• Home »
  • Content Code »
  • ప్రధానిపై గుజరాత్ టీవీ పరోక్ష వ్యాఖ్యలు : ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ చర్యలు?

ప్రధానిపై గుజరాత్ టీవీ పరోక్ష వ్యాఖ్యలు : ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ చర్యలు?

ప్రధాని మోడీ మీద పరోక్ష వ్యాఖ్యలు చేసిన గుజరాత్ సమాచార్ టీవీ మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సిఫార్సు రావటమే అలస్యమని అధికారులు చెబుతున్నారు. అయితే, చానల్ యాజమాన్యం మాత్రం తప్పేమీ చేయలదని వాదిస్తోంది. గాడ్సే కి ఔన్నత్యం ఆపాదించే వాళ్ళను హద్దుల్లో ఉంచాలని మాత్రమే కోరామని అంటున్నారు. తాము ఎవరి పేర్లూ ప్రస్తావించలేదని, దేశాధినేతలను గౌరవిస్తామే తప్ప భావ స్వేచ్ఛనే అడ్డుకుంటామంటే ఎలా అని చానల్ ప్రశ్నిస్తోంది.

సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కూడా ప్రధాని పేరు ప్రస్తావించకుండానే నోటీస్ ఇస్తూ జి ఎస్ టీవీ వైఖరిపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.జనవరి 30 న గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రసారం చేసిన కార్యక్రమంలో ’ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ’ చేసినందుకు ఫిబ్రవరి 2న నోటీసు జారీచేసింది. గాంధీ హత్యా కోనీ జవాబ్ దారీ (గాంధీ చావుకు కారణమెవరు ? ) అంటూ అర్థగంటపాటు ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. కొన్ని హిందూ సంస్థలు గాడ్సే కి గుడికట్టే యత్నాలు చేయటాన్ని ఆ కార్యక్రమం విమర్శించింది. ఖరీదైన సూట్లు వేసుకోవటం, చీపుర్లు ఊపటం ద్వారా గాంధీ ఆశయాలు నెరవేరుస్తున్నట్టు నటించటం అర్థరహితమని పేర్కొంది.

మహాత్మాగాంధీ జీవనశైలిని పేరు చెప్పకుండా ఒక “నాయకునితో “ పోల్చుతూ, గాంధీజీ ఎప్పుడూ సీదాసాదా జీవితమే గడిపారని, ఈ నాయకుడు మాత్రం 9 లక్శ్జల రూపాయల సూట్ వేసుకోవటం, ఖరీదైన కార్లలో తిరగటం చూస్తున్నామని జిఎస్ టీవీ తన వార్తలో వ్యాఖ్యానించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన ఆ నాయకునికి వాస్తవంగా గాంధీజీ ఆశయాలమీద, సిద్ధాంతాలమీద నమ్మకం లేకపోయినా కేవలం గౌరవం పొందటం కోసం ఆయన పేరు వాడుకుంటున్నారని విమర్శించింది.

ఏ రాజకీయ నాయకుడు తీరునైనా విమర్శించే హక్కు చానల్ కు ఉన్నప్పటికీ ఆ వార్తలో అది విమర్శించిన తీరు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించటానికి ప్రసారం చేసినట్టుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. గాంధీని పొగుడుతున్న నాయకుడు మరోవైపు గాడ్సేని పొగుడుతున్నవారిని అడ్డుకోవటంలేదని కూడా ఆ చానల్ వ్యాఖ్యానించటం ద్వారా హింసను ప్రేరేపిస్తోందని మంత్రిత్వశాఖ తన నోటీస్ లో పేర్కొంది. అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చునని, కార్యక్రమాల నియమావళికి విరుద్ధమని అభిప్రాయ పడింది.

చానల్ ఇందుకు సమాధానమిస్తూ, కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘించలేదని, వాక్స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తూ తమకు షో కాజ్ నోటీస్ జారీచేశారని పేర్కొంది. మహాత్ముడి సందేశాన్ని రూపుమాపాలనుకుఏ శక్తులమీద ప్రజాప్రయోజనం కోసమే ఆ వార్త ప్రసారం చేశామని వివరణ ఇచ్చింది. గాంధీని చంపిన గాడ్సేకి కీర్తిని ఆపాదించే ప్రయత్నాలను ప్రతిఘటించటం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. అలా కీర్తించటమంటే గాంధీని కించపరచటమేనని, పైగా సమాజాన్ని రెండుగా చీల్చే యత్నం జరుగుతోందని కూడా వ్యాఖ్యానించింది.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ వ్యవహారాన్ని సమీక్ష కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీకి పంపింది. మరోవైపు మౌఖిక వివరణ కోసం చానల్ కూ నోటీస్ ఇచ్చింది. చానల్ వివరణ ఇవ్వటం కూడా పూర్తవటంతో ఇప్పుడు నిర్ణయం వెలువడాల్సి ఉంది. కమిటీ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చానల్ డైరెక్టర్ శ్రేయాన్స్ షా చెబుతుండగా, గత అనుభవాలను బట్టి 10 నుంచి 60 రోజులవరకు చానల్ ను సస్పెండ్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.