• Home »
  • Cable »
  • నాలుగో దశ డిజిటైజేషన్ : అంతా గతుకుల బాటే

నాలుగో దశ డిజిటైజేషన్ : అంతా గతుకుల బాటే

మూడోదశ డిజిటైజేషన్ గడువు విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది. ఎప్పుడు వాదోపవాదాలు జరుగుతాయో తెలియదు. అయితే నాలుగో దశ డిజిటైజేషన్ కు ఇప్పటి వరకు అధికారికంగా గడువు తేదీ మాత్రం ఈ ఏడాది ఆఖరుకి. అంటే 2016 డిసెంబర్ 31నాటికి దేశమంతటా డిజిటల్ సిగ్నల్స్ మాత్రమే ప్రసారం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటిలాగానే నాలుగోదశ మీద ప్రచారం ప్రారంభించింది.

నాలుగోదశలో డిజిటల్ సిగ్నల్స్ పంపిణీ కోసం ఎమ్మెస్వోలు ఏప్రిల్ 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ విషయానికి పత్రికలలో కూడా ప్రచారం బాగానే చేశారు. అదే సమయంలో అది కచ్చితంగా ముగింపు గడువు కూడా కాదనటానికి రుజువు … ప్రభుత్వ వెబ్ సైట్ లో ఇప్పటికీ దరఖాస్తు చేసుకొవచ్చుననే ప్రచారమే జరుగుతూ ఉండటమే. కాకపోతే అందరూ ఆలస్యంగా దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ కి సమయం ఉండకపోవచ్చుననే అభిప్రాయంతో అలా చెప్పి ఉంటారు. అంటే నాలుగోదశ ప్రభుత్వం చెప్పినంత హడావిడిగా జరిగే అవకాశం మాత్రం లేదు.

2014 నాటి నోటిఫికేషన్ ను కూడా ప్రస్తావించటం చేయటం ద్వారా నాలుగో దశ ముగింపు తేదీని ప్రభుత్వం మరో సారి గుర్తుచేసినట్టయింది. ఇదే ప్రకటనను ప్రభుత్వం తన వెబ్ సైట్ లో కూడా పెడుతూ వివరాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ 18001804343 ని సంప్రదించాలని కోరింది. అప్పటినుంచి మూడు నెలలు గడిచిపోయాయి. అయినా సరే పెద్దగా ఎక్కువమంది ఎమ్మెస్వోలుగా దరఖాస్తు చేసుకున్న ఆనవాళ్ళు కనబడటం లేదు. రెండు నెలల్లో లైసెన్సులు పొందినవాళ్ల సంఖ్య మహా అయితే వంద వరకు ఉండవచ్చు. దీన్నిబట్టి చూస్తుంటే ప్రభుత్వ ప్రకటనకు పెద్దగా స్పందన కనబడటం లేదు.

ఈ వ్యవహారంలో మరో అవరోధం కోర్టులు ఇస్తున్న స్టే ఉత్తర్వులు. మూడోదశ పట్టణాలలో అనలాగ్ సిగ్నల్స్ కొనసాగటానికి అనుకూలంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్టే ఉత్తర్వులిచ్చాయి. ఈ పిటిషన్లన్నిటినీ బదలీ చేయాల్సిందిగా ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు ఆమోదించింది. అయితే ఏప్రిల్ 1 న ప్రభుత్వం ఈ కేసుల విచారణ బాధ్యతను ఢిల్లీ హైకోర్టుకు అప్పగించింది. అదే సమయంలో అన్ని రాష్టాల హైకోర్టులకూ ఈ విషయం తెలియజేస్తూ  ఇలాంటి పిటిషన్లమీద ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని, ఢిల్లీ హైకోర్టుకే పంపాలని ఆదేశించింది.

నిజానికి మంత్రిత్వశాఖ, బ్రాడ్ కాస్టర్లు కోరుకున్నది కచ్చితంగా ఇదే. ఒక కోర్టుమీద అయితే వత్తిడి తీసుకువచ్చి స్టే తొలగింపుకు కృషి చేయటం సులభం. బ్రాడ్ కాస్టర్లు ఎలాగూ ఏదో విధంగా ఈ కేసులో దూరి వాదించాలనుకుంటున్నారు.  ఎంత త్వరగా డిజిటైజేషన్ జరిగితే వాళ్ళకు అంత లాభం కాబట్టి వ్యవహారం త్వరగా ఒక కొలిక్కి రావాలనే కోరుకుంటారు. అయితే, వారి పిటిషన్ ను స్వీకరిస్తారా లేదా అమేది ఇంకా తెలియాల్సి ఉంది.

సాధారణంగా జరిగే అనుభవాన్ని బట్టి చూస్తే అనుభవం తక్కువున్న న్యాయవాదులు… సీనియర్లు వాదించే ఇలాంటి కేసుల్లో తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఈ కేసులో మాజీ కేంద్రమంత్రులే న్యాయవాదులుగా ఉండటాన్ని బట్టి చూస్తే కేసు చాలా కఠినమైనదని అర్థమవుతూ ఉంటుంది. న్యాయవ్యవస్థ విశ్వసనీయమైనదే అయినప్పటికీ వీళ్ళు తిమ్మిని బమ్మిని చేసైనా విజయం సాధించటానికి కృషి చేస్తారు. కానీ డిజిటైజేషన్ నిజంగా విజయవంతమైందా, విఫలమైందా అనే విషయంలో ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాధానం లేదు.

దురదృష్టవశాత్తూ వినియోగదారుల సంఘాలేవీ ఇప్పటివరకూ ముందుకొచ్చి జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఎక్సైజ్ డ్యూటీ మీద ఆభరణాల వ్యాపారుల తరహాలో కనీసం నిరసన తెలియజేసిన దాఖలాలు కూడా లేవు. మరో సమస్య ఏంటంటే బ్రాడ్ కాస్టర్లు తమ వ్యాపార ప్రయోఅనాలను దృష్టిలో ఉంచుకొని అలాంటి నిరసనలకు ఎలాంటి ప్రాచుర్యమూ కల్పించరు. డిజిటైజేషన్ మీద ఎలాంటి వ్యతిరేకతా ప్రచార కాకుండా జాగ్రత్త పడతారు.

ఒకవేళ హైకోర్టు అన్ని రకాల స్టే ఉత్తర్వులనూ రద్దు చేసినా అది డిజిటైజేషన్ ప్రక్రియకు ఏ విధంగానూ సాయపడదు. ఈ ఏడాది చివరికి పూర్తి కావటానికి దోహదం చేయబోదు. ఎందుకంటే ఎలాగూ మంత్రిత్వశాఖ సెట్ టాప్ బాక్సులివ్వదు. దేశంలో అందుబాటులోనూ ఉండవు. తమ దగ్గర బాక్సులున్నాయని చెప్పుకునే డిటిహెచ్ దగ్గర సేవలు అందుకోమని వినియోగదారులకు సూచించే అవకాశం ఎలాగూ లేదు. డిటిహెచ్ సంస్థలు నాలుగో దశ కోసం ఇప్పటికే బాక్సులు కొని నిల్వచేసుకున్నాయి. గతంలో పూర్తయిన రెండు దశల్లోనూ స్వదేశీ బాక్సుల వాడకం 10-15% మించలేదని ప్రభుత్వమే ఒప్పుకుంది.

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే మొత్తం ఆరు డిటిహెచ్ సంస్థలూ కలిసి కూడా నెలకు పది లక్షల సెట్ టాప్ బాక్సులను మించి అమర్చలేకపోయాయి. దీంతో ఏడాది చివరికి కోటీ 20 లక్షల బాక్సులే పెట్టాయి. కానీ ఈ దశకు మొత్తం 4 నుంచి 5 కోట్ల బాక్సులు అవసరమవుతాయి.  గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయమేంటంటే డిటిహెచ్ ఆపరేటర్లకు కొత్త చందాదారులకోసం మరిన్ని బాక్సులు అవసరమవుతాయి. అవి కూడా కోటీ ఇరవై లక్షల్లో భాగమే.

పరిశ్రమ ఒకవైపు ఏడాది చివరికల్లా డిజిటైజేషన్ పూర్తి చేయటానికి ప్రయత్నిస్తుండగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్లను అధీకృత అధికారులుగా నియమించటంతోబాటు కేబుల్ టీవీ చట్టంలోని అధికారాలన్నీ కట్టబెట్టారు. స్థానికంగా వాళ్ళ పరిధిలో ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం కల్పించారు. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మార్చి 7 న ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, కార్యక్రమ నియమావళికి, ప్రకటనల నియమావళికి ఈ అధికారాలు వర్తించవు.