• Home »
  • Advertisement Code »
  • మానిటరింగ్ కోసం 182 చానల్స్ సమాచారం కోరిన ప్రభుత్వం

మానిటరింగ్ కోసం 182 చానల్స్ సమాచారం కోరిన ప్రభుత్వం

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రోజువారీ పరిశీలన పరిధిలోకి మరో 182 చానల్స్ చేరుతున్నాయి. ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానల్స్  మీద నిరంతర పర్యవేక్షణ కోసం మంత్రిత్వ శాఖ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు 182 చానల్స్ అదనంగా చేరుతున్నాయి. మానిటరింగ్ కోసం  ఆ చానల్స్  జూన్ 8 లోగా తమ వివరాలు పంపాల్సిందిగా కోరుతూ మంత్రిత్వశాఖ లేఖ రాసింది.

పే చానల్స్ అయితే ఒక్కో చానల్ కు ఒక సెట్ టీ ఆర్ వో ఇవ్వాలి. అది ఎస్ డి చానల్ అయితే ఎస్ డి- ఎస్ డి ఐ ఔట్ పుట్, హెచ్ డి చానల్ అయితే హెచ్ డి-ఎస్ డి ఐ ఔట్ పుట్ ఇవ్వగలిగి ఉండాలి. దీనితోబాటు  ఒక్కో బొకే చానల్స్ కు ఒక అదనపు ఐ ఆర్ డి ఇవ్వాలి.  లేదంటే,  పే టీవీ బ్రాడ్ కాస్టర్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ఒక వ్యూయింగ్ కార్డ్ (విసి) కి మాచింగ్ కామ్ మాడ్యూల్  ఇవ్వాలి.  అదే విధంగా టీవీ చానల్స్ తమ  ఫ్రీక్వెన్సీ శాటిలైట్, టెలిపోర్ట్ ఉన్న ప్రదేశం లాంటి సాంకేతిక వివరాలు కూడా తెలియజేయాలి.

ఉచిత చానల్స్ అయితే ( సిగ్నల్స్ ఎన్ క్రిప్ట్ చేయని చానల్స్ ) మాత్రం ఎలాంటి పరికరాలూ అందించాల్సిన అవసరం లేదు.  ఫ్రీక్వెన్సీ సమాచారం మాత్రం వెంటనే తెలియజేయాలి. డౌన్ లింకింగ్ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన సంస్థలుసొంత ఖర్చుతో మానిటరింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా మానిటరింగ్ చేయబోతున్న 182 చానల్స్ జాబితాను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తన వెబ్ సైట్ లో పెట్టింది.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మానిటరింగ్ లో చేర్చిన 8 తెలుగు చానల్స్ లో  టీవీ 9, టీవీ 1 ( జై తెలంగాణ లోగో తో ప్రసారమవుతున్నప్పటికీ ప్రభుత్వ జాబితాలో మాత్రం టీవీ 1 గానే ఉంది ), ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ అభిరుచి, ఎ టీవీ ( ప్రస్తుతం శివశక్తి సాయి టీవీ గా ప్రసారమవుతోంది), మాయాబజార్ ( గతంలో రిథమ్ పేరుతో లైసెన్స్ తీసుకొని ఆ తరువాత పేరు మార్చుకున్న వైజయంతి టెలివెంచర్స్ వారి చానల్)  ఉన్నాయి.

ఈ చానల్స్ ప్రసారాలను అనుక్షణం గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించటం ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ పని. ఆయా భాషలు తెలిసినవారిని నియమించి మానిటరింగ్ జరుపుతారు. ఇప్పటివరకు 600 కు పైగా చానల్స్ ను పర్యవేక్షిస్తూ వస్తుండగా ఇప్పుడు ఈ జాబితాతో దాదాపు అన్ని చానల్స్  ఇ ఎమ్ ఎమ్  సి పరిధిలోకి వస్తున్నట్టయింది. వీటితోబాటు త్వరలో ఎఫ్ ఎం రేడియోలను కూడా దీని పరిధిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.