• Home »
  • Broadband »
  • కేబుల్ వ్యాపారం నుంచి బ్రాడ్ బాండ్ ని వేరు చేస్తున్న హాత్ వే

కేబుల్ వ్యాపారం నుంచి బ్రాడ్ బాండ్ ని వేరు చేస్తున్న హాత్ వే

ఇప్పటిదాకా కేబుల్ తో బాటు బ్రాడ్ బాండ్ వ్యాపారం కూడా నిర్వహిస్తూ వచ్చిన హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థ ఇకమీదట తన బ్రాడ్ బాండ్ వ్యాపారాన్ని విడదీయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం హాత్ వే బ్రాడ్ బాండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక అనుబంధ కంపెనీని ప్రారంభిస్తోంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ అందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.

ఈ విధంగా కంపెనీని విభజించటం వలన హాత్ వే బ్రాడ్ బాండ్ వ్యాపారం మరింతగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రాడ్ బాండ్ కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని హాత్ వే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. పైగా ఇప్పటిదాకా ఉన్న వాటాదారులకు కూడా ఇది అదనపు ప్రయోజనమని హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ ఎండీ, సీఈవో జగదీశ్ కుమార్ చెబుతున్నారు.

భారతదేశంలో వైర్ లైన్ బ్రాడ్ బాండ్ ప్రస్తుతం 8 శాతం మాత్రమే ఉండగా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకు పోవటానికి ఇదే సమయమని హాత్ వే భావిస్తోంది. నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకుపోవటానికి కూడా ఇదే మార్గమన్న అభిప్రాయంలో ఉంది, ధర పట్ల ఆచితూచి వ్యవహరించే భారత మార్కెట్లో డాక్సిస్ 3.0 ప్లాట్ ఫామ్ మీద హైబ్రిడ్ కొయాక్సియల్ ఫైబర్ ద్వారా ఇంటింటికీ చేరుకోవటం ఉత్తమమని హాత్ వే భావిస్తోంది.

అయితే, ఈ బిభజన ప్రక్రియకు వాటా దారులనుంచి కూడా ఆమోదం లభించాల్సి ఉంది. అదే సమయంలో ఋణదాతలనుంచి, హైకోర్ట్ నుంచి, టెలికాం శాఖ నుంచి,స్టాక్ ఎక్స్ చేంజిలనుంచి, సెబి నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాంకేతికాంశాలన్నీ పూర్తి చేసుకోవటానికి కనీసం ఆరునెలలు పట్టవచ్చునని తెలుస్తోంది.