• Home »
  • Cable »
  • హిందుజా హిట్స్ ప్లాట్ ఫామ్ “నెక్స్ట్ డిజిటల్”

హిందుజా హిట్స్ ప్లాట్ ఫామ్ “నెక్స్ట్ డిజిటల్”

కేబుల్ డిజిటైజేషన్ ను కీలకమైన మలుపు తిప్పి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్న హిందుజా వారి హిట్స్ ఎట్టకేలకు అధికారికంగా లోగో ను అవిష్కరించింది. వర్కింగ్ టైటిల్ గా ఇంతకాలం దాని పేరు గ్రాంట్ హిట్స్ గా వ్యవహారంలో ఉండగా ’ నెక్స్ట్ డిజిటల్ ’ పేరుతో తన హిట్స్ ప్లాట్ ఫామ్ ఉండబోతున్నట్టు వెల్లడించింది. మొదటి రెండు దశల డిజిటైజేషన్ లో కీలకంగా తయారైన ఆరు జాతీయ స్థయి ఎమ్మెస్వోలు ఇక మిగిలిన రెండు దశల మీద దాదాపుగా ఆశలు వదులుకొని బ్రాడ్ బాండ్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారంటేనే నెక్స్ట్ డిజిటల్ విజయం మీద వాళ్ళకున్న నమ్మకం అర్థమవుతోంది.

నోయిడాలో దాదాపు 35 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునికమైన డిజిటల్ హెడ్ ఎండ్ తీర్చిదిద్దటంతో బాటు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్న నెక్స్ట్ డిజిటల్ అందించే చానల్స్ సంఖ్య కూడా ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ అందరికంటే ఎక్కువగా కనీసం 500 చానల్స్ కు తగ్గకుండా ఇవ్వటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఇంక ఎక్కువే ఉండవచ్చునని, వ్యూహాత్మకంగా రహస్యంగా ఉంచిన ఈ విషయాన్ని కూడా త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది. ఆకర్షణీయమైన పాకేజీలతో ఆగస్టు నుంచి సేవలందించటానికి సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు స్వతంత్ర ఎమ్మెస్వోలు హిందుజా వారి హిట్స్ పట్లా అసక్తి కనబరుస్తూ వీలైనంత త్వరగా అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమయ్యారు. జులై ఆఖరులోగా మూడో దశ డిజిటైజేషన్ లో ప్రధాన వాటా సొంతం చేసుకోవటానికి తగిన పాకేజీలు, అందుబాటు ధరల విధానంతో సిద్ధం కావటం వల్లనే హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ విజయం పట్ల ధీమాతో ఉన్నట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

హిందుజా వెంచర్స్ వారి గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ 2012 నవంబర్ లో హిట్స్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోగా,  దాదాపు మూడేళ్ళలు గడిచిన తరువాత ఈ నెల 14న గ్రాంట ఆఫ్ పర్మిషన్ అగ్రిమెంట్ ( GOPA) వచ్చింది. అందుకే ఇప్పటిదాకా ఆగి లోగో ఇప్పుడు విడుదలచేశారు. ఇకమీదట దూసుకుపోవటమే మిగిలిందని నెక్స్ట్ డిజిటల్ భావిస్తోంది. 11 కోట్లకు పైగా ఇళ్ళు ఇప్పుడు మూడు, నాలుగు దశల్లో డిజిటైజ్ కావాల్సి ఉండగా వాటిమీద దృష్టి సారించి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.