• Home »
  • Cable »
  • కేబుల్ నెట్ వర్క్ ల యాజమాన్యాన్ని కాపాడే హిట్స్ వేదిక “నెక్స్ట్ డిజిటల్”

కేబుల్ నెట్ వర్క్ ల యాజమాన్యాన్ని కాపాడే హిట్స్ వేదిక “నెక్స్ట్ డిజిటల్”

కేబుల్ డిజిటైజేషన్ అనగానే ఆపరేటర్ల శకం అంతరించినట్టేనని, స్వతంత్ర ఎమ్మెస్వోలు ఇకమీదట కార్పొరేట్ ఎమ్మెస్వోల మోచేతికింద నీళ్ళు తాగాల్సిందేనని, కనీసం రెండు మూడు కోట్ల పెట్టుబడి పెట్టలేనివాళ్ళందరూ పెద్ద ఎమ్మెస్వోలకు నెట్ వర్క్ లు వదులుకోవాల్సిందేనని భయపడుతూ వచ్చారు. డిజిటైజేషన్ ప్రక్రియలో కీలకమైన మూడో దశ మొదలైనప్పటికీ స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు అయోమయ పరిస్థితి ఎదుర్కుంటున్న సమయంలో అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ సరికొత్త విధానంతో ముందుకొచ్చిన హిందుజా సంస్థ వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ అధికారికంగా తన వ్యూహాన్ని వెల్లడించింది.

ఎమ్మెస్వోలను, స్థానిక కేబుల్ ఆపరేటర్లను బలోపేతం చేసి, హిందుజా వారి హిట్స్ వేదిక అయిన నెక్స్ట్ డిజిటల్ సాయంతో వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పైపైకి దూసుకుపోగలరని చెబుతూ, ఆ భావాన్ని  ప్రతిబింబించేలా లోగో తయారైందని సంస్థ సీఈవో టోనీ డి సిల్వా వివరించారు. ఆకాశమే హద్దుగా ఎదిగే నెక్స్ట్ డిజిటల్కు కూడా అది అద్దం పడుతుందన్నారు.  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని నియమాలూ పాటిస్తూ, ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకుంటూ, గడువులోగా డిజిటైజేషన్ పూర్తి చేయటానికి కృషిచేస్తూ  ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవటానికి నెక్స్ట్ డిజిటల్ సహకరిస్తుందని ఆయన వివరించారు.

పరిశోధన ఫలితాలు

డిజిటైజేషన్ పట్ల మార్కెట్లో ఎలాంటి అవగాహన ఉన్నదో అధ్యయనం చేయటం ద్వారా ఏ మేరకు ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు మేలు చేయగలమో తెలుసుకోవాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సర్వే జరిపినట్టు టోనీ డి సిల్వా వెల్లడించారు. 2014 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ అధ్యయనంలో కేబుల్ టీవీ పంపిణీ రంగాన్ని, ఇందులో భాగస్వాములైన ఆపరేటర్లను, స్వతంత్ర ఎమ్మెస్వోలను కలుసుకొని విస్తృతంగా సమాచారం సేకరించారు.మూడు, నాలుగు దశల డిజిటఒజేషన్ జరిగే ప్రాంతాల్లోని 12 నగరాలు, పట్టణాలలో 2000 మందికి పైగా ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను కలుసుకొని వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలను సేకరించారు. ఈ సమాచారాన్నంతా విశ్లేషించి సంక్షిప్తీకరించినప్పుడు ప్రధానంగా వారు ఆరు అంశాలు కోరుకుంటున్నారని వెల్లడైంది:

1. ఏళ్ళ తరబడి కష్టపడి నిర్మించుకుంటూ వచ్చిన నెట్ వర్క్ మీద యాజమాన్యం తమకే ఉండాలి

  1. బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలను స్వయంగా ముందుకు తీసుకెళ్లాలి
  2. స్థానిక మార్కెట్ అవసరాలకు తగినట్టుగా ఆఫర్లు,పాకేజీలు రూపొందించే స్వేచ్ఛ తమకే ఉండాలి
  3. తమ వీలును బట్టి సెట్ టాప్ బాక్సులు తీసుకునే వెసులుబాటు ఉండాలి
  4. స్థానిక చందాదారుల అవసరాలకు అనుగుణంగా స్థానిక చానల్స్ జోడించుకునే అవకాశం ఉండాలి
  5. మిగిలిన డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు దీటైన అత్యాధునిక ప్లాట్ ఫామ్ కావాలి. అది భవిష్యత్ అవసరాలను సైతం దృష్టిలోపెట్టుకొని చందాదారులను ఆకర్షించగలిగేట్టు ఉండాలి.స్థూలంగా చెప్పాలంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండిపోవాలని కోరుకుంటున్నారని, వాళ్ళ నెట్ వర్క్ ల మీద యాజమాన్యం కోల్పోవటానికి సిద్ధంగా లేరని. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డిజిటైజేషన్ జరగాలనుకుంటున్నారని టోనీ డి సిల్వా వివరించారు.

నెక్స్ట్ డిజిటల్ ఎలా పనిచేస్తుంది
హిందుజా వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ రెండు నమూనాలను అందుబాటులో ఉంచుతుంది. కోరుకున్న నమూనాను ఎంచుకునే స్వేచ్ఛ ఆయా ఎమ్మెస్వోలు/ఆపరేటర్ల కే వదిలేస్తారు. ఒకటి వైట్ లేబుల్ సర్వీస్, రెండోది పూర్తి స్థాయి సర్వీస్. నెక్స్ట్ డిజిటల్ సర్వీస్ అందుకోవటానికి ఒప్పుకుంటూ సంతకం చేయటం ద్వారా నెట్ వర్క్ యజమాని టెక్నాలజీ మీద భారీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నుంచి బైట పడతాడు.

అదే విధంగా కేబుల్ కనెక్షన్లను అనలాగ్ నుంచి డిజిటల్ కు మార్చటంలో అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను సమీకరించుకోవాల్సిన అవసరమూ ఉండదు. మొత్తం మౌలిక సదుపాయాలన్నీ నెక్స్ట్ డిజిటల్ చూసుకుంటుంది. అదే విధంగా కస్టమర్ సర్వీస్ కోసం అవసరమయ్యే కాల్ సెంటర్ తో సహా ఏర్పాట్లన్నీ నెక్స్ట్ డిజిటల్ నిర్వహిస్తుంది. అందువల్ల నెట్ వర్క్ యజమాని తన వ్యాపార విస్తరణమీద, పే చానల్స్ తో ఒప్పందాలమీద, లోకల్ చానల్స్ మీద దృష్టిపెడితే సరిపోతుంది.

నెక్స్ట్ డిజిటల్ ఈ ఆగస్టులో 150-200 చానల్స్ తో ప్రారంభించి 500 కు పైగా చానల్స్ కు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంపెగ్4 లో ఎన్ క్రిప్ట్ చేసిన చానల్స్ ,హెచ్ డి చానల్స్ సహా అందించేందుకు సిద్ధమైంది. స్థానికంగా చానల్స్ జోడించే వెసులుబాటు కూడా కల్పిస్తారు. అక్టోబర్-నవంబర్ నాటికల్లా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అదే విధంగా దర్శన్, టీవీ ఎవ్విరివేర్, గేమ్స్,లెర్నింగ్ లాంటి వాల్యూ యాడెడ్ సర్వీసుల, .ఓవర్ ద టాప్ ( ఒటిటి) సైతం డిసెంబర్ నాటికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ధర నిర్ణయం, ఆదాయ పంపిణీ

ఆపరేటర్లు తమకు కావాల్సిన సెట్ టాప్ బాక్సులను ఒకేసారి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. తక్ష్జణ అవసరాలకు తగినన్ని మాత్రమే తీసుకువెళ్ళి అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు పెంచుకోవటమో, తగ్గించుకోవటమో చేసుకోవచ్చు. వినియోగదారుడి అవసరాన్ని బట్టి స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్ డి), హై డెఫినిషన్ (హెచ్ డి) సెట్ టాప్ బాక్సులు అందుబాటులో ఉంటాయి. ఎస్ డి బాక్స్ ధర రూ.1400 గా నిర్ణయించగా, హెచ్ డి బాక్స్ ధర రూ. 1800 గా నిర్ణయించారు. సెట్ టాప్ బాక్సులు ఇవ్వటం ఈ పాటికే మొదలు పెట్టగా 25 లక్షల బాక్సులకు ఆర్డర్లు వెల్లువెత్తాయి. రెండు బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్స్ తో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని డి సిల్వా వెల్లడించారు.

ప్రతి ఆపరేటర్ తన పరిధిలో ఉన్న చందాదారులను బట్టి ఒక్కో చందాదారుకు రూ.20 వంతున నెక్స్ట్ డిజిటల్ కు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చందాదారుడు ఆన్ లైన్ పద్ధతిలో నేరుగా నెక్స్ట్ డిజిటల్ కే చెల్లించే పక్షంలో ఆపరేటర్లతో చందాదారుకు రూ.2 చొప్పున పంచుకుంటుంది. ఈ హిట్స్ వేదిక ప్రీ పెయిడ్ పద్ధతిలో నడుస్తుంది. పోస్ట్ పెయిడ్ కు సైతం అవకాశం ఉన్నప్పటికీ ముందుగా ప్రీ పెయిడ్ విధనం మీదనే దృష్టి సారిస్తున్నట్టు డి సిల్వా వెల్లడించారు. అదే విధంగా చందాదారు దరఖాస్తు ( CAF) నింపి ఇచ్చేదాకా సర్వీస్ యాక్టివేట్ చేసే ప్రసక్తే ఉండదని కూడా స్పష్టం చేశారు.
అవగాహన కార్యక్రమాలు

దేశవ్యాప్తంగా నెక్స్ట్ డిజిటల్ లో ఇప్పటికే 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా బ్రాడ్ కాస్ట్, కేబుల్, టెలికామ్ రంగాల్లో నిష్ణాతులుగా పేరు తెచ్చుకున్నవారు. సంస్థ ముంబయ్, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు నగరాలలో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయటంతోబాటు 16 రాష్ట్రాలలో ఆయా రాష్ట్రస్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేస్తోంది. స్థానిక ఆపరేటర్లకు ఈ వేదిక పట్ల అవగాహన పెంపొందించే దిశలో 39 నగరాలలో రోడ్ షో లి నిర్వహించాలని నిర్ణయించింది. అదే విధంగా రేడియో, స్థానిక మీడియాతో బాటు ఔట్ ఆఫ్ హోమ్ (ఒ ఒ హెచ్ ) ద్వారా ప్రచారం చేయటానికి సిద్ధమైంది. తన సర్వీసు ప్రత్యేకత, సాంకేతిక సామర్థ్యం, సేవల నాణ్యతను ప్రచారం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు రూపొందించినట్టు టోనీ డి సిల్వా ప్రకటించారు.