• Home »
  • Entertainment »
  • దూరదర్శన్ ప్రకటనల్లో కోత విధించిన ప్రభుత్వశాఖలు

దూరదర్శన్ ప్రకటనల్లో కోత విధించిన ప్రభుత్వశాఖలు

దూరదర్శన్ ప్రేక్షకాదరణ గురించి తెలియటం వలన ప్రైవేట్ సంస్థలు సంస్థలు పెద్దగా ప్రకటనలివ్వటానికి మొగ్గుచూపకపోవటం తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వశాఖలు సైతం దూరదర్శన్ కి ఇచ్చే ప్రకటనలలో సగానికి సగం కోత పెడుతున్నాయి. ఇదే విషయాన్ని అధికారికంగా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకూ తెలియజేశాయి. ఈ ధోరణిమీద ప్రధాని కార్యాలయానికి ఒక నివేదిక పంపాలని మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక వార్తా కథనం ప్రచురించింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ. వంద కోట్ల మేరకు ప్రచార ప్రకటనలను దూరదర్శన్ నుంచి ఉపసంహరించుకోగా వ్యవసాయ శాఖ కూడా అదే బాటలో నడుస్తోంది. మొత్తం ఏడాదికి రూ.145 కోట్ల బడ్జెట్ లో సగానికి సగం కోత పెట్టింది. ఇకమీదట 70 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుంది. దూరదర్శన్ పట్ల నమ్మకం తగ్గటానికి, అది విశ్వసనీయత కోల్పోవటానికి నిదర్శనమని కూడా ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానించింది.

ప్రసారభారతి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తున్నదని సమాచార, ప్రసార సహాయ మంత్రి రాథోడ్ వ్యాఖ్యానించారు. కేవలం గ్రామీణ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉందటం వలన పట్టణప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే రేటింగ్స్ లో డిడి వెనుక ఉంటోందని చెప్పుకుంటే సరిపోదన్నారు. మరిన్ని కార్యక్రమాలను బయటినిర్మాతలకిచ్చి నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించే దిశలో చర్యలు తీసుకుంటామన్నారు.

అయితే, ప్రసార భారతి అనేది బాలెన్స్ షీట్ చూపించి లాభనష్టాలను బేరీజు వేసే ప్రభుత్వరంగ సంస్థ కాదని ప్రసారభారతి సీఈవో జవహర్ సర్కార్ వ్యాఖ్యానించారు. లాభాపేక్షలేని ప్రజాప్రయోజన సంస్థగా అభివర్ణిస్తూ, ప్రైవేట్ రంగం సాహసించని చోట కూడా ప్రజలకోసం ప్రసారభారతి అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. అయితే, ఖర్చుతో పోల్చినప్పుడు ఆదాయం నామమాత్రంగా ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమేనని ఒప్పుకున్నారు.