• Home »
  • HITS »
  • హిట్స్ : చిన్న ఎమ్ ఎస్ వో లకు చౌకగా డిజిటైజేషన్

హిట్స్ : చిన్న ఎమ్ ఎస్ వో లకు చౌకగా డిజిటైజేషన్

హిట్స్ : చిన్న ఎమ్ ఎస్ వో లకు చౌకగా డిజిటైజేషన్

కేబుల్ పరిశ్రమ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కోటీ 70 లక్షల కేబుల్ కనెక్షన్లున్నాయి. ఇటీవలి కాలం వరకూ వీటిలో అత్యధిక భాగం అనలాగ్ కనెక్షన్లే. అనలాగ్ కావటం వలన అందులో అందించగలిగే చానల్స్ సంఖ్యకు ఒక పరిమితి ఉంది. ప్రసారాల నాణ్యత కూడా తక్కువే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనలాగ్ నుంచి డిజిటల్ కు మారుతున్నాయి. డిజిటైజేషన్ వలన అదే బాండ్ విడ్త్ లో ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ప్రసారాల నాణ్యత కూడా చాలా బాగుంటుంది. పైగా, వీడియో ఆన్ డిమాండ్, ఇంటర్నెట్, గేమింగ్, ఎలక్ట్రానికి ప్రోగ్రామింగ్ గైడ్ లాంటి అనేక ఇంటరాక్టివ్, వాల్యూ యాడెడ్ సర్వీసులు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే వీలుంటుంది. కేబుల్ కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న డిటిహెచ్, ఐపిటివి వంటి ప్లాట్ ఫామ్స్ ఎలాగూ డిజిటల్ కాబట్టి ఆ పోటీలో తట్టుకోవటానికి కేబుల్ కూడా డిజిటైజ్ కావటం తప్పనిసరి అవుతుంది.

అనేక అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు కేబుల్ వ్యవస్థను డిజిటైజ్ చేయటం చాలా అవసరమని అర్థమవుతుంది. అది మార్కెట్ లో అనూహ్యమైన మంచి మార్పులు తెస్తుందనీ తెలుస్తూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా అమలు చేసినప్పుడు ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనివలన విదేశీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. బాండ్ విడ్త్ వాడకం గరిష్ఠమవుతుంది. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వినియోగం పెరగడం అంటే టెక్నాలజీని సంపూర్ణంగా వాడటానికి భారతదేశం సిద్ధమైనట్టు లెక్క. అలా భారతదేశంలో డిజిటైజేషన్ ఆలోచనకు పునాదులు పడుతున్నప్పుడే చౌకధరలో డిజిటైజేషన్ జరగటానికి వెసులుబాటు కల్పించే ఒక వ్యవస్థ సిద్ధమవుతూ వచ్చింది. అదే హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్).

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం తక్కువ ధరకే డిజిటైజేషన్ ఫలాలు అందించటానికి అందుబాటు లోకి వచ్చిన ప్రత్యేకమైన వ్యవస్థ హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (HITS). ఈ హిట్స్ పరిజ్ఞానంతో అతి సునాయాసంగా దేశమంతటా డిజిటైజేషన్ పూర్తి చేయవచ్చు. నిజానికి ఒక్కో నగరంలో టెరెస్ట్రియల్ డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టటానికి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ అవుతుంది. ఈ హిట్స్ వ్యవస్థలో పే చానల్స్ ను వాటి వాటి శాటిలైట్స్ నుంచి ఒక కేంద్రీకృత ప్రదేశంలోకి అందుకుంటుంది. వాటిని డీకోడ్ చేసి కలిపి, మళ్ళీ ఎన్ క్రిప్ట్ చేసి ఉమ్మడి ఎన్ క్రిప్షన్ తో ఆ సిగ్నల్స్ ను మళ్ళీ సి బాండ్ ఫ్రీక్వెన్సీ ఉన్న శాటిలైట్ కి అప్ లింక్ చేస్తారు. అప్పుడు ఈ సిగ్నల్స్ ను ఆయా ఎమ్ ఎస్ వో లు లేదా కేబుల్ ఆపరేటర్లు తమ కంట్రోల్ రూమ్ లో డౌన్ లింక్ చేసుకొని ఇళ్ళకు పంపిణీ చేస్తారు.

కేబుల్ ఆపరేటర్లు ఒక ట్రాన్స్ పాండర్ కు కేవలం ఒక ట్రాన్స్ మాడ్యులేటర్ వాడితే సరిపోతుంది. ( ప్రస్తుతం ఒక ట్రాన్స్ పాండర్ 12 నుంచి 14 చానల్స్ వరకు అందిస్తుంది). అది అక్కడినుంచి సెట్ టాప్ బాక్స్ ఉన్న ప్రతి ఇంటికీ ప్రసారాలు అందించటానికి పనికొస్తుంది. ఆ సెట్ టాప్ బాక్స్ వలన వినియోగ దారుడు తాను కోరుకున్న చానల్స్ కు సంబంధించిన చానల్స్ మాత్రమే అందుకోగలుగుతాడు. అనలాగ్ లో ఉచిత చానల్స్ ఎలాగూ ఇంటింటికీ డీకోడర్ లేకుండా మామూలుగా అందించటం సాధ్యమవుతుంది. ఉచిత డిజిటల్ చానల్స్ ను కేబుల్ ఆపరేటర్లు డిజిటల్ స్ట్రీమ్ తో అందుకోవచ్చు. డిజిటల్ ఉచిత చానల్స్ ను చందాదారు లకు సెట్ టాప్ బాక్స్ లోని డీ ఎన్ క్రిప్షన్ వ్యవస్థగుండా వెళ్ళకుండానే అందుబాటులోకి వస్తాయి. ఒక చందాదారుడు తాను కోరుకున్న చానల్స్ ఎంచుకోవడానికీ, వాటిని సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (SMS) ద్వారా కేంద్ర్రీకృత ప్రదేశంలో నిర్వహించటానికీ వీలవుతుంది

ప్రస్తుత అనలాగ్ పంపిణీ వ్యవస్థ
ఇప్పుడున్న కేబుల్ పంపిణీ వ్యవస్థలో దేశమంతటా అనేక కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. అవి కేబుల్ ఆపరేటర్లకు చానల్ సిగ్నల్స్ ను పంపిణీ చేస్తాయి. ఆ తరువాత అక్కణ్ణుంచి కేబుల్ కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ అందుతాయి. ఈ ప్రస్తుత విధానంలో పే చానల్స్ నూ, ఉచిత చానల్స్ నూ కలిపేసి ఆపరేటర్ వాటిని ఒక బండిల్ గా ఒక నిర్దిష్టమైన మొత్తానికి అందిస్తాడు. అంటే, వినియోగదారుడు చూసినా, చూడకపోయినా సరే ఆ చానల్స్ అన్నిటికీ కలిపి ఆ మొత్తాన్ని చందాగా చెల్లిస్తుంటాడు. ఎమ్ ఎస్ వోలు, స్వతంత్ర కేబుల్ ఆపరేటర్లు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసుకొని టీవీ సిగ్నల్స్ అందుకోవటానికీ, పంపిణీ చేయటానికీ వాడుకుంటారు.

అందులో శాటిలైట్ డిష్ లు, రిసీవర్లు, ఇంటిగ్రేటెడ్ రిసీవర్లు-డీకోడర్లు (IRDs) , మాడ్యులేటర్లు, ఫైబర్ ట్రాన్స్ మిషన్ పరికరాలు ఉంటాయి. అటు ఉచిత చానల్స్, ఇటు పే చానల్స్ డౌన్ లోడ్ చేసుకోవటానికి శాటిలైట్ డిష్ లు వాడతారు. అలా డిష్ లనుంచి అందుకున్న సిగ్నల్స్ ను ఉచిత చానల్స్ అయితే రిసీవర్లలోకి, పే చానల్స్ అయితే ఐ ఆర్ డి లలోకి ఫీడ్ చేస్తారు. ఈ రిసీవర్లు, ఐ ఆర్ డి ల నుంచి వచ్చే ఔట్ పుట్ ను మాడ్యులేట్ చేసి ఫైబర్ లేదా కొయాక్సియల్ కేబుల్స్ కు ఎక్కించి కేబుల్ దారి అంతటా అక్కడక్కడా యాంప్లిఫై చేసి వినియోగదారుడి ఇంటికి చేరుస్తారు. ఆ విధంగా ఒక అనలాగ్ ప్లాట్ ఫామ్ మీద దాదాపు వంద చానల్స్ పంపిణీ చేస్తారు. ఈ అనలాగ్ వ్యవస్థ లక్షణాలివి :

• అనలాగ్ కేబుల్ నెట్ వర్క్ వ్యవస్థలో సామర్థ్యానికి పరిమితి ఉంది. దాదాపు వంద చానల్స్ మాత్రమే ప్రసారం చేయగలిగే వీలుంటుంది, అందులోనూ 60-70 మాత్రమే బాగా చూడగలిగేలా ఉండే బాండ్ మీద ప్రసారమవుతాయి. మిగిలినవి హైపర్ బాండ్ లో అంటే, ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. వాటి ప్రసార నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు లైసెన్స్ పొందిన శాటిలైట్ చానల్స్ దాదాపు 800 ఉండగా తెలుగులో ప్రసారమయ్యేవి 50కి పైగా ఉన్నాయి.

• ఇప్పుడున్న అనలాగ్ వ్యవస్థలో వినియోగదారుడికి ఎంచుకునే అవకాశం లేదు. అందువల్ల ఆపరేటర్ ఏ చానల్స్ ఇస్తే అవి చూడాల్సిందే. ఆపరేటర్ కూడా ఎమ్ ఎస్ వో ఇచ్చిన చానల్స్ చూపించాల్సిందే. వినియోగదారుడు కోరుకున్న విధంగా చానల్స్ ఇచ్చే విధానమేదీ అనలాగ్ వ్యవస్థలో లేదు.అందువలన తనకు ఇష్టం లేకపోయినా, తాను చూడకపోయినా పే చానల్స్ వస్తూ ఉంటే వాటికి చచ్చినట్టు డబ్బు కట్టాలి. ఒక పల్లెటూళ్ళో ఒక రైతు కుటుంబం క్రికెట్ చూడక పోయినా సరే అందరితోబాటు దానికి వాళ్ళూ డబ్బు చెల్లించాల్సిందే.

• అనలాగ్ వ్యవస్థలో ఒక చానల్ ఎంతమంది చూస్తున్నారో తెలుసుకునే అవకాశం ఇప్పటివరకూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానంలో వీల్లేదు. దీనివలన చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అనివార్యంగా పే చానల్స్, ఎమ్ ఎస్ వోలు బేరసారాలతోనే కనెక్షన్ల సంఖ్య మీద ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. తక్కువ సంఖ్య వెల్లడిస్తున్నారని చానల్ యజమానులు వాదించటం చాలా సహజంగా మారిపోయింది. పే చానల్స్ ను పంపిణీ చేసి పే చానల్ యాజమాన్యాలకు చందాదారుల నుంచి డబ్బు వసూలు చేసి ఇచ్చినందుకు ఎలాంటి మార్జిన్ లేకపోవటం మరో లోపం.
• కేబుల్ కనెక్షన్ల సంఖ్య కచ్చితంగా తేలకపోవటం వలన ప్రభుత్వానికి రావాల్సిన సర్వీస్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ లో బాగా లోటు ఏర్పడుతోంది. ధరల విషయంలో ఏకరూపత లేకపోవటం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ధర నిర్ణయమవుతూ ఉంటున్నది.
పైన పేర్కొన్న సమస్యలన్నిటినీ హిట్స్ టెక్నాలజీ పరిష్కరిస్తుంది. అన్ని లోటుపాట్లకూ హిట్స్ సమాధానమిస్తుంది. దీనివలన అన్ని రకాల చట్టపరమైన సమస్యలు తొలగటంతోబాటు వినియోగదారుడు తాను చూడదలచుకున్న చానల్స్ ను తాను ఎంచుకునే అవకాశం కూడా కలుగుతుంది. ధరను బట్టి ఆ చానల్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అంటే అతడి బిల్లు అతడే నిర్ణయించుకోవచ్చు. హోటల్ లో బఫే లో అందరికీ ఒకే ధర ఉన్నట్టు కాకుండా అలా కార్టే పద్ధతిలో తిన్నవాటికే చెల్లించే వెసులుబాటు ఉంటుందన్నమాట.

డిజిటైజేషన్ అమలు పద్ధతులు

డిజిటైజేషన్, వినియోగదారుడికి ఎంచుకునే వెసులుబాటు అమలుచేయటానికి రెండు పద్ధతులున్నాయి:
• ఎమ్ ఎస్ వో లేదా స్వతంత్ర కేబుల్ ఆపరేటర్ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటం. అంటే డిజిటల్ హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) ఏర్పాటు చేసుకోవటం
• ఒక కేంద్రీకృత ప్రదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసుకోవటం
ప్రతి కంట్రోల్ రూమ్ దగ్గర డిజిటైజేషన్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటమంటే పే చానల్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ను డీకోడ్ చేసుకోవటానికి అవసరమయ్యే డీకోడర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది. కేబుల్ ఆపరేటర్లద్వారా ఆ ప్రసారాలు అందించటానికి వీలుగా పే చానల్స్ సిగ్నల్స్ ను రీ-ఎన్ క్రిప్ట్ చేసుకోవాలి. ప్రతి వినియోగదారుడి ఎంపికకు అనుగుణంగా వినియోగదారుడి నిర్వహణా వ్యవస్థ ( SMS) ను నిర్వహించాలి. అందులో చెల్లింపులు, చానల్స్ ఎంపికలో మార్పులు, చేర్పులు తదితర బిల్లింగ్ వ్యవహారాలన్నీ ఉంటాయి.

హిట్స్ బలాబలాలను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) తన చర్చా పత్రంలో వివరించింది. డిజిటైజేషన్ లో దీని ప్రాముఖ్యాన్ని వివరించింది :

దేశమంతటా డిజిటైజేషన్ ఖర్చు : దేశమంతటా కేబుల్ వ్యవస్థను డిజిటైజేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మొత్తం 7 వేల కంట్రోల్ రూమ్స్ ను అనలాగ్ నుంచి డిజిటల్ కు మార్చాలి. SMS తో కలిసి ఒక్కో డిజిటల్ కంట్రోల్ రూమ్ ఖర్చు కోటి నుంచి మూడు కోట్ల వరకు అవుతుంది. అంటే, ఎంత తక్కువలో తక్కువ అంచనావేసినా 7 వేల కంట్రోల్ రూమ్స్ కు ఏడు వేలకోట్లు ఖర్చవుతుంది.

హిట్స్ ద్వారా డిజిటైజేషన్ : హిట్స్ ఆపరేటర్ నిర్మించుకునే ఎర్త్ స్టేషన్ కు సమారు 15 కోట్లు ఖర్చవుతుంది. కేబుల్ ఆపరేటర్ల కు అవసరమయ్యే ట్రాన్స్ మాడ్యులేటర్ల మొత్తం ఖర్చు సుమారు 1200కోట్లు ( దేశ వ్యాప్తంగా ఉన్న 60 వేల మంది ఆపరేటర్లకు రెండు లక్షల రూపాయల వంతున ). ఆ విధంగా మొత్తం మూలధన వ్యయం 1215 కోట్లు మాత్రమే. హిట్స్ కోసం పది ట్రాన్స్ పాండర్లను అద్దెకు తీసుకోవటానికి ఏడాదికి 50 కోట్లు ( ఒక్కో ట్రాన్స్ పాండర్ కు సంవత్సరనికి ఐదు కోట్ల చొప్పున ). అందువలన టెరస్ట్రియల్ డిజిటైజేషన్ కి అయ్యే 15 వేల కోట్లతో పోల్చుకుంటే హిట్స్ లో అయ్యే 1215 కోట్లు, ఏటా 50 కోట్లు అనేది చాలా తక్కువ ఖర్చు. సెట్ టాప్ బాక్సులు ఎలాగూ రెండు పద్ధతులలోనూ తప్పనిసరి. అదే విధంగా ఆపరేటర్ తన కేబుల్స్ మార్చుకోవటం కూడా రెండు పద్ధతులలోనూ తప్పదు.

చందాదారులకు లాభం : చందాదారులకు…అంటే, వినియోగదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే డిజిటల్ ప్రసారాలు, వాల్యూ యాడెడ్ సర్వీసులు దేశమంతటా ఏకకాలంలో అందుతాయి. హిట్స్ ఆపరేటర్ విస్తృతి ఎక్కువకాబట్టి వినియోగదారుడు ఒకచోటునుంచి మరో చోటుకు మారినా అదే సెట్ టాప్ బాక్స్ వాడుకోవచ్చు. అక్కడి ఆపరేటర్ కూడా హిట్స్ కు అనుసంధానమై ఉంటే అదే బాక్స్ వాడుకోవచ్చు. హిట్స్ లో పంపిణీ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి చందా రేట్లలో తగ్గుదలకూ అది దారి తీయవచ్చు.

కేబుల్ ఆపరేటర్లకు ప్రయోజనం
: దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల డిజిటల్ నాణ్యతతో ప్రసారాలు అందుతాయి. దాంతో డిటిహెచ్ లాంటి పోటీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తో గట్టిగా పోటీపడే వీలుంది. విడిగా డిజిటైజేషన్ చేస్తే సొంతగా SMS కోసం ఖర్చు చేయాలి. కానీ, హిట్స్ లో అయితే సొంతగా అవసరం ఉండదు. సాంకేతిక అభివృద్ధి జరిగే కొద్దీ మరిన్ని చానల్స్ పెంచుకోవటానికి అదనపు ఖర్చు లేకుండా హిట్స్ లో ఏర్పాటుంది. చందాదారుల సంఖ్య విషయంలో ఆపరేటర్లకూ, ఎమ్ ఎస్ వో లకూ మధ్య వివాదాలూ తావుండదు.

ప్రభుత్వానికీ ప్రయోజనమే: హిట్స్ ద్వారా డిజిటైజేషన్ చేయటం వల్ల కనెక్షన్ల సంఖ్య తగ్గించి చెప్పే బెడద ఉండదు. ఆ విధంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఎంతమాత్రమూ తగ్గే అవకాశమే లేదు. ఎగవేతకు తావుండదు. ప్రభుత్వం పర్యవేక్షించటం, క్రమబద్ధం చేయటం సులభమవుతుంది. ఈ రంగంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఏర్పడుతుంది. అదే వేరు వేరుగా డిజిటైజేషన్ అమలు చేస్తే వేలాది మంది ఎమ్మెస్వోల నుంచీ సమాచారం సేకరించటం కొంత ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది.

మొత్తంగా చూస్తే హిట్స్ అనేది చౌకగా డిజిటైజేషన్ పూర్తిచేయటానికి పనికొచ్చే మార్గం. చిన్న ఎమ్ ఎస్ వో లకూ, పెద్ద ఆపరేటర్లూ ఒక అనువైన అవకాశం. తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతోబాటు సొంతగా నడుపుకునే స్థానిక చానల్స్ కూడా హిట్స్ ద్వారా పంపిణీ చేసుకునే అవకాశం ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. డిజిటైజేషన్ ప్రక్రయలో హిట్స్ లాంటి ప్రత్యామ్నాయ మార్గం లేకపోతే కేబుల్ పరిశ్రమ చాలా ఇబ్బంది పడేది. మరీ ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ లో హిట్స్ మరింత కీలకంగా మారబోతున్నది.

జైన్ Vs హిందుజా

దేశవ్యాప్తంగా హిట్స్ ద్వారా సేవలందించటానికి రెండే సంస్థలు అనుమతి పొందాయి. మొదట లైసెన్స్ తీసుకున్నది జైన్ గ్రూప్ వారి నోయిడా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ లిమిటెడ్ – ఎన్ఎస్ టిపిఎల్. జైన్ హిట్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం కూడా కొనసాగిస్తూ ఇప్పటికే చాలాచోట్ల తమ వ్యవస్థ విస్తరించే పనిలో ఉన్నారు. మరో వైపు హిందుజా సంస్థకూడా పోటీగా లైసెన్స్ తీసుకొని రంగంలో దిగింది. గతంలో సన్ గ్రూప్ సీఈవో గా పనిచేసిన టోనీ డి సిల్వా ఇప్పుడు ఈ ఇండస్ ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ కు సీఈవో గా వ్యవహరిస్తున్నారు. ఆలస్యంగా మొదలైనప్పటికీ అనుమతులు పూర్తిచేసుకున్న హిందుజా సంస్థ లక్ష్యం గ్రామీణ ప్రాంతాలు కావటం, డిజిటైజేషన్ గడువు పొడిగించటం బాగా కలిసి వచ్చింది. అటు జైన్ హిట్స్ రకరకాల ప్యాకేజీలతో చిన్న ఎమ్ ఎస్ వో లను ఆకట్టుకుంటూ రకరకాల రాయితీలతో మరింత దూకుడుతో మార్కెటింగ్ సాగిస్తోంది. మొత్తానికి ఈ రెండు సంస్థలూ కలిసి గణనీయమైన మార్కెట్ ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.