• Home »
  • MIB/Licencing »
  • కాకినాడ, సూర్యాపేట సహా 6 చోట్ల ఎఫ్ ఎం హైపవర్ ట్రాన్స్ మిటర్లు

కాకినాడ, సూర్యాపేట సహా 6 చోట్ల ఎఫ్ ఎం హైపవర్ ట్రాన్స్ మిటర్లు

వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ట్రాన్స్ మిటర్ల ఏర్పాటుకు, కార్యక్రమాల రూపకల్పనకు దూరదర్శన్, ఆకాశవాణి కలిసి రూ.35 కోట్లు వెచ్చించాయి. యువత సంఘ వ్యతిరేకకార్యకలాపాల వైపు మొగ్గు చూపకుండా చూసేందుకు, తప్పుదారిపట్టించే మాటలకు ప్రభావితం కాకుండా ఉండేందుకు, ఇప్పటికే ఆ ప్రభావానికి లోనైన వారి తిరిగి జన జీవన స్రవంతిలొ కలిసేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేసినట్టు సమాచార, ప్రసారశాఖామంత్రి పార్లమెంటుకు తెలియజేశారు.

విద్య, యువజన సంక్షేమం, మహిళాసాధికారత, ఆ ప్రాంతంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, అటవీ చట్టం, గిరిజనుల హక్కులు తదితర అంశాలమీద అవగాహన పెంచే ధ్యేయంతో కార్యక్రమాలు ప్రచారంలో పెట్టామన్నారు. అదే విధంగా స్థానిక పండుగలు, సాంస్కృతిక వేడుకలు, జానపద కళలు, స్థానిక భాష, యాసలో పాటలు కూడా ప్రసారం చేసినట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్ళటం మీద దృష్టిపెట్టామన్నారు.

ఆకాశవాణికి సంబంధించి రూ. 28 కోట్ల 6 లక్షల రూపాయలతో ఆరు కొత్త ఎఫ్ ఎం హై పవర్ ట్రాన్స్ మిటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అందులో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తెలంగాణలోని సూర్యపేటతో బాటు ముజఫర్ నగర్ (బీహార్),  అంబికాపూర్ సర్గుజా (చత్తీస్ గఢ్), ధన్ బాద్ ( జార్ఖండ్), భవానీపట్న ( కలహండి, ఒడిశా ) ఉన్నాయి. ఇవే కాకుండా, పాతబడిపోయినా ఇప్పటికీ వాడకంలో ఉన్న ఆకాశవాణి  ట్రాన్స్ మిటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వామపక్ష తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలోని హై అవర్ ట్రాన్స్ మిటర్ల ఏర్పాటుకు అధికప్రాధాన్యమిస్తారు.

దూరదర్శన్ విషయానికొస్తే, 12 వ పంచవర్ష ప్రణాళికలో చేపట్టిన డిజిటైజేషన్ పథకంలో భాగంగా ఒక్కొక్కటి రూ.6 కోట్ల 62 లక్షల చొప్పున డిజిటల్ హై పవర్ ట్రాన్స్ మిటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ముజఫర్ పూర్ ( బీహార్) జగదల్ పూర్ ( చత్తీస్ గఢ్) , జంషెడ్ పూర్ ( జార్ఖండ్) లలో పూర్తయ్యాయి. టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ పరిధిలోకి రాని ప్రాంతాలన్నిటిలోనూ దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ సర్వీస్ ఫ్రీడిష్ సేవలు అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.