ప్రీ పెయిడ్ విధానం అమలు చేస్తోంది. ముఖ్యంగా స్టార్ చానెల్స్ కూ,. మినీ ప్కాజీలకూ ఆన్ లైన్ లో లేదా కాష్ కౌంటర్లలో చెల్లింపు జరిపే ఏర్పాటు చేసింది.

వీలైనంత వరకూ నేరుగా వినియోగదారులతో సంబంధాలు నెరపే దిశలో ఎమ్మెస్వోలు పనిచేస్తున్నారు. అందుకోసమే టెలికామ్ కంపెనీలు, మార్కెటింగ్, కన్సల్టింగ్ రంగాల్లో అనుభవమున్నవారిని ఉన్నత స్థానాల్లో తీసుకుంటున్నారు. కస్టమర్ మార్కెటింగ్ మీద ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కొంతమంది ఎమ్మెస్వోలు ఇప్పుడిప్పుడే పరిమితంగా ఆపరేటర్లకు బిల్లింగ్ లో అవకాశం కల్పించటానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఎస్ ఎమ్ ఎస్ ను ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోగలిగేలా వాళ్ళకు వర్క్ షాపులు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు

కారేజ్ ఫీజు తగ్గదు
డిజిటైజేషన్ వలన కారేజ్ ఫీజు తగ్గుతుందన్నది అంచనామాత్రమే కాగా, మరో రెండు, మూడు సంవత్సరాలు తగ్గకపోవచ్చునని మార్కెట్ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఈక్కువ చానల్స్ అందించగలిగే శక్తి పెరగటం వలన కారేజ్ ఫీజు తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ ఎమ్మెస్వోలు మాత్రం తగ్గింపు ఆలోచనలో లేరు. పైగా స్థానిక కేబుల్ చానల్స్ 15 వరకూ ఇవ్వటానికి అవకాశం ఉండటంతో వాటినుంచి కూడా అదనంగా కారేజ్ ఫీజు ఆదాయం కోసం ఎమ్మెస్వోలు ఎదురుచూస్తున్నారు. రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ద్వారా కారేజ్ ఫీజుకు కూడా ఎక్కువగానే మినహాయించుకుంటున్నారు. పెక్కువ పే చానల్స్ పెరిగే కొద్దీ కారేజ్ ఫీజు కూడా పెరుగుతూ రావటం వలన వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో 10 నుంచి 15 శాతం వరకు కారేజ్ ఫీజు పెరుగుతూనే ఉంటుందని, డిజిటైజేషన్ ప్రక్రియ కుదుటపడిన తరువాతే కారేజ్ ఫీజు తగ్గుతుందని ఫిక్కీ అధ్యయనం అంచనావేసింది.
ఎమ్మెస్వోలకు బ్రాడ్ బాండ్ అవకాశం
ఒకవైపు డిజిటైజేషన్ మీద భారీగా ఖర్చు చేస్తూనే ఎమ్మెస్వోలు మరో వైపు అదనపు ఆదాయం సంపాదించగలిగేలా బ్రాడ్ బాండ్ మీద దృష్టిపెడుతున్నారు. వైరుతో అందించే బ్రాడ్ బాండ్ కనెక్షన్లు 2014 లో 2 కోట్లు ఉండగా 2019 నాటికి అవి 3కోట్ల 20 లక్షలకు పెరుగుతాయని అంచనావేశారు. ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడే ఆదాయవనరుగా పరిగణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ధోరణి స్పష్టంగా కనబడుతోంది. ఎమ్మెస్వోలలో హాత్ వే ఈ కేబుల్ బ్రాడ్ బాండ్ రంగంలో చాలా ముందుంది. 50 ఎంబిపిఎస్ బ్రాడ్ బాండ్ ప్లాన్స్ అందిస్తూ హైదరాబాద్, బెంగళూరు, ముభయ్, పూణె నగరాలకు విస్తరించింది. డెన్ కూడా 2014 సెప్టెంబర్ లో ఢిల్లీ తో మొదలుపెట్టి చెన్నై, పూణె, లక్నో, అహమ్మదాబాద్ నగరాలలో బ్రాడ్ బాండ్ లో దూసుకువెళుతోంది .సిటీ కేబుల్ తూర్పు భారతదేశంలో విస్తరించగా కేరళలో ఏషియానెట్ తన బ్రాడ్ బాండ్ సేవలను ఆధునీకరిస్తోంది. బ్రాడ్ బాండ్ ద్వారా కేబుల్ ఆపరేటర్లకు కూడా అదనపు ఆదాయ మార్గాలను చూపాలని ఎమ్మెస్వోలు ప్రధానంగా దీనిమీద దృష్టి సారిస్తున్నాయి.