• Home »
  • BARC »
  • గ్రామీణ ప్రాంత రేటింగ్స్ ప్రభావం ఎలా ఉంది?

గ్రామీణ ప్రాంత రేటింగ్స్ ప్రభావం ఎలా ఉంది?

భారతదేశంలో ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ రేటింగ్స్ లెక్కించటం మొదలై దాదాపు ఒకటిన్నర దశాబ్దం  పూర్తయ్యేదాకా గ్రామీణ ప్రేక్షకుల అభిప్రాయాలకు స్థానమే లేకపోయింది. అంటే సగానికి పైగ అజనాభా అభిప్రాయాలు లేకుండానే టీవీ చానల్స్ కార్యక్రమాలకు రేటింగ్స్ ఇస్తూ అవే పూర్తి ప్రజాభిప్రాయంగా  లెక్కగడుతూ వచ్చాం. అయితే, దీనిమీద రకరకాల విమర్శలు రావటంతో ప్రభుత్వం విచారణ జరిపి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా టామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) రావటం, కమిషన్ సూచించిన విధంగా గ్రామీణ ప్రాంత రేటింగ్స్ కూడా లెక్కగట్టటం మొదలైంది.

ప్రతి వందకిలోమీటర్ల దూరానికీ సాంస్కృతిక వైవిధ్యం కనిపించే భారతదేశంలో ప్రజల అభిరుచులు కూడా అంతే వైవిధ్యంతో ఉంటాయి. అయినప్పటికీ భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చునని చమత్కరించేవారు లేకపోలేదు. ఒక విభాగం భారత్ అయితే మరో విభాగం ఇండియా. భారత్ అనేది గ్రామీణ ప్రజలకు చిహ్నమైతే ఇండియా అనేది పట్టణప్రాంత ప్రజలకు గుర్తు. గ్రామీణ ప్రాంతాల్లో పే చానల్స్ ప్రభావం చాలా తక్కువగా ఉండటం కనిపిస్తుంది. డిడి ఫ్రీడిష్  కారణంగా ప్రేక్షకులు చాలామంది తమకు కావాల్సిన చానల్స్ చూడగలుగుతున్నామనే అభిప్రాయంతో ఉన్నారు. ఒకసారి పరికరాలు కొనుక్కుంటే నెలవారీ చందాల అవసరమే లేకుండా వినోదం అందుకోగలగటం అందుకు కారణం.

బార్క్ ఇప్పుడు 22 వేల మీటర్లతో ప్రేక్షకాదరణను కొలుస్తుండగా వాటిలో 70 శాతం పట్టణ ప్రాంతాల్లోను, 30 శాతం గ్రామీణ ప్రాంతంలోను పెట్టింది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజల అభిరుచులు దాదాపు ఒకే రకంగా ఉంటున్నట్టు కూడా తేలింది.

పెద్ద పెద్ద బ్రాడ్ కాస్టర్లందరికీ ఉచిత చానల్స్ తో బాటు పే చానల్స్ ఉండగా ఉచిత చానల్స్ కు ప్రేక్షకాదరణ పెరుగుతుండటం, పే చానల్స్ కు ప్రేక్షకాదరణ తగ్గుతుండటం ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. జీ అన్మోల్, సోనీ పాల్, స్టార్ ఉత్సవ్ పెద్దగా కొత్త కార్యక్రమాలేవీ తయారుచేయకుండా వాటి గ్రూప్ లోని పే చానల్స్ లో ప్రసారమైన పాత కార్యక్రమాలను పునఃప్రసారం చేసిన ఎక్కువ ఆదరణ పొందటం అందుకు ఉదాహరణ. కలర్స్ , స్టార్ ప్లస్ కంటే మించిపోయే స్థాయికి ఎదగటం అందరినీ ఆశ్చర్యపరచింది. బార్క్ గ్రామీణ ప్రాంతాల రేటింగ్స్ ఇవ్వటం మొదలుపెట్టగానే ఈ రకమైన మార్పు కనబడటంతో చానల్స్ అన్నీ పునరాలోచనలో పడ్దాయి.

ఇలా రెండు రకాల రేటింగ్స్ విడివిడిగా ఇవ్వటం వలన బ్రాడ్ కాస్టర్లు కూడా పట్టణ ప్రాంత ప్రేక్షకులకు, గ్రామీణ ప్రాంత ప్రేక్షకులకు వేరు వేరు వ్యూహాలు అనుసరిస్తారు. ప్రకటనదారులు సైతం తమ లక్షిత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రకటనలు ఏ చానల్ లో ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో నిర్ణయించుకోగలుగుతారు. కలర్స్ టీవీ ఇప్పటికే రెండు రకాల ప్రకటన రేట్లు ఇవ్వటానికి సిద్ధమైంది. టెక్నాలజీ ఆ అవకాశం కల్పించటమే అందుకు కారణం. ఇది అటు బ్రాడ్ కాస్టర్లకు, ఇటు అడ్వర్టయిజర్లకు కూడా ప్రయోజనకరమైన విధానం. కానీ ఇది కేవలం జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ కే పరిమితం కాకుండా అన్ని చానల్స్ కూ వర్తింపజేయటం సమంజసమనే అభిప్రాయం కూడా ఉంది.

అందుకే ఆరంభంలో ఎంటర్టైన్మెంట్ చానల్స్ కే పరిమితమైనా త్వరలో అన్ని చానల్స్ కూ విస్తరిస్తుందని బార్క్ చెబుతోంది. త్వరలో మూవీస్, మ్యూజిక్, న్యూస్ చానల్స్ కు కూడా వేరువేరుగా డేటా ఇవ్వబోతున్నారు. ఇలా ఉండగా అనేక జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఇకమీదట ప్రత్యేకంగా గ్రామీణ ప్రేక్షకులకోసం ఉచిత చానల్స్ ప్రసారానికి మొగ్గు చూపవచ్చునని భావిస్తున్నారు. మరికొన్ని సంస్థలు కొత్త చానల్స్ ప్రారంభించినా ఆశ్చర్యం లేదు.

బార్క్ సంస్థ డేటా ఇవ్వటానికి పరిమితం కావాలే తప్ప రాంకులు ఇవ్వటం సమంజసం కాదని మరికొంతమంది బార్క్ సీఈవో పార్థో దాస్ గుప్తా కు నిరసన కూడా తెలియజేశారు. డేటాను ఎలా వాడుకోవాలో, ఎలా విశ్లేషించుకోవాలో అడ్వర్టయిజర్స్ నిర్ణయించుకుంటారనేది వాళ్ళ అభిప్రాయం. బార్క్ డేటా వారానికొకసారి వచ్చేదే. కానీ వ్యాపారం కలకాలం సాగేది. అందువలన వ్యాపారాన్ని ప్రతికూలంగా ప్రభావం చేసే శక్తి బార్క్ డేటాకు ఉండకూడదని కూడా కొంతమంది ఆశిస్తున్నారు. ఒకవారం నెంబర్ వన్ వచ్చి తరువాత వారం నెంబర్ టూ కి దిగజారితే అది క్రియేటివ్ సిబ్బంది మీద తీవ్రమైన మాన్సిక వత్తిడి పెంచుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.