• Home »
  • Cable »
  • క్షేత్ర స్థాయి సవాళ్ళతో ఎమ్మెస్వోలకు డిజిటైజేషన్ ఫలాలు ఆలస్యం: ఇక్రా

క్షేత్ర స్థాయి సవాళ్ళతో ఎమ్మెస్వోలకు డిజిటైజేషన్ ఫలాలు ఆలస్యం: ఇక్రా

సువిశాలమైన భారతదేశంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్ళ కారణంగానే డిజిటైజేషన్ వలన అందాల్సిన ఫలితాలు ఎమ్మెస్వోలకు, బ్రాడ్ కాస్టర్లకు అందటంలో అసాధరణంగా ఆలస్యం జరుగుతోందని ఇన్వెస్ట్ మెంట్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఇక్రా) అభిప్రాయపడింది. భారత మీడియా, వినోద పరిశ్రమ- టీవీ ప్రసారాల పంపిణీ మీద ప్రచురించిన తాజా సంచిక (సెప్టెంబర్, 2015 ) లో ఈ మేరకు వెల్లడించింది. 2011 లో ప్రారంభించిన డిజిటైజేషన్ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అడ్రెసబిలిటీ సాధించలేకపోయిందని, బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని కూడా ఆ నివేదికలో వ్యాఖ్యానించింది.

ఇంటింటికీ డిజిటల్ ప్రసారాలు అందించేందుకు ఎమెస్వోలు చేస్తున్న ప్రయత్నాలకు క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందువలన చందాదారులకు కోరుకున్నవిధంగా వారికి నచ్చిన పాకేజీలు, వాల్యూ యాడెడ్ సేవలు అందించటంలో అసాధారణంగా ఆలస్యం జరుగుతోంది. ఈ ఆలస్యం వలన అనివార్యంగా ఎమ్మెస్వోలకు, బ్రాడ్ కాస్టర్లకు అందాల్సిన ఫలితాలు అందటం లేదు. కనెక్షన్ల సంఖ్య సరిగా తేలకపోవటం వలన ఎమ్మెస్వో, బ్రాడ్ కాస్టర్ ఇంకా లాభాలు సంపాదించుకోలేకపోతున్నారు. అదే సమయంలో చందాదారుడు కూడా లబ్ధిపొందలేకపోతున్నాడని ఇక్రా అభిప్రాయపడింది. చందా పాకేజీలు అందుబాటులోకి రాకపోవటమే అందుకు కారణమని తేల్చింది. పాకేజీలు అమలు చేసినప్పుడే. కంటెంట్ ఖరీదు పెరిగి కనెక్షన్ల సగటు ఆదాయం, తద్వారా లాభాలు పెరుగుతాయని నివేదించింది.

మొదటి రెండు దశల డిజిటైజేషన్ లో జరిగిన అసాధారణ జాప్యాన్ని కూడా ఇక్రా ప్రస్తావించింది. చందాదారుల దరఖాస్తు ఫారాలు ఆలస్యం కావటం వలన ఎమ్మెస్వ్వోలు ఆర్థికంగా లాభపడలేకపోయారని పేర్కొంది. కేబుల్ ఆపరేటర్లు తమ పరిధిలోని చందాదారులనుంచి దరఖాస్తులు స్వీకరించటంలో అలసత్వం ప్రదర్శించారని, చందాదారులమీద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికే ప్రాధాన్యమిచ్చారని ఇక్రా అభిప్రాయపడింది. పైగా వినోదపు పన్ను భారం పంచుకోవటంలో భేదాభిప్రాయాల కారణంగా కూడా ఆపరేటర్లు చాందాదారులను తమ గుప్పిట్లోనే పెట్టుకోవటం మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు గుర్తించింది. దీంతో చందాదారుల సంఖ్య ఆధారంగానే చందాలు వసూలు చేయాల్సి వచ్చింది తప్ప చందాదారులు ఎంచుకున్న పాకేజీల ఆధారంగా వసూలు చేసుకునే అవకాశం దొరకలేదు.

కారేజ్ ఫీజు విషయంలో భిన్నమైన ధోరణులు కనిపించాయి. మొత్తంగా చూసినప్పుడు పంపిణీదారులు 25 శాతం మేరకు కారేజ్ ఫీజు తగ్గినట్టు చెబుతున్నప్పటికీ, కంటెంట్ అగ్రిగేటర్ల తొలగింపుతో కొన్ని చిన్న చానల్స్ కూడా కారేజ్ ఫీజు ఒప్పందాలు కుదుర్చుకోవటం, కొత్తగా వస్తున్న చానల్స్ పెద్దమొత్తంలో ఇవ్వజూపటం లాంటి కారణాలవలన కారేజ్ ఆదాయం పెరిగింది.

ఇక ఇప్పుడు పూర్తి కావాల్సిన మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ విషయానికొస్తే, డిటిహెచ్ ఆపరేటర్లు, చిన్న ఎమ్మెస్వోలు కీలకపాత్ర పోషిస్తారని ఇక్రా అంచనావేసింది. ఈ రెండు దశల అమలు గడువుతేదీ పొడిగింపు వలన క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించుకోవటానికి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించటానికి, ఎక్కువమంది చందాదారులను చేర్చుకోవటానికి అవకాశం ఏర్పడింది.

అయితే, ఈ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం, ధరలు మార్చటాన్ని ఆమోదించటంలో వెనుకంజ వేసే ధోరణి వలన పెట్టుబడులు పెట్టటానికి అంతగా ఆసక్తి చూపటం లేదని కూడా ఇక్రా తేల్చింది. అయితే, డిటిహెచ్ ఆపరేటర్లు ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారని, కేబుల్ కూడా వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళగలిగే సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నదని అభిప్రాయపడింది.

ఈ రంగంలో పరపతి సౌకర్యం పెరగటానికి తగినవాతావరణం లేకపోవటాన్ని ఇక్రా గుర్తించింది. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి రావటం , ఆదాయం రావటానికి పట్టే కాలం చాలా ఎక్కువగా ఉండటం చాలా ఇబ్బందికరమైన అంశాలు. ఒకవైపు బ్రాడ్ కాస్టర్లనుంచి ఎక్కువ ధరకు కంటెంట్ తీసుకోవాల్సి రావటం, మరోవైపు చందాదారులనుంచి మాత్రం అదే స్థాయిలో వసూలు చేయలేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి రావటం వలన ఎమ్మెస్వో చిక్కులో పడ్డాడని ఇక్రా గుర్తించింది.

మొదటి రెండు దశాల్లోనూ కార్పొరేట్ ఎమ్మెస్వోలు కీలకపాత్ర పోషించటం వలన మార్కెట్ నుంచి వాటాల రూపంలో వారు పెట్టుబడులు సమకూర్చుకోగలిగారు. అదే సమయంలో చిన్న ఎమ్మెస్వోలకు అలాంటి సౌకర్యం లేకపోవటం వలన పెద్ద ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లూ మూడు, నాలుగు దశల్లోనూ లబ్ధిపొందే అవకాశం కలుగుతోందని ఇక్రా గుర్తించింది. వాల్యూ యాడెడ్ సర్వీసులు, బ్రాడ్ బాడ్ లాంటి సేవలు అందించగలగటం కార్పొరేట్ ఎమెస్వోలకు మాత్రమే సులభంగా తయారైందని కూడా పేర్కొంది. వచ్చే కొద్ది సంవత్సరాలలో వనరుల సమీకరణ పెద్ద ఎత్తున ఉంటుందని ఇక్రా అంచనా వేసింది.

కేబుల్ వ్యాపారంలో లాభదాయకత స్థిరంగా ఉండటానికి వచ్చే రెండేళ్ళ కాలం పడుతుందని ఈ నివేదిక పేర్కొంది. అమలుచేయటంలో జాప్యం జరుగుతున్నప్పటికీ దీర్ఘ కాలంలో డిజిటైజేషన్ ఫలితాలు ఎమ్మెస్వోలకు, డిటిహెచ్ ఆపరేటర్లకు, బ్రాడ్ కాస్టర్లకు చాలా ఎక్కువగానే ఉంటాయని ఇక్రా చెబుతోంది. అయితే, చందాదారుల జేబులకు చిల్లులు పడతాయని కూడా హెచ్చరిస్తోంది. మొదటి రెండు దశల్లో నామమాత్రంగా ఉన్న డిటిహెచ్ ఇప్పుడు మూడు, నాలుగు దశల్లో మాత్రం బాగా పుంజుకొని 20-25 శాతం వాటా పొందగలగవచ్చునని అంచనావేసింది.