• Home »
  • Top Stories »
  • జర్నలిస్టుల పిఐబి అక్రెడిటేషన్లకూ హోంశాఖ క్లియరెన్స్

జర్నలిస్టుల పిఐబి అక్రెడిటేషన్లకూ హోంశాఖ క్లియరెన్స్

శాటిలైట్ చానల్స్ కూ, డిజిటల్ ఎమ్మెస్వోల లైసెన్సులకూ ఎఫ్ ఎం రేడియోల యజమానులకూ హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరి కాగా, ఇక మీదట జర్నలిస్టులకూ ఏటా ఇలాంటి క్లియరెన్స్ తప్పనిసరి చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అక్రెడిటేషన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకునే జర్నలిస్టుల గురించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తరువాతనే వారికి అక్రెడిటేషన్ మంజూరయ్యేలా చూడాలని హోం శాఖ చెబుతోంది.

ఇటీవల కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో డాక్యుమెంట్లు మాయం కావటం లాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలొ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా జర్నలిస్టులు కానివాళ్ళని ఏరివేయటానికే ఈ చర్య అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, హోం శాఖ క్లియరెన్స్ అనేది ఇప్పటివరకూ దేశ శాంతిభద్రతలకు, ఆర్థిక భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందనుకున్నవాళ్ళకు మాత్రమే వర్తింపజేస్తూ వచ్చారు.

ఇలా ఉండగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సహా అనేక మీడియా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కేవలం తన దారిలోకి రాని జర్నలిస్టులను పక్కనబెట్టటానికే ఇలా వ్యవహరిస్తున్నదంటూ ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీ పోలీసులు కూడా ప్రత్యేకమైన పాస్ లు ఇవ్వటం ద్వారా మీడియా ప్రతినిధుల సంఖ్యను పరిమితం చేయాలని భావిస్తుండగా, కేంద్రం ఇప్పుడు ఈ తాజా ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.