• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ లో ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో సొంత కేబుల్ చానల్స్ కలుపుకోవటం ఎలా?

డిజిటైజేషన్ లో ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో సొంత కేబుల్ చానల్స్ కలుపుకోవటం ఎలా?

డిజిటైజేషన్ లో  చందాదారుడు ఎదుర్కునే ప్రధాన సమస్య అదనపు భారం మోయాల్సి రావటం. సుమారు రూ.1500 వెచ్చించి సెట్ టాప్ బాక్స్ కొనుక్కోవటమన్నది ఒకటైతే ఇకమీదట  దాదాపుగా రెట్టింపు నెలసరి చందా చెల్లించాల్సి రావటం మరో భారం. అయితే, చందాదారుడిది ఒకరకంగా వ్యక్తిగత సమస్య. కనెక్షన్ల లెక్క కచ్చితంగా తేలితే పన్ను వసూలు సక్రమంగా జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం వాస్తవానికి పే చానల్స్ కు అందరికంటే ఎక్కువ మేలు చేసిపెట్టటానికే డిజిటైజేషన్ మీద ఆసక్తి చూపిందన్న విమర్శలూ లేకపోలేదు. ఆ తరువాత లబ్ధిదారులు కార్పొరేట్ ఎమ్మెస్వోలు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో నష్టపోయేది చందాదారులు, కేబుల్ ఆపరేటర్ మాత్రమే.

చందారుడి కంటే ఆపరేటర్ కి మరింత సమస్య అనుకోవటానికి కారణం ఇది అతడి జీవన సమస్య. తన నెట్ వర్క్ మీద తన యాజమాన్యం పోయి ఒక పెద్ద ఎమ్మెస్వో ఆధిపత్యం పెరుగుతుందనే భయం ఒకవైపు వెంటాడుతూ ఉంటే ఒక్కో కనెక్షన్ కు వచ్చే సగటు ఆదాయం పడిపోతుందని మరీ వైపు ఆందోళన చెందుతున్నాడు. స్థానికంగా తాను నడుపుకుంటూ వచ్చిన కేబుల్ చానల్ పరిస్థితి ఇకముందు ఎలా ఉంటుందో తెలియని అయోమయం మరింతగా కంగారు పెడుతోంది. తన అస్తిత్వాన్ని చాటుకోవటానికి సహాయపడుతూ ఉన్న ఈ లోకల్ కేబుల్ చానల్ వ్యవస్థ డిజిటైజేషన్ లో ఏ రూపు తీసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి. కోట్ల రూపాయల్ పెట్టుబడి పెట్టలేనంత మాత్రాన ఉన్న ఆదాయపు వనరును సైతం కోల్పోవటం తన పరిస్థితిని మరింత దిగజారుస్తుందనే భయం మరింత నిస్పృహలోకి నెట్టేస్తున్నది.్

టీవీ చానల్స్ ప్రేక్షకాదరణను నిశితంగా గమనిస్తే తెలుగునేలమీద ఎక్కువమంది చూస్తున్నది మా టీవీ అనో, జీ తెలుగు అనో అనుకుంటే మనం పొరపాటుపడ్డట్టే. ఎక్కువమంది చూసేది స్థానిక ఆపరేటర్/ఎమ్మెస్వో నడిపే కేబుల్ చానల్ నే. స్థానిక వార్తలు, విశేషాలు ప్రధానంగా అందిస్తూ, కార్యక్రమాలలో కూడా స్థానికులకు అవకాశం కల్పించే వెసులుబాటు ఉండటం వీటి ప్రత్యేకత. అందుకే స్థానిక కేబుల్ ఆపరేటర్/ఎమ్మెస్వో కు స్థానికంగా ఎప్పుడూ మంచి పలుకుబడి ఉంటుంది. చాలామంది చందాదారులు డిటిహెచ్ వైపు మొగ్గుచూపకపోవటానికి కారణం లోకల్ చానల్స్ అందులో అందుబాటులో  ఉండకపోవటమే కారణమంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  ఈ నేపథ్యంలో డిజిటైజేషన్ క్రమంలో స్థానిక చానల్స్ పరిస్థితి ఎలా ఉండబోతున్నది, నిబంధనలు ఏం చెబుతున్నాయి, సాంకేతిక సాధ్యాసాధ్యాలేమిటి అనే విషయాన్ని ఈ వ్యాసంలో చర్చిద్దాం

ప్రస్తుత పరిస్థితి

ఇప్పుడున్న చట్టాల ప్రకారం కేబుల్ చానల్స్ నడుపుకోవటం మీద ఎలాంటి ఆంక్షలూ లేవు. అందుకే కొంతమంది నాలుగైదు చానల్స్ కూడా నడుపుకుంటున్నారు. శాటిలైట్ చానల్ నెట్ వర్క్స్ లాగానే మెయిన్ చానల్ తోబాటు మ్యూజిక్, మూవీస్, న్యూస్ చానల్స్ నడుపుతున్నవాళ్ళున్నారు. అంతటితో ఆగలేదు. పంపిణీతో సంబంధం లేకుందా ఎవరైనా చానల్ నడుపుకోదలచుకుంటే వీళ్ళే పంపిణీ చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్  నడిపే కేబుల్ చానల్స్ కు ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు. అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా నైనా కేబుల్ చానల్ ను ఎలాంటి అనుమతులూ లేకుండా నడుపుకోవచ్చు. కాకపోతే ఆ చానల్ ను పంపిణీ చేయటానికి ఆపరేటర్/ఎమ్మెస్వో ఒప్పుకోవాలి. ఎవరైనా సొంత చానల్ పెట్టుకుని దాన్ని ఇంటుఇంటికీ పంపిణీ చేయాల్సిందిగా ఎమ్మెస్వో/ఆపరేటర్ ను బలవంతంగా ఒప్పించటానికి వీల్లేద

కారణమేంటంటే, అలా ప్రసారమయ్యే అంశాలన్నిటికీ ఆ ఎమ్మెస్వో/ఆపరేటర్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ తీసుకోదలచుకొలేదు కాబట్టి ఇవ్వలేనని చెప్పవచ్చు.  అందువలన ప్రస్తుతం ఎమ్మెస్వో /ఆపరేటర్ స్థానిక చానల్స్ విషయంలో తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించుకునే వీలుంది. నిజానికి ఇతరులు ఎవరైనా స్థానిక చానల్ పెట్టి, ఆపరేటర్/ఎమ్మెస్వో ద్వారా పంపిణీ చేస్తే దానివలన తన సొంత చానల్స్ కు వచ్చే ఆదాయం దెబ్బతింటుంది కాబట్టి ఇవ్వటానికి ఒప్పుకోరు. అయితే, కారేజ్ ఫీజు వసూలు చేసుకోవటం ద్వారానో, ప్రకటనల ఆదాయం పంచుకునే షరతులమీదనో ఇచ్చే అవకాశాలున్నాయి. ఆచరణలో ఇలాంటి చానల్స్ చూస్తూనే ఉన్నాం.

కేబుల్ చానల్ కు ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోనవసరం లేదన్న నియమం అనలాగ్ తో బాటు డిజిటల్ కేబుల్ నెట్ వర్క్స్ కు కూడా వర్తిస్తుంది.

భవిష్యత్తులో ఎలా ఉంటుంది ?

స్థానిక కేబుల్ చానల్స్ అనేక సందర్భాలలో పైరసీకి పాల్పడటం ప్రభుత్వచర్యలకు లోను కావటం తెలిసిందే. శాటిలైట్ చానల్ యజమానులు కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాల ప్రసార హక్కులు కొనుక్కుంటూ ఉంటే కేబుల్ చానల్స్ వారు మార్కెట్లో డివిడి కొని తెచ్చి తమ చానల్స్ లో ప్రసారం చేయటం ద్వారా పెద్దమొత్తంలో శాటిలైట్ చానల్స్ కు నష్టాలు వచ్చేట్టు చేస్తున్నారన్నది ప్రధానంగా ఉన్న విమర్శ. నిజానికి అలా చూస్తే కేబుల్ చానల్స్ ప్రసారం చేసే అంశాల్లో సగానికి పైగా పైరసీ కిందికే వస్తుంది.్

ఇదే విషయం మీద బ్రాడ్ కాస్టర్లతోబాటు డిటిహెచ్ ఆపరేటర్లు కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాలలో ఫిర్యాదుచేశారు. కొత్త సినిమాలు ప్రసారం చేసినప్పుడు ఆ సినిమాల హక్కులు కొనుక్కున్న శాటిలైట్ చానల్ యజమానులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులివ్వటం,దుకు ప్రతీకారంగా ఎమ్మెస్వోలు తమ నెట్ వర్క్ లో ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయటం, మళ్ళీ రాజీ కుదరటం చాలా కాలంగా  చూస్తున్న వ్యవహారమే

అయితే, ఈ విషయంలో ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలన్నది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లక్ష్యం. అందుకే ఒక చర్చా పత్రాన్ని విడుదలచేసి అభిప్రాయాలు సేకరించింది.వాటి ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఒక ఎమ్మెస్వో ఇచ్చే గరిష్ఠ చానల్స్ సంఖ్య మీద పరిమితి విధించటం, ప్రతి కేబుల్ చానల్ కూ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన విధించటం లాంటి ఎన్నో సిఫార్సులు అందులో ఉన్నాయి. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తుది ఆమోదం పొంది మార్గదర్శకాలు జారీకావాల్సి ఉంది.్

డిజిటైజేషన్ లో పరిమితులేమిటి ?

డిజిటైజేషన్ లో కూడా స్థానిక కేబుల్ చానల్స్ మీద ఎలాంటి నిబంధనలూ లేవు. కాకపోతే ఆ చానల్స్ లో ప్రసారమయ్యే అంశాలు ప్రోగ్రామింగ్ నియమావళిని ఉల్లంఘించకూడదు. అల ఉల్లంఘించనంతకాలం స్థానిక కేబుల్ చానల్స్ ప్రసారానికి ఎలాంటి చట్టపరమైన అవరోధాలూ లేవు. ఏ అధికారి నుంచి గాని అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. ఆపరేటర్ కానివాళ్ళు చానల్ నడుపుకున్నా ఇబ్బందేమీ లేదు. వాళ్ళకూ అనుమతులు అవసరం లేదు. కొంతమంది ఈ విషయంలో స్పష్టత లేక పోవటంతో ఆపరేటర్ కాకపోయినా, కేబుల్ చానల్ నడపటానికి పోస్టల్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు

అయితే ప్రసారాంశాలపరంగా గాని, చానల్స్ సంఖ్య పరంగా గాని నియంత్రణ, బాధ్యత పెంచటానికి డిజిటైజేషన్ నియమాలలో కేబుల్ చానల్స్ ప్రస్తావన వచ్చింది. డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి మాత్రమే అన్ని చానల్స్ వెళ్లాలన్న నిబంధన ఉంది. అంటే, స్థానిక కేబుల్ చానల్స్ సహా అన్ని చానల్స్ తప్పనిసరిగా ఎన్ క్రిప్ట్ అయి మాత్రమే డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి పంపిణీ కావాల్సి ఉంటుంది.  దీనివలన స్థానిక కేబుల్ చానల్స్ మీద ఎమ్మెస్వో ప్రత్యక్ష నియంత్రణ పెరుగుతుంది. అంటే, డిజిటల్ హెడ్ ఎండ్ నడిపే ఎమ్మెస్వో మద్దతులేకుండా స్థానిక కేబుల్ ఆపరేటర్ లేదా ఫీడ్ మీద ఆధారపడే చిన్న ఎమ్మెస్వో తన సొంత చానల్ ను చొప్పించటం కుదరదు

సాంకేతిక పరిష్కారాలు్

అయితే, డిజిటైజేషన్ లో స్థానిక చానల్స్ ను జోడించటానికి సాంకేతికంగా ఉన్న మార్గాలేమిటో చూద్దాం. అదే సమయంలో చట్టపరంగా ఉన్న అవరోధాలనూ, అధిగమించగలిగే మార్గాలనూ పరిశీలిద్దాం. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ మీద స్థానిక కేబుల్ చానల్స్ కలపటానికి మూడు రకాల అవకాశాలున్నాయి

  1. హెడ్ ఎండ్ దగ్గర కలపటం

డిజిటల్ ఎమ్మెస్వో గా లైసెన్స్ పొందిన ఎమ్మెస్వో తన దగ్గర ఏర్పాటు చేసుకునే డిజిటల్ హెడ్ ఎండ్ లేదా కంట్రోల్ రూమ్ లో కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఉంటుంది. అక్కడే అన్ని శాటిలైట్ చానల్స్ ఎన్ కోడ్ అవుతాయి. అందుకే స్థానిక కేబుల్ చానల్స్ కూడా అక్కడే జోడించటం చాలా సులభమవుతుంది. ఈ పద్ధతి అనుసరించటానికి కేబుల్ ఆపరేటర్ లేదా ఫీడ్ తీసుకునే చిన్న ఎమ్మెస్వో తన ప్రదేశం నుంచి ఈ డిజిటల్ హెడ్ ఎండ్ దాకా రిటర్న్ పాత్ లో ఆప్టికల్ ఫైబర్ ద్వారా చానల్ ని చేరవేయాల్సి ఉంటుంది. అయితే, ఒకటికంటే ఎక్కువ చానల్స్ కూడా పంపవచ్చునా అని కొంతమందికి అనుమానం రావచ్చు. సులభంగా అందుబాటులోకి వచ్చే వేవ్ లెంగ్త్ డివిజన్ మల్టిప్లెక్సింగ్ (డబ్ల్యు డి ఎమ్) టెక్నాలజీ వాడుకొని ఎక్కువ చానల్స్ పంపుకోవటానికి అవకాశం ఉంది. అదే ఆప్టిక్ ఫైబర్ మీద వేరే వేవ్ లెంగ్త్ లో రిటర్న్ పాత్ కు ఈ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. డబ్ల్యు డి ఎమ్ ఆప్టికల్ సిగ్నల్ ను ఎమ్మెస్వో అందుకొని ఆడియో వీడియో బేస్ బాండ్ సిగ్నల్స్ గా మార్చి అన్ని శాటిలైట్ చానల్స్ తరహాలోనే దీన్ని కూడా డిజిటల్ పరంగా ఎన్ కోడ్ చేస్తారు.

ఒకవేళ ఆపరేటర్ నుంచి ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ దాకా అదనంగా ఆప్టికల్ ఫైబర్ అందుబాటులో ఉంటే దాన్ని సంప్రదాయ ఆప్టికల్ ట్రాన్స్ మిటర్ ద్వారా వాడుకుంటూ ఆపరేటర్ నుంచి ప్రసారాలను పంపవచ్చు. ఆపరేటర్ నుంచి చానల్ వచ్చాక దాన్ని డిజిటల్ గా ఎన్ కోడ్ చేసి, మిగిలిన శాటిలైట్ చానల్స్ తో కలిపి మల్టిప్లెక్స్ చేస్తారు.

కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఎన్ క్రిప్షన్ ను అన్నిచానల్స్ మీద  సూపర్ ఇంపోజ్ చేస్తారు. ఈ కేబుల్ చానల్ సహా అన్ని చానల్స్ కూ ఒక్కో ప్రత్యేకమైన నెంబర్ నూ గుర్తింపు నూ కేటాయిస్తారు. దానివలన డిజిటల్ సెట్ టాప్ బాక్స్ ఒక్కో చానల్ నూ విడివిడిగా గుర్తించగలుగుతుంది.  అందుకే, స్థానిక కేబుల్ చానల్ ను కూడా అన్ని చానల్స్ తో కలిపి ప్రసారం చేయాలంటే డిజిటల్ హెడ్ ఎండ్ ఉన్న ఎమ్మెస్వో సహకారం తప్పనిసరి.

  1. స్థానికంగా కాస్ అమర్చుకోవటం

స్థానిక కేబుల్ చానల్స్ ను ప్రసారం చేసుకోవటానికి ఇది రెండో మార్గం. ఇందులో ఎమ్మెస్వో తన కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ) సిగ్నల్ ను తన హెడ్ ఎండ్ నుంచి ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో ఆవరణ వరకూ పంపాలి. అక్కడ ECM, EMM సిగ్నల్స్ రూపంలో అందుకొని స్థానిక ఎన్ క్రిప్షన్ వ్యవస్థ సాయంతో కేబుల్ చానల్ ను ఎమ్మెస్వో తన హెడ్ ఎండ్ లో వాడే కాస్ లాగానే ఎన్ క్రిప్ట్ చేయవచ్చు.

పైగా, ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో ఇచ్చే ప్రతి కేబుల్ చానల్ కూ ఎమ్మెస్వో హెడ్ ఎండ్ ఒక డిజిటల్ నెంబర్ ను కేటాయిస్తుంది. అందువలన కేబుల్ ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో ప్రతి ఒక్క చానల్ కూ ఒక్కొక్కటి చొప్పున డిజిటల్ ఎన్ కోడర్ కొనుక్కొని తన ఆవరణలో ఏర్పాటుచేసుకోవాలి. డిజిటల్ రూపంలోకి మార్చిన సిగ్నల్స్ ను ప్రధాన డిజిటల్ ఫీడ్ తో కలిపి మల్టీప్లెక్స్ చేసి కేబుల్ ఆపరేటర్ నెట్ వర్క్ మీద రీ ట్రాన్స్ మిట్ చేయాలి. ఈవిధానంలో ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వోమీద భారం చాలా ఎక్కువ పడుతుంది. ఎన్ కోడర్ తో బాటు లోకల్ ఎన్ క్రిప్షన్ కూడా కొనుక్కొఆలి, ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఒకే చోటు నుంచి ఆపరేటర్ లేదా చిన్న ఎమ్మెస్వో 8 నుంచి16 చానల్స్ దాకా కలపాలనుకున్నప్పుడు మాత్రమే ఈ పద్ధతి గిట్టుబాటవుతుంది.

  1. ఎన్ క్రిప్ట్ చేయకుండా ఇవ్వటం

ఎన్ క్రిప్ట్ చేయకుండా చానల్స్ ను జోడించటమనేది మూడో పద్ధతి. సాంకేతికంగా ఇది సులభమే అయినా, చట్టప్రకారం ఇది చెల్లదు. కేబుల్ ద్వారా అందించే చానల్స్ అన్నీ కచ్చితంగా ఎన్ క్రిప్ట్ అయి ఉండాల్సిందేనని డిజిటైజేషన్ చట్టం చెబుతోంది. చాలామంది ఎమ్మెస్వోలు ఫీడ్ ఇస్తామని చెబుతూ కేబుల్ చానల్స్ విషయాన్ని స్పష్టంగ వివరించటం లేదు. స్థానికంగా చానల్స్ జోడించటం సులభమే కాబట్టి ఆపరేటర్లు/చిన్న ఎమ్మెస్వోలు ఈ విషయం అంతగా పట్టించుకోవటం లేదు. తరువాత ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటే అది ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో కు ఇబ్బంది అవుతుందే తప్ప డిజిటల్ హెడ్ ఎండ్ ఉండే ఎమ్మెస్వోకు ఏమీ కాదు. ఉల్లంఘన జరిగింది ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో పాయింట్ దగ్గర కాబట్టి బాధ్యత కూడా ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వోదే అవుతుంది.  ఒకవేళ ఎన్ క్రిప్ట్ చేయకపోయినా, ఎమ్మెస్వో హెడ్ ఎండ్ దగ్గర లెక్కలోకి తీసుకోకపోతే దాన్ని చందాదారుడి దగ్గర ఉండే సెట్ టాప్ బాక్స్ గుర్తించదు.

సాంకేతిక పరిష్కారమార్గం : ఎన్ క్రిప్ట్ చేయని చానల్ జోడింపు

డిజిటల్ హెడ్ ఎండ్ నడిపే ఎమ్మెస్వో తన పరిధిలో ఉన్న స్థానిక కేబుల్ ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో కోసం మొత్తం ఒక ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ ని పక్కనబెడతాడు. ఈ ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ లో 4, 8 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా చానల్స్ పంపుకోవచ్చు. ఎమ్మెస్వో ఈ ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ లో పంపే చానల్స్ కు ఒక్కొక్కదానికీ విడివిడిగా ఐడి, ఫ్రీక్వెన్సీ, QAM, చానల్ పేరు కేటాయిస్తాడు. కాకపోతే ఈ చానల్స్ ఏవీ ఎమ్మెస్వో హెడ్ ఎండ్ దగ్గర ఉండవు. అందువలన హెడ్ ఎండ్ నుంచి సిగ్నల్ బయలుదేరినప్పుడు అక్కడ మాత్రం ఖాళీగా (బ్లాంక్ గా) కనిపిస్తాయి.

కేబుల్ ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో  ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి:

ఒక్కో స్థానిక డిజిటల్ చానల్ కోసం ఒక్కో ఎన్ కోడర్ ( ఎంపెగ్-2 లేదా ఎంపెగ్-4 )

64 లేదా 250 QAM  తో పనిచేయగలిగే QAM మాడ్యులేటర్

QAM మాడ్యులేటర్ ఎంచుకోవటం ఎలా ?

64 QAM మాడ్యులేషన్ తో 38 ఎంబిపిఎస్ డిజిటల్ డేటా రేట్ సాధ్యమవుతుంది. ఒక ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ ద్వారా 8 నుంచి 10 ఎంపెగ్-2 చానల్స్ వరకూ పంపే అవకాశముంది. అదే ఎంపెగ్-4 లో అయితే 64 QAM మాడ్యులేషన్ వాడుకుంటూ స్టాండర్డ్ డెఫినిషన్ లో 16 చానల్స్ పంపుకోవచ్చు. 256 QAM మాడ్యులేషన్ అయితే, బాగా ఎక్కువగా 51 ఎంబిపిఎస్ డిజిటల్ డేటా ఇవ్వగలదు. ఫలితంగా అది 12 నుంచి 14 ఎంపెగ్-2 చానల్స్ ను, లేదా దాదాపుగా 24 ఎంపెగ్-4 చానల్స్ ను తీసుకెళ్ళగలదు.

అయితే, ఎంపెగ్-4 కి అద్భుతమైన నాణ్యత ఉన్న నెట్ వర్క్ ఉండాలి. ఆపరేతర్/చిన్న ఎమ్మెస్వో నెట్ వర్క్ నాణ్యత అంతంతమాత్రంగా ఉంటే మాత్రం 256QAM మీద ప్రసారం చేసే ఏ చానల్ అయినా బొమ్మ ఆగిపోతూ నాసి రకంగా కనబడుతుంది. అందుకే, మరీ ఎక్కువ సంఖ్యలో లోకల్ కేబుల్ చానల్స్ ఉంటేనో, ఆ చానల్స్ హెచ్ డి లో ఉంటేనో తప్ప 64QAM  వాడటం మంచిది.

నిజానికి అదే QAM మాడ్యులేటర్ ను 64QAM దగ్గర లేదా 256QAM దగ్గర పనిచేసేలా చేయవచ్చు. వాడకందారుడు తనకు తగినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు. అయితే, ఈ సెట్టింగ్ ను సైతం డిజితల్ హెడ్ ఎండ్ దగ్గరే కచ్చితంగా ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది.

మరి ఖర్చుల మాటేంటి ?

కొన్ని కంపెనీలు కేబుల్ ఆపరేటర్/చిన్న ఎమ్మెస్వో కోసం నాలుగు చానల్స్ కి ఎంపెగ్-2 /ఎంపెగ్-4  ఎమ్ కోడర్ + 1QAM మాడ్యులేటర్ ను కలిపి రూ. లక్షా 25 వేలు+ పన్నులు చొప్పున ఇస్తున్నాయి. ఈ మాడ్యులేటర్ ని 64QAM లేదా 256QAM కి సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా, 8 కేబుల్ చానల్స్ కోసం 8 డిజిటల్ ఎన్ కోడర్ల పాకేజ్ అదే QAM మాడ్యులేటర్ తో సుమారు లక్షా ఎనభై వేల రూపాయలవుతుంది.

హెచ్చరిక

పైన చెప్పిన పరిష్కార మార్గం అనేది సాంకేతికంగా సాధ్యమని చెప్పటానికి ఉద్దేశించినది మాత్రమే.

ఇది ఎలాంటి ఎన్ కోడింగ్ గాని, కేబుల్ చానల్ కి కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ని గాని ఇవ్వదు. వాటికి డిజిటల్ హెడ్ ఎండ్ దగ్గర డిజిటల్ చానల్ ఐడి ముందుగానే కేటాయించి ఉండటం వలన కేబుల్ ఆపరేటర్ పరిధిలో ఉండే సెట్ టాప్ బాక్సులు వాటిని అందుకోగలుగుతాయి. అదే డిజిటల్ ఎమ్మెస్వో పరిధిలో ఉన్న మరే ఇతర ఆపరేటర్ నెట్ వర్క్ లోనూ అవి రావు. ఇవి ఉచిత చానల్స్ అయినప్పటికీ అన్ని చానల్స్ తప్పనిసరిగా ఎన్ క్రిప్ట్ అయి ఉండాలన్న నిబంధనకు లోబడటం లేదు కాబట్టి వీటి మీద చర్య తీసుకునే అవకాశముంది. ఉచిత చానల్స్ అయినాసరే ఎన్ క్రిప్ట్ కావాల్సిందేనని డిజిటైజేషన్ నిబంధనలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ?

డిజిటల్ హెడ్ ఎండ్స్ నడిపేవాళ్ళు సాధారణంగా ఈ సమస్యను ప్రస్తావించరు. ఎందుకంటే, ఇది వాళ్ళకు ఏ విధంగానూ సమస్య కాదు గాబట్టి. ఈ సమస్య కేవలం ఫీడ్ తీసుకునే చిన్న ఎమ్మెస్వోలకే. మామూలుగా సొంత చానల్స్ సాధ్యమేనంటూ ఎన్ క్రిప్ట్ చేయకుండా కలుపుకునే మార్గాన్నే సూచిస్తారు. కానీ ఇది చట్ట విరుద్ధం. తాత్కాలికంగా అలా చేయాలని ప్రయత్నిస్తే ఆ తరువాత చిక్కుల్లో పడతారు. ప్రభుత్వం అలాంటి చానల్స్ తొలగిస్తే లాభపడేది ఎమ్మెస్వో మాత్రమే. ఎలాగూ స్థానికంగా తన కేబుల్ చానల్స్ నే అక్కడి చిన్న ఎమ్మెస్వో కూదా ప్రసారం చేస్తాడు కాబట్టి అదనపు ప్రకటనల ఆదాయం రావచ్చు. లేదంటే, చిన్న ఎమ్మెస్వో తన చానల్ ను డిజితల్ హెడ్ ఎండ్ కి పంపి అక్కడి నుంచి తిరిగి తనకు అందేలా చూసుకోవాలి. ఇప్పటికే ఫీడ్ తెచ్చుకోవటం ఒక భారమైతే, ఇది అదనపు భారమవుతుంది.

హిట్స్ లో సాధ్యమే : శ్రీకుమార్

అయితే, హెడ్ ఎండ్ ఇన్ ద్ స్కై ( హిట్స్ ) ప్లాట్ ఫామ్ లో ఇది సాధ్యమేనని హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ తెలంగాణ, రాయలసీమ హెడ్ శ్రీకుమార్ అంటున్నారు. తాము ఇచ్చే సొల్యూషన్ ను డిజిటల్ హెడ్ ఎండ్ గానే పరిగణించవలసి ఉంటుంది కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవంటున్నారు.నిజానికి ఈ సమస్య గురించి ఆలోచించటం మొదలుపెట్టిన తరువాత ఎక్కువమంది ఎమ్మెస్వోలు నెక్స్ట్ డిజిటల్ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులకు ఇంకా గడువు ఉండటం, ఇప్పుడు హోం శాఖ క్లియరెన్స్ కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయటం వల్లా ఎక్కువమంది లైసెన్సులు తీసుకొని స్వతంత్రత కాపాడుకోవటంతోబాటు సొంత చానల్స్ కు ఢోకా లేకుండా చూసుకుంటున్నారని చెప్పారు. అందువల్లనే నెక్స్ట్ డిజిటల్ ఎక్కువమంది ఎమ్మెస్వోల ఆదరణ పొందగలుగుతున్నదన్నారు.