• Home »
  • Cable »
  • పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటే ఎప్పటికీ ఆపరేటరే: కేంద్రం స్పష్టీకరణ

పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటే ఎప్పటికీ ఆపరేటరే: కేంద్రం స్పష్టీకరణ

పెద్ద ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి ఫీడ్ తీసుకునేవాళ్ళను ఎమ్మెస్వో అని పిలిచే అవకాశమే లేదా ? వేలాది కనెక్షన్లున్నా, ఇకమీదట కేబుల్ ఆపరేటర్లుగానే మిగిలిపోతారా? డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నా హెడ్ ఎండ్ పెట్టకపోతే ఆ లైసెన్స్ ఆధారంగా ఎమ్మెస్వో అని చెప్పుకోవటానికి వీల్లేదా? ఇంతకాలం కష్టపడి సొంత నెట్ వర్క్ అభివృద్ధి చేసుకున్నా, ఆపరేటర్ హోదాతోనే సరిపెట్టుకోవాలా? బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు ఉండితీరాలా ? ప్రస్తుతానికి ఫీడ్ తీసుకున్నా, భవిష్యత్తులోనైనా ఎమ్మెస్వోగా మారే అవకాశం లేదా? లేదనే చెబుతోంది ప్రభుత్వం. ఈ ప్రశ్నలన్నిటికీ అధికారికంగా ఇప్పుడు సమాధానాలు లభించాయి.

దీంతో డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోకుండా పెద్ద ఎమ్మెస్వో మీద ఆధారపడి ఫీడ్ తీసుకోవాలనుకుంటున్న చిన్న ఎమ్మెస్వోల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అలా ఫీడ్ తీసుకోవటం వల్ల స్థానికంగా కేబుల్ చానల్స్ నడుపుకోవటానికి సవాలక్ష సమస్యలుండటం ఒక వంతయితే, ఇక భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ఆపరేటర్ గానే ఉండిపోయే ప్రమాదం మరో వంతు. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నంత మాత్రాన భవిష్యత్తులో ఆ హోదా కొనసాగే అవకాశమే లేదని, హెడ్ ఎండ్ పెట్టుకొని బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకున్నవారికి మాత్రమే ఎమ్మెస్వో లైసెన్స్ కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చిచెప్పటంతో ఈ అయోమయం ఏర్పడింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షదీవులు, అండమాన్, నికోబార్ కోసం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు ఈ రోజు ఒక వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆ శాఖ జాయింట్ సెక్రెటరీ జయ మాట్లాడుతూ, డిజిటైజేషన్ వలన ప్రభుత్వ ఆదాయం 40% మేరకు పెరిగినట్టు మొదటి రెండు దశల్లో రుజువైందన్నారు. మూడో దశ డిజిటైజేషన్ గడువు పెంచే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రెటరీ జెసి శర్మ, తెలంగాణ రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ పొందినవారు, కార్పొరేట్ ఎమ్మెస్వోల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెస్వోల అనుమానాలను తీర్చటానికి, ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయటానికి ఈ సమావేశం ఉపయోగపడింది.
అయితే, కొత్త భయాలకూ ఈ సమావేశం తెరతీసింది. డిజిటైజేషన్ మూడో దశలో చిన్న ఎమ్మెస్వోల ముందున్న ప్రధాన సమస్య భారీ పెట్టుబడి. కోట్ల రూపాయలు వెచ్చించి డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోవటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అదే సమయంలో కొంత మంది పెద్ద ఎమ్మెస్వోలు డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టగలిగే సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెట్టి చిన్న ఎమ్మెస్వోలకు ఫీడ్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. దీన్ని వాడుకుంటే భారీ పెట్టుబడి సమస్య నుంచి బయటపడవచ్చునని చిన్న ఎమ్మెస్వోలు భావించారు. లైసెన్స్ తీసుకొని పెట్టుకుంటే భవిష్యత్తులో వెసులుబాటును బట్టి సొంత హెడ్ ఎండ్ పెట్టుకోవచ్చుననుకున్నారు.

కానీ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సమావేశంలో ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చింది. హిందుజా వారి హిట్స్ ప్లాట్ ఫామ్ “ నెక్స్ట్ డిజిటల్ “ తెలంగాణ , రాయలసీమ్ హెడ్ శ్రీకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రిత్వశాఖ సలహాదారు యోగేంద్రపాల్ తదితర అధికారులు సమాధానమిస్తూ, ఒక పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకునే స్వతంత్ర ఎమ్మెస్వోల పరిస్థితిని వివరించారు. డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకున్న వారు మాత్రమే “ ఎమ్మెస్వో “ గా పిలవబడతారే తప్ప లైసెన్స్ ఉన్నవాళ్ళందరూ ఎమ్మెస్వోలుగా అర్హులు కాదన్నారు. వాళ్ళు అధికారికంగా మామూలు కేబుల్ ఆపరేటర్లు మాత్రమే అవుతారని వివరణ ఇచ్చారు. అదే సమయంలో హెడ్ ఎండ్ ఉండటంతోబాటు బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
అదే సమయంలో ’ హిట్స్ ’ లో భాగస్వాములైనవారికి మాత్రం ఎమ్మెస్వో హోదా ఉంటుంది. హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ ఇచ్చే హెడ్ ఎండ్ సొల్యూషన్ ను సాంకేతికంగా హెడ్ ఎండ్ గానే ప్రభుత్వం పరిగణిస్తుండల్ల హిట్స్ సేవలందుకునే ఎమ్మెస్వోలు తమ డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ను కొనసాగిస్తూ ఆ హోదా అనుభవించే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయమేంటంటే, ఇప్పుడు పూర్తిగా హిట్స్ మీద ఆధారపడుతూ ఉన్నవారు సైతం భవిష్యత్తులో ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకొని, బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకొని ఎమ్మెస్వోలుగా మారటానికి కూడా నెక్స్ట్ డిజిటల్ లో అవకాశముంది.

ఈ సమావేశం తరువాత స్వతంత్ర ఎమ్మెస్వోలలో అంతర్మథనం మొదలైంది. నెట్ వర్క్ మీద ఆధిపత్యం కొనసాగించుకోవటం, సొంత కేబుల్ చానల్స్ ప్రసారం చేసుకోవటం, ఫీడ్ తెచ్చుకోవటానికి అయ్యే ఖర్చు లేకుండా చూసుకోవటం, ఎమ్మెస్వో లైసెన్స్ తెచ్చుకొని ఎప్పటికీ ఎమ్మెస్వోగా ఆ హోదా నిలబెట్టుకోవటం, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మారలనుకున్నా ఎమ్మెస్వోగా మారటం అనే అవకాశాలన్నీ కొద్దిపాటి పెట్టుబడితో సొంతమయ్యే అవకాశాలున్నది నెక్స్ట్ డిజిటల్ లో మాత్రమేనని తేలటంతో ఇప్పటివరకు ఉన్న రకరకాల అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. దీనివలన పరోక్షంగా పెద్ద ఎత్తున హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ లబ్ధిపొందే అవకాశాలు కనబడుతున్నాయి.