• Home »
  • Cable »
  • బహిరంగ కేబుల్స్ మీద ’ గ్రేటర్ ’ నిర్ణయం ఆచరణ సాధ్యమా?

బహిరంగ కేబుల్స్ మీద ’ గ్రేటర్ ’ నిర్ణయం ఆచరణ సాధ్యమా?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహిరంగంగా వేలాడుతున్న కేబుల్ వైర్లను నెలరోజుల్లోగా తొలగించాలని, వాటిని భూగర్భ కేబుల్స్ గా మార్చుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ అల్టిమేటమ్ ఇవ్వటం కేబుల్ పరిశ్రమలో కలకలం రేపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గాని విద్యుత్ శాఖ నుంచిగాని అనుమతులు లేకుండానే కేబుల్ లాగుతూ అనేక ఇబ్బందులకు కారణమవుతున్నందున కేబుల్ పంపిణీ సంస్థల ప్రతినిధులతో సమావేశమే నగరపాలకసంస్థ వైఖరిని స్పష్టం చేశారు.

అయితే, ఇందులో లోతుగా పరిశీలించాల్సిన అనేక అంశాలను మేయర్ పట్టించుకోకపోవటం వల్లనే ఈ హడావిడి నిర్ణయం తీసుకొని, ఆచరణ సాధ్యం కాని గడువు తేదీ పెట్టారన్నది కేబుల్ పరిశ్రమ అభిప్రాయం. కేబుల్ టీవీ పరిశ్రమకు ప్రభుత్వం నుమ్చి అందుతున్న ఏకైక సాయం రైట్ ఆఫ్ వే. అంటే దారి హక్కు. కేబుల్ వేసుకోవటానికి స్థానిక సంస్థలు, రాష్ట ప్రభుత్వాలు సహాకరించేలా కేంద్రప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలలో ఈ రైట్ ఆఫ్ వే ఉంది. అయితే, ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఉదారంగా అనుమతులు ఇస్తూ కొంత మొత్తాన్ని రుసుముగా వసూలు చేయవచ్చు.

విద్యుత్ శాఖ అధికారులు ఎంత గట్టిగా వసూలు చేస్తున్నారనేది ఒక వివాదాస్పద అంశం. ఒక్కోచోట పట్టించుకోకపోవటం, ఒక్కోచోట స్థానిక రాజకీయనాయకుల ఒత్తిడికి తలొగ్గటం, మరికొన్ని చోట్ల ఇంకో అడుగు ముందుకేసి ఒక రాజకీయనాయకుడి ప్రత్యర్థి కేబుల్ వేసుకోకుండా అడ్డుకుంటూ ఆ రాజకీయ నాయకుడి అడుగులకు మడుగులొత్తటం సర్వసాధారణమైపోయింది. అందువలన రైట్ ఆఫ్ వే అన్నిచోట్లా సక్రమంగా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. నగరాలలో ఒక రేటు, మున్సిపల్ పట్టణాలలో ఒక రేటు, గ్రామీణ ప్రాంతాల్లొ మరో రేటు చొప్పున ఈ పోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంత పోల్ టాక్స్ వసూలు చేశారో చెప్పమంటే రాష్ట్రవ్యాప్తంగా లెక్కలు చూస్తే అయోమయానికి గురి కావాల్సిందే. అంటే విద్యుత్ శాఖ అధికారులు ఒక క్రమ పద్ధతంటూ పాటించటం లేదని అర్థమవుతుంది.

అయితే అలాంటి క్రమపద్ధతి పాటిస్తూ, అనుమతులు మంజూరు చేస్తూ, అనుమతులు లేని కేబుల్స్ తొలగిస్తూ వచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లకు తోడు బ్రాడ్ బాండ్ కేబుల్స్ కూడా తయారవటం, ప్రతి కేబుల్ ఆపరేటర్ వేసే కేబుల్ లో కనీసం 20 శాతం కేబుల్ ను భవిష్యత్ అవసరాలకోసం అదనంగా వేలాడదీయాల్సి రావటం లాంటి అంశాలు ఈ బహిరంగ కేబుల్స్ నగరాన్ని అందవిహీనంగా మార్చటానికి కొంతమేరకు కారణమవుతున్నమాట నిజం. నగరాన్ని అందంగా తీర్చిదిద్దటానికి వీటిని భూగర్భ కేబుల్స్ గా మార్చటానికి పూనుకోవటం అభినందించదగిన విషయమే.

అయితే, అసలు విషయం ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమనేది. ముందుగా ఖర్చు విషయానికొస్తే, బహిరంగ కేబుల్ కూ భూగర్భ కేబుల్ కూ ఖర్చులో భారీ తేడా ఉంది. సగటున కిలోమీటరుకు కోటి రూపాయల దాకా ఖర్చవుతుంది. అందువల్ల ఇది ఎవరికివాళ్ళు భరించగలిగేది కాదు. పైగా అందరూ తవ్వుకుంటూ పోతే రోడ్లు మరింత దెబ్బతింటాయి. ఇందుకు పరిష్కారంగా ఒకే ఉమ్మడి డక్ట్ అందరూ వాడుకునేలా చేయటం, అందుకు గాను చార్జీలు చెల్లించటం ఒక్కటే మార్గం. అంటే నగరంలో అవసరమైన కనీస దూరం 1600 కిలోమీటర్లు డక్ట్ వేసి ఇవ్వటానికి జిహెచ్ ఎంసి సిద్ధంగా ఉండాలి. అప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఆ డక్ట్ ద్వారా కేబుల్స్ లాక్కొని, ఆ సదుపాయానికి నెలవారీ చెల్లించే అవకాశం ఉంటుంది. కనీసం ప్రధాన రహదారులవరకే పరిమితం కావాలనుకున్నా 300 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంటుంది.

గతంలో నేర్చుకున్న పాఠాలు కూడా ఇప్పుడు ప్రస్తావించుకోవటం అవసరం. 2012-13 లో కూడా ఇలాంటి ప్రతిపాదనమీద తీవ్రమైన చర్చ జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్  ఈ పద్ధతి ఆచరణలో పెట్టాలని చూశారు. ప్రయోగాత్మకంగా అసెంబ్లీ నుంచి బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ దాకా వేయాలని చూసినా విఫలమయ్యారు. ఆ నాటి వైఫల్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ లేకుండా నెలరోజుల్లో అంతా పూర్తికావాలనుకోవటానికి మేయర్ గారి దగ్గర మంత్రదండం ఉండాల్సిందే. ఇది ఎలా సాధ్యమని జిహెచ్ ఎంసి ఇంజనీర్లు మేయర్ కు నచ్చజెప్పారో తెలియదు. పైగా ఇన్నాళ్ళూ మాట్లాడకుండా, మొన్నటి వర్షాల బీభత్సంలో కేబుల్స్ పాత్ర కూడా ఉందని ఆలస్యంగా గ్రహించి మేల్కొన్న  అధికారులే ఈ హడావిడి నిర్ణయాన్ని ప్రేరేపించినట్టు స్పష్టంగా కనబడుతోంది. వర్షాకాలంలోనే తవ్వకాలు మొదలుపెట్టి భూగర్భ కేబుల్స్ వేయటమంటే ఉన్న రోడ్లన్నిటినీ ధ్వంసం చేసి నీళ్లలో నింపటమే. పైగా ఈ వాతావరణంలో తవ్వకం బాగా ఆలస్యమయ్యే ప్రమాదముంది.

ఇదే సమయంలో కేబుల్ పరిశ్రమ గ్రహించాల్సిన విషయం కూడా ఉంది. నగరాన్ని అందంగా తీర్చిదిద్దటంలో కేబుల్ ఆపరేటర్లు/ఎమ్మెస్వోలు కూడా భాగమే కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యాన్ని అభినందించాల్సిందే. అయితే,  ఆ లక్ష్య సాధనకు ఎంచుకున్న మార్గం సాఫీగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. అందుకే ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని  కేబుల్ పరిశ్రమ ప్రతినిధి బృందం ఇందులో సాధకబాధకాలు మేయర్ కు వివరించి ఆచరణ సాధ్యమైన విధానాన్ని సూచించాల్సిన అవసరముంది. ఇది శ్రమతో, ఖర్చుతో కూడుకున్నదే అయినా డక్ట్ వేసి పైన మళ్ళీ పూడ్చి అందంగా రోడ్డు వేసే బాధ్యత నగరపాలకసంస్థ తీసుకుంటే నిర్వహణ ఖర్చులు ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు భరించటం సాధ్యం కావచ్చు.