• Home »
  • Cable »
  • జెమినీ న్యూస్ : ఇది చాలా కాస్ట్లీ గురూ !

జెమినీ న్యూస్ : ఇది చాలా కాస్ట్లీ గురూ !

తెలుగు న్యూస్ చానల్స్ లో అత్యంత ఖరీదైన చానల్ ఏది ? ఖరీదు అంటే.. అద్భుతమైన టెక్నాలజీ వాడటం వల్లనో, అడ్వర్టయిజ్ మెంట్ టారిఫ్ ఎక్కువ కావటం వల్లనో అనుకుంటే పొరపాటే.  ప్రేక్షకులు ఆ చానల్ చూడాలంటే కట్టాల్సిన నెలసరి చందా పరంగా అది కాస్ట్లీ. తెలుగు న్యూస్ చానల్స్ అన్నిటిలోనూ నిస్సందేహంగా జెమినీ న్యూస్ కే ఆ ఖరీదైన ఘనత దక్కుతుంది. తెలుగులో జెమినీ న్యూస్, ఈటీవీ ఏపీ, ఈటీవీ తెలంగాణ తప్ప మరే ఇతర న్యూస్ చానల్ కూడా పే చానల్ గా మారే సాహసం చేయలేదు.

ఆ మాటకొస్తే మా టీవీ మెయిన్ చానల్, మా మ్యూజిక్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్ లాంటి ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా దాని ముందు దిగదుడుపే. ఇదంతా రేటింగ్స్ వలన సాధ్యమైందా? కానే కాదు. ఎందుకంటే, ఈ పదేళ్ళుగా రేటింగ్స్ లో ఎప్పుడూ ఆఖరి రెండు మూడు స్థానాల్లోనే తచ్చాడుతూ ఉంటుంది కాబట్టి. ఇంతకీ అసలు కారణం గ్రూప్ బలం. జెమినీ గ్రూప్ లో ఉండటం వలన ఏదో రకంగా మిగిలిన చానల్స్ తో కలిపి అంటగట్టవచ్చుననే అభిప్రాయంతో యాజమాన్యం దాని రేటునలా నిర్ణయించింది.

ఈ టీవీ కూడా తన రెండు న్యూస్ చానల్స్ ను పే చానల్స్ గా ప్రకటించింది. అయితే, ఒక్కొక్క చానల్ నెలసరి చందా రూ.3.20 గా నిర్ణయించగా,  జెమినీ న్యూస్ నెలసరి చందా మాత్రం రూ.4.30. ఇదే జెమినీ గ్రూప్ లో జెమినీ కామెడీ రూ. 3.04 కు, జెమినీ మ్యూజిక్ రూ. 4.02 కు అందుతుంది. రెండేళ్ళుగా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంటున్న మా టీవీ లాంటి ప్రధానమైన చానల్ నెలవారీ చందా రూ.3.20 మాత్రమే కావటం మరో విశేషం.

డిజిటైజేషన్ లో భాగంగా ప్రేక్షకులకు పే చానల్స్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని ప్రకటించినా, పెద్ద చానల్స్ ను చూపించి చిన్న చానల్స్ ను అంటగట్టే గ్రూప్ చానల్స్ దెబ్బకు ప్రేక్షకుడు చిత్తు కావాల్సిందే. అందుకు జెమినీ న్యూస్ ని మించిన ఉదాహరణ మరొకటి లేదు.  ఇప్పుడు ఎమ్మెస్వోలతో కుదుర్చుకునే ఒప్పందాల కోసం ప్రకటించిన ధరలివుఇ.  జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్ తో కలిపి పాకేజ్ లో అందుతుంది జెమినీ న్యూస్.