• Home »
  • Entertainment »
  • తగ్గిన మా టీవీ రేటింగ్స్- జెమినీ నంబర్ 1

తగ్గిన మా టీవీ రేటింగ్స్- జెమినీ నంబర్ 1

చాలా కాలం తరువాత మళ్ళీ జెమినీ టీవీకి మొదటి స్థానం దక్కింది. గతవారం వరకూ మొదటి  స్థానంలో ఉంటూ వచ్చిన మా టీవీ 8 శాతం మేరకు ప్రేక్షకాదరణ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. జీ తెలుగు మూడో స్థానానికి  పడిపోగా ఈటీవీ నాలుగో స్థానంలోనే ఉండిపోయింది. జెమినీ టీవీ గతవారం కంటే 3 శాతం పెరిగి 521 జీఆర్పీలు సంపాదించు కోగా, మాటీవీ గతవారం తెచ్చుకున్న 555 జీఆర్పీల నుంచి 508 జీ ఆర్పీలకు పడిపోవటంతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మూడో స్థానంలో ఉన్న జీ తెలుగు అంతకు ముందు వారం సాధించిన 460 జీఆర్పీలకంటే 33 జీఆర్పీలు పెంచుకొని 493 జీఆర్పీలు తెచ్చుకోగలిగింది.

తమిళం విషయానికొస్తే, సన్ టీవీ 1221 జీఆర్పీల నుంచి 1277 జీఆర్పీలకు పెరిగి తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. విజయ్ టీ వీ 346  జీఆర్పీల నుంచి 366 కు పెరిగింది. జీ తమిళ్ 124 నుంచి  128  జీఆర్పీలకు పెరిగింది. తమిళంలో ఇంకా దిగువన ఉన్న రాజ్, జయ తదితర  జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ కలిసినా సన్ టీవీలో సగమే ఉండటం గమనార్హం.

మలయాళం జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ మార్కెట్ వాటాలో ఏషియానెట్, మళవిల్ మనోరమ కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏషియా నెట్ 4 శాతం, మళవిల్ మనోరమ 19 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నాయి. ఏషియానెట్ కు 928 జీఆర్పీలు  రాగా మళవిల్ మనోరమకు 266 జీఆర్పీలు దక్కాయి. సూర్య టీవీ 196 జీఆర్పీల నుంచి 205 కు పెరిగినా, మూడో స్థానానికే పరిమితమైంది.

ఇక కన్నడ మార్కెట్ లో ఉదయ టీవీ 5 శాతం పెరుగుదల నమోదు చేసుకొని మొదటి స్థానానికి దూసుకురావటంతో కలర్స్ కన్నడ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఉదయ టీవీకి అంతకు ముందు వారం 402 జీఆర్పీలు రాగా, తాజావారంలో 421జీఆర్పీలు నమోదయ్యాయి. కలర్స్ కన్నడ మాత్రం 404 నుంచి స్వల్పంగా తగ్గి 399 జీఆర్పీలకు పడిపోవటంతో రెండో స్థానం తప్పలేదు. సువర్ణ టీవీ 251 జీఆర్పీలనుంచి 248 జీఆర్పీలకు తగ్గింది. మొత్తంగా తన మూడో స్థానంలోనే కొనసాగుతోంది.

మొత్తంగా చూస్తే దక్షిణాదిన తమిళ, మలయాళ మార్కెట్లలో నెంబర్ వన్ స్థానాలకూ, ఆ తరువాత స్థానాలకూ మధ్య విపరీతమైన తేడా కనిపిస్తుంది. తమిళంలో సన్ టీవీ, మలయాళంలో ఏషియానెట్ అసలు ప్రత్యర్థులే లేరన్నంతగా ముందున్నాయి. కానీ తెలుగు, కన్నడ మార్కెట్లలో మాత్రం చానల్స్ పోటాపోటీగా ఉండటం కనిపిస్తుంది. అదే విధంగా తమిళ, తెలుగు, కన్నడ మార్కెట్లలో సన్ టీవీ గ్రూపు ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఈ గ్రూప్ చానల్స్ లైసెన్సుల కొనసగింపు ప్రశ్నార్థకంగా మారి పరిశ్రమ అంతటా చర్చించుకుంటున్నా, ప్రేక్షకాదరణ ఎంతమాత్రమూ తగ్గలేదని స్పష్టమవుతోంది.