• Home »
  • Cable »
  • మూడోదశ డిజిటైజేషన్ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం

మూడోదశ డిజిటైజేషన్ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం

డిజిటైజేషన్ అతి పెద్ద దశ అయిన మూడో దశ అమలు గడువును పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా మూడో దశ పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు ఒక కొలిక్కి రాకపోవటం, సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్ళు పూర్తి స్థాయిలో వేగం పుంజుకోకపోవటం అనేక అనుమానాలకు దారితీస్తుండగా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. మూడో దశ కింద మొత్తం 29 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 630 జిల్లాల్లోని 7,709 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి.

ఒకవైపు బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య ఒప్పందాలు కుదరకపోవటం, మరోవైపు ఎమ్మెస్వోలకూ, కేబుల్ ఆపరేటర్లకూ మధ్య కూడా ఇంకా ఒప్పందాలు కుదరకపోవటం సహజంగానే గడువు తేదీ మీద అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే, డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రం గడువు తేదీ పెంచబోవటం లేదనే సంకేతాలిస్తూ వచ్చాయి. మొదట తాత్కాలిక లైసెన్సులకు మొగ్గు చూపటం, ఆ తరువాత, అసలు హోం శాఖ క్లియరెన్సే అవసరం లేదని ప్రకటించటం అందుకు ఉదాహరణలు.

ఆగస్టు 17 న జరిగిన 10 వ టాస్క్ ఫోర్స్ సమావేశంల సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ విషయమై ఒక విస్పష్టమైన ప్రకటన చేసింది. జాయింట్ సెక్రటరీ ఆర్ జయ మాట్లాడుతూ. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఎవరైనా ఇప్పటికీ గడువు పొడిగించే అవకాశముందను అనుకుంటూ ఉంటే ఆ ఆలోచనకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఆరంభంలోనే అడ్డుఅట్ట వేయాలని అందరికీ సూచించారు.
మొత్తానికి బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకు మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు వేగంగా పూర్తికావాలని, సెట్ టాప్ బాక్సులు అమర్చే పని వేగవంతం చేయాలని కోరారు. అదే సమయంలో ఆపరేటర్లతో కూడా ఎమ్మెస్వోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెబుతూ మొదటి రెండు దశల్లో జరిగిన పొరపాట్లవలన సెట్ టాప్ బాక్సులు ముందే యాక్టివేట్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టయిందని చెప్పారు.

మొదటి మూడు నెలలకాలంలో జాతీయ స్థాయి ఎమ్మెస్వోలను చూసినా సెట్ టాప్ బాక్సుల అమరిక నత్తనడకన సాగుతునట్టు తేలింది. హాత్ వే, సిటీ కేబుల్ ఒక్కొక్కటీ 2 లక్షల సెట్ టాప్ బాక్సుల చొప్పున మాత్రమే అమర్చగలిగాయి. డెన్ నెట్ వర్క్ పెట్టిన బాక్సుల సంఖ్య లక్షా 85 వేలు. ఎమ్మెస్వోలకూ, బ్రాడ్ కాస్టర్లకూ మధ్య కంటెంట్ విషయమై జరగాల్సిన ఒప్పందాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా ముగ్గురు బ్రాడ్ కాస్టర్లు ఈ విషయంలో పురోగతిని వివరిస్తూ కేవలం ఇద్దరు ఎమ్మెస్వోలతో ఒప్పందాలు కుదిరినట్టు నివేదించారు. స్టార్ ఇండియా, మల్టీ స్క్రీన్ మీడియా (సోనీ గ్రూప్), టీవీ 18 అంతకుముందు ట్రాయ్ కి నివేదిక ఇస్తూ మొత్తం ఎమ్మెస్వోల నుంచి 55 విజ్ఞాపనలు వచ్చాయని, ఇద్దరు ఎమ్మెస్వోలతో మాత్రమే ఒప్పందాలమీద సంతకాలు అయ్యాయని చెప్పాయి. మరో 11 మంది ఎమ్మెస్వోలతో చర్చలు పురోగతిలో ఉన్నాయని కూడా నివేదించారు.

ఎమ్మెస్వోల లైసెన్స్ పరిస్థితి

చాలా మంది ఎమ్మెస్వోలు ఇంకా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని, ఈ నేపథ్యంలో గడువు పూర్తయ్యేసరికి అనేకమంది అలా మిగిలిపోయే ప్రమాదమున్నదని మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధి టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. ఒక్క మహారాష్ట్రలోనే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు దాదాపు 5 వేల మంది ఉన్నట్టు చెప్పారు. వీళ్లలో చాలామంది ఎమ్మెస్వో లైసెన్స్ కోసమ్ దరఖాస్తు చేసుకోకపోవటాన్ని ప్రస్తావించారు. ఇందుకు జాయింట్ సెక్రెటరీ బదులిస్తూ, ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్ కు ఇప్పటికీ గడువు ముగియలేదని, ఇప్పుడు కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు.ఇప్పటివరకు మొత్తం 349 ఎమ్మెస్వో లైసెన్సులు జారీచేయగా అందులో 126 తాత్కాలిక లైసెన్సులని చెప్పారు. దరఖాస్తు చేయకపోవటం వలన మిగిలిపోయే ప్రాంతాలు ఏవైనా ఉంటాయనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించే నోడల అధికారులు వాటిని గుర్తించాల్సి ఉంటుందన్నారు.

కంటెంట్ ఒప్పందాల వ్యవహారం

బ్రాడ్ కాస్టర్లు కంటెంట్ ఇవ్వటం లేదని, ఇలాంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి చిన్న ఆపరేటర్ ఢిల్లీ వరకు వచ్చి టిడిశాట్ లో ఫిర్యాదు ఇవ్వాల్సి వస్తున్నదని అస్సాం కి చెందిన కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధి టాస్క్ ఫోర్స్ కి ఫిర్యాదు చేశారు. ట్రాయ్ ఇందుకు సమాధానమిస్తూ, వివాదాలకు సంబంధించిన అంశాలైతే టిడిశాట్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలైతే ట్రాయ్ ని కూడా సంప్రదించవచ్చునని గుర్తుచేసింది. అస్సాం వారు కోల్ కతా లో ఉన్న ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని సూచించింది.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల విషయానికొచ్చినప్పుడు ఇండస్ ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థ కేబుల్ తో బాటు హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెప్పారు. బ్రాడ్ కాస్టర్లతో చర్చలు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధి వివరణ ఇస్తూ ఒకవైపు చర్చలు సాగుతునాయని, మరో వైపు ఒప్పందాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు.

హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్

హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ నిబంధన వలన జరుగుతున్న జాప్యాన్ని చాలామంది ఈ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన రెండు రోజులకే హోం శాఖ క్లియరెన్స్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా లైసెన్సులు జారీ చేసి మూడో దశకు ఎలాంటి అవాంతరాలూ లేకుండా చూడాలన్నదే ప్రభుత్వం పట్టుదల అని మంత్రిత్వశాఖ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

సెట్ టాప్ బాక్సుల సేకరణ

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ( సీమా ) ప్రతినిధులు తమకు పెద్ద పెద్ద ఎమ్మెసోలనుంచి సెట్ టాప్ బాక్సుల కోసం ఇప్పటికీ ఆర్డర్లు రాలేదని టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. మూడో దశ గడువు పూర్తి కావస్తునప్పటికీ ఈ ధోరణి కనబడటం ఆందోళనకరంగా ఉందని, ముందస్తు ఆరడర్లు లేకుండా ఒకే సారి పెద్దమొత్తంలో బాక్సులు కావాలంటే సాధ్యంకాదని చెప్పారు. ఎమ్మెస్వోలు తాము కోరుకున్న కండిషనల్ యాక్సెస్ విధానంలో తయారైన సెట్ టాప్ బాక్సులు గడువు తేదీ లోగా కావాలంటే వెంటనే ఆర్డర్లు పెట్టాల్సిన అవసరముందని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ఎమ్మెస్వోల దగ్గర తగినన్ని సెట్ టాప్ బాక్సులు లేవన్నారు. దీనివలన డిజిటైజేషన్ పురోగతి మందగించిందని చెప్పారు.

సెట్ టాప్ బాక్సుల ధర

సెట్ టాప్ బాక్సుల ధర విషయం కూడా టాస్క్ ఫోర్స్ సమావేశంలో చర్చకు వచ్చింది. ట్రాయ్ ప్రతినిధి వివరణ ఇస్తూ ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు తమ చందాదారులకు సెట్ టాప్ బాక్సులు ఇవ్వటానికి కొన్ని విధానాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. అద్దె పద్ధతి, వాయిదాల పద్ధతి, పూర్తిగా కొనుగోలు పద్ధతి ఉన్నాయని, వీటిలో చందాదారు ఏ ఒక విధానమైనా ఎంచుకోవచ్చునని చెప్పారు. స్టాండర్డ్ టారిఫ్ పాకేజ్ కింద ట్రాయ్ ఇలా ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించిందని గుర్తుచేశారు. ఈ విషయంలో ఏవైనా ఫిర్యాదులుంటే ట్రాయ్ కి చెబితే పరిష్కరిస్తుందని వివరణ ఇచ్చారు.

డిజిటైజేషన్ పర్యవేక్షణకు 12 ప్రాంతీయ యూనిట్లు

డిజిటైజేషన్ పర్యవేక్షణ కోసం దేస వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ అందుబాటులో ఉండే విధంగా 12 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలోనూ డిజిటైజేషన్ పురోగతిని పరిశీలిస్తూ, ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ జయ చెప్పారు. పురోగతి మీద ఎప్పటికప్పుడు నివేదికలిచ్చే బాధ్యతను కూడా ఆ ప్రాంతీయ యూనిట్లకు అప్పగించారు. ఈ కార్యాలయాలు సెప్టెంబర్ నుంచి పనిచేస్తాయని వెల్లడించారు.
వర్క్ షాపులు, అవగాహనాప్రచారం

డిజిటైజేషన్ మీద అవగాహన పెంచేందుకు ఇప్పటికే నాలుగు ప్రాంతీయ వర్క్ షాప్స్ ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ జయ తెలియజేశారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నోడల్ అధికారులకు ఈ వర్క్ షాప్స్ ద్వారా అవగాహన కల్పించామన్నారు. డిజిటైజేషన్ ప్రక్రియ అమలులో రాష్ట్రప్రభుత్వాల పాత్ర, బాధ్యతల గురించి ప్రధానంగా ఈ వర్క్ షాప్స్ ద్వారా తెలియజేయగలిగామన్నారు.
ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే డిజిటల్ ఎమ్మెస్వోలుగా లైసెన్స్ పొందిన వారిని కూడా ఈ సమావేశాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించామని చెప్పారు. ఎమ్మెస్వోలు తమ లోకల్ కేబుల్ చానల్స్ ద్వారా డిజిటైజేషన్ మీద ప్రచారం చేపట్టినట్టు సమావేశంలో తెలియజేశారని, కొంతమంది కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారని వివరించినట్టు ఆమె చెప్పారు.

వచ్చే ఒకటిన్నర నెలలకాలంలో వేరు వేరు ప్రదేశాలలో మరో ఏడు వర్క్ షాప్స్ ఇదే తరహాలో నిర్వహించాలని కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించిందన్నారు. ఆగస్టు 21 న షిల్లాంగ్ లో జరిగిన సమావేశంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నోడల్ అధికారులు, ఆ రాష్ట్రాల్లో డిజిటల్ లైసెన్స్ పొందిన ఎమ్మెస్వోలు పాల్గొన్నారని గుర్తు చేశారు. బ్రాడ్ కాస్టర్లతోబాటు సంబంధిత భాగస్వాములందరూ ప్రజా చైతన్య కార్యక్రమాలమీద వాళ్ళ ప్రణాళికలను వెల్లడించాలని కోరారు.

కొంత మంది బ్రాడ్ కాస్టర్లతో కలిసి సెప్టెంబర్ లో చేతనా యాత్ర చేపడుతున్నట్టు అసోచామ్ ప్రతినిధి టాస్క్ ఫోర్స్ కు తెలియజేశారు. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 450 నగరాలు, పట్టణాలు, పెద్ద గ్రామాలు ఉంటాయన్నారు. డిటిహెచ్ ఆపరేటర్ల ప్రతినిధి మాట్లాడుతూ కేబుల్ టీవీ డిజిటైజేషన్ మీద ఉచితంగా ప్రచారం చేపట్టటానికి డిటిహెచ్ వేదికలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.

న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ, బ్రాడ్ కాస్టర్లకు అనేక ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రచార ప్రకటనల రూపకల్పనతోబాటు వాటి ప్రసారానికి సిద్ధంగా ఉన్నామని టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. ట్రాయ్ ఇప్పటికే ఒక ప్రచార ప్రకటన రూపొందించి తన వెబ్ సైట్ లో ఉంచిందని, త్వరలో అన్ని పత్రికలలో పావు పేజ్ అడ్వర్టయిజ్ మెంట్ ఇవ్వబోతున్నదని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. చందాదారులను చేరుకునేందుకు ట్రాయ్ ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు సమావేశం వెల్లడించింది. ఐదు ప్రాంతాల్లో చందాదారులకోసం ఈ అవగాహనా కార్యక్రమాలుంటాయి. వాళ్ళ కోణం నుంచి డిజిటైజేషన్ ను ఎలా చూడాలో ఈ కార్యక్రమాలలో వివరిస్తారు.

ట్రాయ్ రూపొందించిన ప్రకటనను ఎమ్మెస్వోలకు అందించటం ద్వారా దానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నామని ట్రాయ్ వెల్లడించింది. ఆలిండియ రేడియో, దూరదర్శన్ కొన్ని నెలలుగా డిజిటైజేషన్ మీద ప్రచార ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయని టాస్క్ ఫోర్స్ గుర్తుచేసింది.అయితే, దూరదర్శన్ ఈ ప్రకటనలను ప్రాంతీయ భాషల్లో కూడా ఇవ్వటం సమంజసంగా ఉంటుందని, ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయటం వలన ఫలితాలుంటాయని సభ్యులు టాస్క్ ఫోర్స్ సృష్టికి తెచ్చారు. దూరదర్శన్ ప్రతినిధి అందుకు అంగీకరించారు. వెంటనే అమలు చేస్తామన్నారు.

జిటిపిఎల్ ప్రతినిధి మాట్లాడుతూ స్థానిక చానల్స్ ద్వారా ప్రచారం ముమ్మరం చేశామని స్క్రోలింగ్ రూపంలో వీలైనంత ఎక్కువమందిని చేరుకోగలుగుతున్నామని చెప్పారు. ఈ ప్రచారం కోసం తాము 300 మందితో భారీ కార్యక్రమం చేపట్టినట్టు ఐఎమ్ సిఎల్ ప్రతినిధి టాస్క్ ఫోర్స్ కు చెప్పారు. పశ్చిమబెంగాల్ కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధి మాట్లాడుతూ వినియీగదారుల అవగాహనాసదస్సులు జరుగుతున్న విషయమే తమ దృష్టికి రాలేదన్నారు. ట్రాయ్ ఈ విషయం ఆపరేటర్ల సంఘానికి కూదా తెలియనంత రహస్యంగా ఎలా నిర్వహిస్తున్నదని ప్రశ్నించారు. అయితే, సభ్యులందరూ ట్రాయ్, ఎమ్ ఐ బి వెబ్ సైట్స్ చూస్తూ ఉండాలని టాస్క్ ఫోర్స్ తన సభ్యులకు ప్రత్యేకంగా సూచించింది. కేబుల్ డిజిటైజేషన్ కు సంబంధించిన సమాచారమంతా అందులో ఉంటుందని తెలియజెప్పింది.
డిజిటైజేషన్ లో భాగస్వాములైన అందరూ కలసికట్టుగా కృషి చేసి ఈ ప్రక్రియ విజయానికి తోడ్పడాలని టాస్క్ ఫోర్స్ చెయిర్ పర్సన్ విజ్ఞప్తిచేశారు. అనుకున్న విధంగా ముందుకు సాగటానికి, గడువులోగా పూర్తి కావటానికి ఇది తప్పనిసరి అని సూచించారు. బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు వెంటనే ఒంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద సంతకాలు చేసి ఇంకెంత మాత్రమూ ఆలస్యం చేయకుండా ముందుకు సాగాలని కోరారు.

టాస్క్ ఫోర్స్ సమావేశానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకూ ఆహ్వానం ఉన్నా, తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఇప్పటివరకూ జరిగిన 10 టాస్క్ ఫోర్స్ సమావేశాలలో ఒక్క సమావేశానికీ హాజరుకాలేదు. డిజిటైజేషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ రంగంలో దిగిన దాఖలాలు లేవు. దేశం మొత్తంలో 8వ వంతు కేబుల్ కనెక్షన్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నా, టాస్క్ ఫోర్స్ లో ఎమ్మెస్వోల సంఘాలకూ, కేబుల్ ఆపరేటర్ల సంఘాలకూ ప్రాతినిధ్యం లేదు.