• Home »
  • Cable »
  • రిజిస్ట్రేషన్ కూడా లేని ఆపరేటర్లు 50%: ఉద్దేశపూర్వకమా ? అమాయకత్వమా?

రిజిస్ట్రేషన్ కూడా లేని ఆపరేటర్లు 50%: ఉద్దేశపూర్వకమా ? అమాయకత్వమా?

మహారాష్ట లోని పూణె జిల్లాలో సగానికి పైగా కేబుల్ ఆపరేటర్లకు కనీసం పోస్టల్ రిజిస్ట్రేషన్ లేదని తేలింది. ఈ మధ్యనే ఆ జిల్లా అధికారులు వినోదపు పన్ను వసూళ్ళమీద దృష్టిసారించి బకాయిల వసూళ్ళకు సిద్ధమైనప్పుడు ఈ విషయం వెల్లడైంది. మొత్తం 960 మంది కేబుల్ ఆపరేటర్లుండగా వాళ్ళలో 500 మందికి పోస్టల్ రిజిస్ట్రేషన్ లేదు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) నిబంధనల ప్రకారం ప్రతి కేబుల్ ఆపరేటర్ విధిగా పోస్టల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి.

అధికారులు ఈ ఉల్లంఘన తమ దృష్టికి రాగానే ఉలిక్కిపడ్డారు. కనీస నిబంధన పాటించకపోవటం వల్లా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న విషయం కూడా గ్రహించారు. రెండు నెలల్లోగా పోస్టల్ రిజిస్ట్రేషన్ తీసుకోకపోతే చర్యలు తప్పవంటూ నోటీసులు జారీచేశారు. పన్నుల ఎగవేతకోసమే రిజిస్టర్ చేసుకోలేదని అధికారులు నిర్థారణకు వచ్చారు. ప్రజలనుంచి అదనపు పన్నులు వసూలు చేసికూడా ప్రభుత్వానికి జమచేయటం లేదన్నది అధికారుల అభియోగం.

అయితే, కేబుల్ ఆపరేటర్ల సంఘాల నాయకులు మాత్రం ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చునంటున్నారు. అధికారులు చెబుతున్నట్టుగా సగానికి సగం మంది రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నారనటం సరికాదంటున్నారు. నిజానికి వాళ్ళందరూ వినోదపు పన్ను చెల్లిస్తూనే ఉన్నారని, అక్రమంగా వ్యాపారం నడుపుతున్నవారైతే అధికారులు వాళ్ళకు ఇప్పటివరకూ వినోదపు పన్ను నోటీసుకు ఎలా పంపించారని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం నగరప్రాంత వాసులకు ఒక్కో కనెక్షన్ కు రూ. 24 చొప్పున, గ్రామీణ ప్రాంత వాసులకు ఒక్కో కనెక్షన్ కు రూ. 15 చొప్పున పన్ను విధిస్తున్నారు. ఒక్క పూణె జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే , మిగిలిన చోట్ల ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి నడుస్తున్నదా, కేవలం కొన్ని చోట్ల అమాయకత్వం వల్ల తీసుకోలేకపోయారా అన్నది ప్రశ్న.