• Home »
  • Content Code »
  • టీవీలకే దిక్కులేదు, ఎఫ్ ఎం రేడియోలను ఏ మానిటరింగ్ కమిటీలకు ఇస్తారో?

టీవీలకే దిక్కులేదు, ఎఫ్ ఎం రేడియోలను ఏ మానిటరింగ్ కమిటీలకు ఇస్తారో?

టీవీ కార్యక్రమాల మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించి కేంద్రానికి నివేదించేలా  మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పదమూడేళ్ల కిందట సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ అదేశించింది. ఈ పదమూడేళ్ళలో నాలుగైదు సార్లు గుర్తు చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కమిటీలకు ఎఫ్ ఎం రేడియో ప్రసారాలు, కమ్యూనిటీ రేడియో ప్రసారాల మీద ఫిర్యాదుల బాధ్యతలు కూడా అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.

సమాచార, ప్రసార శాఖ సూచించిన ప్రకారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు స్వయంగా టీవీ కార్యక్రమాల మీద మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు చేయవచ్చు, లేదా ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. శాటిలైట్ చానల్స్ మీద రాష్ట్ర కమిటీలు పర్యవేక్షించటానికి, స్థానికంగా కేబుల్ చానల్స్ మీద జిల్లా శాఖలు పర్యవేక్షించటానికి వీలు కల్పించారు. ఆ కమిటీలలో ఎవరు ఉండాలో కూడా నిర్దిష్టంగా సూచించారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ఆ తరువాత కూడా ఈ కమిటీల గురించి పట్టించుకోలేదు. అందువలన అలాంటి కమిటీలు లేని ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చానల్స్ మీద ఫిర్యాదు చేయటానికి స్వీయ నియంత్రణలో భాగంగా బ్రాడ్ కాస్ట్ కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్ ఉంది. న్యూస్ చానల్స్ మీద న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ  ఉన్నప్పటికీ అది సభ్యులకే పరిమితం. తెలుగు న్యూస్ చానల్స్ లో ఐదో వంతు కూడా సభ్యత్వం తీసుకోలేదు. టాప్ 5 తెలుగు న్యూస్ చానల్స్ లో ఒక్కటీ లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. అందువల్ల న్యూస్ చానల్స్ మీద ఫిర్యాదు చేసే అవకాశమే లేదు.

ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్ని ప్రైవేట్ ఎఫ్ ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు తప్పనిసరిగా ఆకాశవాణి పాటించే నియమావళిని అనుసరించాలి. తమప్రసారాలను కనీసం 90 రోజులపాటు రికార్డు చేసి ఉంచి అడిగినప్పుడు సమర్పించాలి. టీవీ ల తరహాలోనే ఒక చట్టబద్ధమైన పర్యవేక్షణ వ్యవస్థ రేడియోలకూ ఉండి తీరాలని సుప్రీంకోర్టు 2017 జనవరి 12 న ఇచ్చిన ఆదేశాలమీద ఇప్పుడు ఏడాది తరువాత మంత్రిత్వశాఖ స్పందించింది.

ఇప్పటికీ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయని రాష్ట్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, కమిటీలు ఉన్నప్పటికీ చురుగ్గా పనిచేయని చోట వెంటనే సమీక్షలు జరపి చైతన్యవంతం చేయాలని మంత్రిత్వశాఖ తన తాజా ఉత్తర్వులలో ఆదేశించింది.