మారన్ లేఖ మీద హోంశాఖ మౌనముద్ర

SUN HOME MINISTRY

సన్ నెట్ వర్క్ లోని 33 చానల్స్ లైసెన్సుల రెన్యూవల్ వ్యవహారంలో చిక్కుముడి ఇంకా  కొనసాగుతోంది. హోం మంత్రిత్వశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటంతో ఆ 33 చానల్స్  భవితవ్యం మీద పరిశ్రమవర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ దశలో మారన్  హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖరాస్తూ, స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కరించాలని  కోరారు.

అయితే, శాఖాపరంగా ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చినందున కొత్తగా చెప్పాల్సిందేమీ  లేదని,  జవాబివ్వబోవటం లేదని రాజ నాథ సింగ్ తెగేసి చెప్పినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ సన్ టీవీ ఈ విషయంలో కోర్టుకెళ్ళే పక్షంలో కోర్టుకే సమాధానం చెప్పాలని రాజనాథ్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఎందుకు నిరాకరించిందీ సమాచార, ప్రసారాల మత్రిత్వశాఖకు ఇప్పటికే తెలియజేశామన్నది మంత్రివాదన.

నిజానికి మారన్ తన లేఖలో 17 సంస్థల పేర్లు కూడా పేర్కొన్నారని, వాళ్ళకు వర్తింపజేయని నిబంధనలు తమకు మాత్రమే వర్తింపజేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అందులో కలైంజ్ఞర్ మా, సాక్షి చానల్స్ పేర్లను కూడా ప్రస్తావించారని, తమకు మాత్రమే వర్తింపజేయటమేమిటని ఆవేదన వెళ్ళగక్కారని తెలుస్తోంది.

ఇలా ఉండగా, అంతకుముందు డిజిటల్ ఎమ్మెస్వోగా సన్ గ్రూప్ వారి కల్ కేబుల్స్ కి ఇచ్చిన తాత్కాలిక లైసెన్సును కూడా ఇదే కారణాలతో రద్దు చేయగా మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అయితే, వెంటనే ప్రభుత్వం ఈ తీర్పు మీద అక్కడే అప్పీలు చేసింది. సింగిల్ జడ్జ్ తీర్పును సవాలు చేసింది. మరోవైపు ఎఫ్ ఎం రేడియోల విషయంలోనూ సన్ గ్రూప్ ఇదే సమస్య ఎదుర్కుంటోంది.