• Home »
  • Entertainment »
  • కమిషన్డ్ కార్యక్రమాలవైపు జెమినీ చూపు : వ్యూహం మార్చటానికి ’సన్ ’ గ్రీన్ సిగ్నల్

కమిషన్డ్ కార్యక్రమాలవైపు జెమినీ చూపు : వ్యూహం మార్చటానికి ’సన్ ’ గ్రీన్ సిగ్నల్

కార్యక్రమాల రూపకల్పనలో ఒక్కో చానల్ ఒక్కో పద్ధతి అవలంబిస్తూ రావటం, ఆ తరువాత వ్యూహంలో మార్పులు చేసుకోవటం చూస్తున్నదే. ఇప్పుడు జెమినీ టీవీ తాజాగా బయటివాళ్ళచేత కార్యక్రమాలు తయారుచేయించే కమిషన్డ్ పద్ధతి వైపు మొగ్గుచూపుతోంది. నిజానికి ఈ వ్యూహాన్ని తమిళేతర భాషలలో అమలు చేయాలని సన్ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవటంతో ముందుగా తెలుగు మార్కెట్ ను ఎంచుకున్నారు. దీంతో ఇకమీదట జెమినీ లో ప్రైవేట్ ప్రొడ్యూసర్ల కార్యక్రమాలు పెరుగుతాయి.

ఒకప్పుడు ఈటీవీ పూర్తిగా సొంత కార్యక్రమాల మీదనే ఆధారపడేది. సీరియల్స్ సహా అన్నీ స్వయంగా రూపొందించుకుంటూ, స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చింది. జీ తెలుగు, మా టీవీ మాత్రం ప్రొడక్షన్ హౌస్ ల ప్రతిపాదనలు పరిశీలించి కమిషన్డ్ కార్యక్రమాలు రూపొందించటానికి మొగ్గు చూపుతూ వచ్చారు. నాణ్యమైన కార్యక్రమాలు తయారుచేయటానికి ముందుకొచ్చేవాళ్ళను ప్రోత్సహిస్తూ పెద్దమొత్తాల్లో పెట్టుబడులు పెడుతూ అదే స్థాయిలో లాభాలు గడించటానికీ సిద్ధమాయ్యారు.

జెమినీ టీవీ మాత్రం ఎక్కువభాగం స్లాట్స్ అమ్మటానికి మొగ్గు చూపుతూ వచ్చింది. అంటే ప్రైవేటు నిర్మాతలు జెమినీ లో స్లాట్ కొనుక్కొని, ఆ స్లాట్ చార్జీలు చెల్లిస్తూ, తమకు కేటాయించిన ప్రకటనల సమయం – ఫ్రీ కమర్షియల్ టైమ్ అమ్ముకోవటం ద్వారా నిర్మాణ వ్యయం, స్లాట్ ఫీజు తోబాటు లాభాలు గడించాల్సి ఉండేది. ఇందులో బ్రాడ్ కాస్టర్ నష్టపోయే అవకాశమే ఉండదు. స్లాట్ ఇచ్చినంత మాత్రాన వదిలేసి ఒరుకోకుండా, రేటింగ్ రాని కార్యక్రమాన్ని ప్రైమ్ టైమ్ నుంచి తప్పించి నాన్-ప్రైమ్ టైమ్ కి మార్చిన సందర్భాలు కూడా గుర్తుండే ఉంటాయి.

అయితే, ఈ వ్యూహం వలన నష్టం రాకపోవచ్చునే తప్ప మార్కెట్ లో దూకుడుగా వ్యవహరించటమన్నది ఉండదు. సంప్రదాయంగా సొంత నిర్మాణానికే కట్టుబడిన ఈటీవీ సైతం మల్లెమాల లాంటి సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించిన తరువాతనే పెద్దమొత్తంలో లాభాలు చవిచూడటం మొదలుపెట్టింది. వైవిధ్య భరితమైన కార్యక్రమాల రూపకల్పనకు సైతం కమిషన్డ్ విధానం బాగా ఉపయోగపడుతుందని గ్రహించిన సన్ గ్రూప్ ఇప్పుడు జెమినీ తో ఈ విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. నిజానికి హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ కమిషన్డ్ విధానాన్నే అవలంబిస్తున్నాయి. నిర్మాణ సంస్థలకు ఎపిసోడ్స్ వారీగా చెల్లించి నాణ్యమైన కార్యక్రమం తయారయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

రిస్క్ లేకపోవటం ఒక్కటే విజయ రహస్యంగా ఉండకూదదని గ్రహించిన జెమినీ ఇప్పుడు తెలుగు మార్కెట్ లో కోల్పోయిన నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి పొందటానికి వ్యూహం మార్చబోతోంది. పెరుగుతున్న పోటీని తట్టుకోగలిగేలా నాణ్యమైన కార్యక్రమాల కోసం భారీగా ఖర్చుపెట్టినప్పుడే అంతకు మించి భారీగా ఆదాయం రాబట్టుకోవచ్చునని గుర్తించింది. అందుకే క్రమంగా స్లాట్ అమ్మకాలకు తెరదించుతూ కమిషన్డ్ కార్యక్రమాలను ప్రోత్సహించబోతోంది.

జెమినీ తీసుకుంటున్న నిర్ణయం ఫలితంగా కచ్చితంగా నాణ్యమైన, ఖరీదైన కార్యక్రమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి. అయితే, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న నాలుగైదు పేరుమోసిన నిర్మాణ సంస్థలే జెమినీ కోసం పనిచేస్తాయా, సరికొత్త నిర్మాతలు, సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చి కాంట్రాక్టులు దక్కించుకుంటారా అనేది చూడాల్సి ఉంది.
.