• Home »
  • Digitisation »
  • సెట్ టాప్ బాక్స్ తయారీదారులకు దీర్ఘకాలిక రుణాలు

సెట్ టాప్ బాక్స్ తయారీదారులకు దీర్ఘకాలిక రుణాలు

దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయటానికి వీలుగా స్వదేశీ సెట్ టాప్ బాక్స్ తయారీదారులకు దీర్ఘకాల రుణాలిచ్చి ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోబాటు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వ్యవహారాలు పరిశీలించే పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సమాచార, ప్రసారాల శాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలియజేశారు.  ప్రభుత్వం ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.

డిజిటైజేషన్ ప్రక్రియలో సెట్ టాప్ బాక్స్ కీలకమన్న విషయాన్ని  కమిటీ గుర్తుచేసుకుంటూ ,  చైనానుంచి సెట్ టాప్ బాక్సులు దిగుమతి చేసుకునే అవసరాన్ని తగ్గించాలంటే స్వదేశీ తయారీదారులను ప్రోత్సహించాలని, ఆ క్రమంలో దీర్ఘకాల ఋణాలివ్వటం ఒక మార్గమని కమిటీ సూచించగా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు తెలియజేసింది.

నిజానికి దేశంలో ఇప్పుడు సెట్ టాప్ బాక్సులు తయారుచేసే కంపెనీలు 19 ఉన్నప్పటికీ వాటి ఉత్పత్తికి తగినంత డిమాండ్ లేదు.  స్వదేశీ సెట్ టాప్ బాక్సుల కొనుగోలు కంటే చైనా నుంచి దిగుమతి చేసుకోవటమే మేలు అనే అభిప్రాయం కలగటమే అందుకు కారణం. డిమాండ్ ఉంటే ఉత్పత్తి పెంచటానికి తయారీదారులు సిద్ధంగా ఉన్నారని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ( సీమా)  పదే పదే చెబుతూనే ఉంది. చైనా తయారీదారులతో పోటీ పడాలంటే అందుకు తగిన వాతావరణం కల్పించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటరీ కమిటీకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలోని ఎమ్మెస్వోలు చైనా నుంచి సెట్ టాప్ బాక్సులు దిగుమతి చేసుకొవటానికి బాంకులనుంచి దీర్ఘకాలిక రుణాలు అందుబాటులో ఉండగా, ఇక్కడి తయారీదారులకు మాత్రం అలాంటి రుణ సౌకర్యం లేకపోవటం వలన ఈ పోటీలో బాగా వెనుకబడ్దారని తేలింది. అయితే, సెట్ టాప్ బాక్సుల తయారీని టెలికామ్ నెట్ వర్క్ పరికరాల జాబితాలోకి తీసుకురావటం ద్వారా స్వదేశీ సెట్ టాప్ బాక్సుల మీద  వాల్యూ యాడెడ్ టాక్స్ ( వ్యాట్ )  తగ్గించగలిగినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ కమిటీకి తెలియజేసింది. అదే విధంగా స్వదేశీ పరిజ్ఞానంతో  కండిషనల్ యాక్సెస్ సిస్టమ్  ను రూపొందించగలిగామని, ఇది కూదా స్వదేశీ సెట్ టాప్ బాక్స్ ల తయారీకి, పంపిణీకి ఊతమిచ్చి వేగవంతం చేస్తుందని పేర్కొంది.

అయితే, మిషన్ డిజిటైజేషన్ కు కేటాయింపులు పెంచే విషయం పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీ ఈ సందర్భంగా సూచించింది. ఇది ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇవ్వటమే కాకుండా ఉపాధి కల్పనకు కూడా దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. 12 వ పంచవర్ష ప్రణాళికలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రధానంగా దృష్టి సారించదలచుకున్న రంగాలలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ కూడా ఉండటం వల్ల నిధులు వెచ్చించటంలో ఆ ప్రాధాన్యం కనపడాలని హితవు పలికింది. మిషన్ డిజిటైజేషన్ కిందకేటాయించిన మొత్తాన్ని ఖర్చుచేయకపోవటాన్ని ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సంవత్సరానికి అదనపు కేటాయింపులు జరపటాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ గుర్తుచేసింది