• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ దశ – దిశ : కొన్ని తప్పటడుగులు – మరికొన్ని తప్పుటడుగులు

డిజిటైజేషన్ దశ – దిశ : కొన్ని తప్పటడుగులు – మరికొన్ని తప్పుటడుగులు

డిజిటైజేషన్ దశ – దిశ

కొన్ని తప్పటడుగులు – మరికొన్ని తప్పుటడుగులు

డిజిటైజేషన్ విషయంలో అటు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ( ఎంఐబి) గాని, ఇటు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) గాని మీడియాకు ఏం చెప్పాయన్న విషయం పక్కనబెడితే ఇప్పటివరకు డిజిటైజేషన్ విఫలమైందనే చెప్పాలి. ఇప్పటికే పూర్తయిందంటున్న మొదటి రెండు దశల కిందికి వచ్చిన 42 నగరాలలో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలూ కనబడటం లేదు. మొదలు పెట్టి మూడేళ్ళయినా ఏ చానల్ నిర్వాహకుడూ ఇప్పటి వరకూ వినియోగదారులను కూడా కూర్చోబెట్టి డిజిటైజేషన్ మీద చర్చ జరపలేదు. వ్యతిరేకత వెల్లువెత్తుతుందన్న భయంతోనే ఇలాంటి చర్చ జరపటానికి వెనుకాడుతున్నారు. నిజానికి యుపిఏ ప్రభుత్వం సైతం పత్రికలలో డిజిటైజేషన్ కు వ్యతిరేకమైన వార్తలు రాకుండా చాలా జాగ్రత్త పడిన విషయం రహస్యమేమీ కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అది సాఫీగా ముందుకు సాగటం కోసం మీడియాను నియంత్రించింది. ఎలా నియంత్రించాలన్నది సమాచార శాఖకు ఎవరూ కొత్తగా నేర్పాల్సిన పనేమీ లేదు.

12 కోట్ల కేబుల్ కనెక్షన్లున్న దేశంలో దాదాపు 70 శాతం మంది పేద, నిరుపేద ప్రజలున్న చోట కేవలం రెండేళ్ళలో డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. పైగా ప్రజలమీద పెనుభారం మోపుతూ కార్పొరేట్ ఎమ్మెస్వోలకు, పే చానల్ యజమానులకూ లాభం చేకూర్చటానికి, పనిలో పనిగా పన్నుల ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్య ఇది. నిజంగా నాణ్యమైన ప్రసారాలు ప్రజలు కోరుకుంటున్నారనుకుంటే ఆ ప్రజలు తప్పనిసరిగా ధనవంతులే అయి ఉంటారు. అలాంటప్పుడు ఏకకాలంలో డిజిటల్, అనలాగ్ ప్రసారాలు ఇచ్చి ఉంటే ప్రేక్షకులు స్వచ్ఛందంగా తమ వెసులుబాటును బట్టి డిజిటల్ ప్రసారాలు అందుకోవటానికి మొగ్గు చూపేవారు. కొంత ఎక్కువ సమయం పట్టినా ఈ మార్పు స్వచ్ఛందంగా జరిగేది. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా హడావిడి డెడ్ లైన్లు పెట్టి మళ్ళీ పొడిగిస్తూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది.

డిజిటైజేషన్ గడువు ప్రకటించేటప్పుడు ప్రభుత్వం కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు అవసరమవుతాయి. కానీ భారతదేశంలో వాటిని తయారుచేయటం అప్పటికింకా మొదలుకాలేదు. అంటే, అనివార్యంగా విదేశాలమీద ఆధారపడాలి. నిర్దిష్టమైన గడువుతేదీలాగా అవసరానికి తగినన్ని సెట్ టాప్ బాక్సులు తెప్పించుకోవటం సాధ్యం కాదని అప్పటికే తేలిపోయింది. దిగుమతి చేసుకున్నా, వాటి నాణ్యతాప్రమాణాలు తనిఖీ చేసే వ్యవస్థ ఏదీ లేదు. కనీసం వాటి మరమ్మతుల సంగతి కూడా పట్టించుకోలేదు.

మొత్తంగా చూస్తే, ఇప్పటివరకూ పూర్తయిందంటున్న మొదటి రెండు దశల డిజిటైజేషన్ వల్ల ఒరిగిందేమైనా ఉందా అంటే మొదటిది వినియోగదారులమీద భారం పెరగటం, రెండోది మరిన్ని గుత్తాధిపత్యాలు ఏర్పడటం. నిజానికి డిజిటైజేషన్ కు ముందే కార్పొరేట్ ఎమ్మెస్వోల గుత్తాధిపత్యాలు పెరిగిపోవటం పట్ల స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా గుత్తాధిపత్యాలు వేగం పుంజుకొని విస్తరించాయి. ఇలాంటి గుత్తాధిపత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రాయ్ సిఫార్సు చేసినా ఆ సిఫార్సులను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఇంకా ఆమోదించలేదు. ప్రభుత్వం ఇప్పటికీ మేలుకోలేదు.

మొదటి రెండు దశల డిజిటైజేషన్ పూర్తయిందని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది కాబట్టి నిజమనే నమ్ముదాం. ఇక మూడు, నాలుగు దశల గడువును 2015 డిసెంబర్, 2016 డిసెంబర్ వరకూ పొడిగించారు. ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణమేంటంటే స్వదేశీ సెట్ టాప్ బాక్సులను ప్రోత్సహించాలంటే మరికొంత సమయం అవసరమని. చిత్రమేమిటంటే ఇప్పటివరకూ అటు ట్రాయ్ గాని ఇటు మంత్రిత్వశాఖ గాని నిస్సహాయులైన వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న పాపాన పోలేదు. కనీసం మొదటి రెండు దశల్లో వినియీగదారుల అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా మూడు, నాలుగు దశల్లో సరిదిద్దు కోవటానికి ప్రయత్నించకపోవటం మరీ దారుణం. ప్రజలకోసం కాకపోయినా కనీసం ఆత్మవిమర్శచేసుకునే ప్రయత్నమూ జరగలేదు.

వినియోగదారులకు అసలు ఉచిత చానల్స్ అంటే ఏమిటో, పే చానల్స్ అంటే ఏమిటో, బొకే పద్ధతి అంటే ఏమిటో, అ లా కార్టే విధానమేమిటో తెలియదు. విసుగుపుట్టించే ప్రకటనలు, నాణ్యత కరవైన ప్రసారాలు, నాసిరకం సెట్ టాప్ బాక్సులు, మరమ్మతులకు దిక్కులేని సెట్ టాప్ బాక్సులు, ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్ కు సెట్ టాప్ బాక్స్ మార్చుకోలేని నిస్సహాయత, బహిరంగ మార్కెట్ లో సెట్ టాప్ బాక్సులు దొరక్కపోవటం లాంటి సమస్యలు సతమతం చేస్తున్నాయి. చట్టవ్యతిరేకమని ట్రాయ్ చెప్పినా సరే, యాక్టివేషన్ ఫీజు వసూలు చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. అసలు డిటిహెచ్ సమయంలోనే ఆపరేటర్ నుంచి మారే సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉండగా కొత్తగా డిజిటైజేషన్ మొదలుపెడుతున్నప్పుడు ఆ సౌకర్యం కల్పించకపోవటం ట్రాయ్ కీ, మంత్రిత్వశాఖకూ ప్రేక్షకుల మీద ఉన్న అత్యంత చులకన భావనకు నిదర్శనం.

కోట్లాది వినియోగదారులకు ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు డిజిటైజేషన్ జరగని ప్రాంతాలకు నెలసరి చందా పెంచుతూ ట్రాయ్ సరికొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీచేసింది. అంటే మార్కెట్ లో దాదాపు 70 శాతం మంది ప్రేక్షకులమీద ఈ ఉత్తర్వులు భారం మోపాయి. ఇందులో మెజారిటీ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. అక్కడ సగటున 50 చానల్స్ కు మించి ఇవ్వరు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో అంటే సుమారు 20 శాతం ప్రేక్షకులకు మాత్రం దాదాపు వంద చానల్స్ దాకా అందుతాయి. వాళ్ళకు అన్ని పే చానల్స్ అవసరం లేకపోయినా భారం మోయక తప్పని పరిస్థితి వచ్చింది.

చందాదారులకు కేబుల్ టీవీ సర్వీసుల అందుబాటు, వాళ్ళు భరించగలిగే శక్తి తదితర అంశాలను అంచనా వేయటంలో ట్రాయ్ విఫలమైంది. పైగా, కొత్త డిజిటైజేషన్ వ్యవస్థ గురించి, పే చానల్స్ గురించి, అ లా కార్టే విధానం గురించి ప్రేక్షకులకు తెలియజెప్పటంలో కూడా దారుణంగా విఫలమైంది. కేవలం కొన్ని పే చానల్స్ లో ఒకటీ అరా ప్రకటనలు ప్రసారం చేయగానే మొత్తం డిజిటైజేషన్ గురించి ప్రేక్షకులకు అర్థమైందని అనుకోవటం దురదృష్టకరం. పైగా ఈ ప్రకటనలు కూడా హెచ్చరిక ధోరణిలో సాగుతాయి. సెట్ టాప్ బాక్స్ తీసుకోకపోతే ప్రసారాలు ఆగిపోతాయంటూ హిందీ సీరియల్స్ నటీమణుల చేత బెదిరించే భాషలో చెప్పటం తప్ప ఈ ప్రక్రియను వివరించే ప్రయత్నం జరగటం లేదు. ఇంత సువిశాల దేశంలో ప్రజలకు అర్థమయ్యేభాషలో సమాచారం అందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడే కొత్త విధానాన్ని ప్రజలు అర్థం చేసుకొని అమలు చేయటానికి ముందుకొస్తారు.

కొన్ని సూచనలు, మరికొన్ని సలహాలు

1. డిజిటైజేషన్ గడువు లోగా పరిశ్రమ వ్యవస్థీకృతం
మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ గడువును పెంచటం వలన పరిశ్రమ వ్యవస్థీకృతం కావటానికి కొంత అదనపు సమయం దొరికినట్టయింది. ఈ సమయంలో మార్కెట్లు కొంత పరిణతి చెందటానికి వీలుంటుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. బలవంతంగా పే చానల్స్ పేరుతో వసూలు చేసే లోపు వినియోగదారుడు కూడా పే చానల్స్ కు అలవాటు పడతాడు. ఆ విధంగా బొకే విధానం మీద కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. లేకపోతే అయోమయమే కొనసాగుతుంది. నిజానికి మొదటి రెండు దశల్లో అదే జరిగింది. మూడేళ్ళ తరువాత కూడా ప్రేక్షకులు తాము కోరుకున్న చానల్స్ చూడలేకపోతున్నారు. అంతేకాదు కంప్యూటరైజ్డ్ బిల్లులు పొందలేకపోతున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న అతిపెద్ద దశల్లో అంతకంటే ఘోర వైఫల్యాలు చవిచూడబోతున్నారు.

2. పే చానల్స్ ప్రసారాలకు నాణ్యతాప్రమాణాలు
సేవలలో నాణ్యత గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లగురించి మాత్రమే ప్రస్తావిస్తూ వచ్చిన ట్రాయ్ అసలు ఆ ప్రసారాల తయారీదారులను నాణ్యత గురించి ప్రశ్నించకపోవటం దారుణం. తక్కువ బాండ్ విడ్త్ లో ఎక్కువ చానల్స్ పట్టేలా కంప్రెస్ చేసి నాణ్యతను బేఖాతరు చేస్తున్న చానల్స్ మీద ట్రాయ్ ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. అంటే, అంతిమంగా నాణ్యత కరవైన ప్రసారాలతోనే వినియోగదారుడు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అదే విధంగా పే చానల్స్ ఒకవైపు పెద్ద మొత్తాల్లొ వినియోగదారుడి నుంచి చందా మొత్తాలు గుంజుతూనే ప్రకటనలతో విసిగిస్తున్నాయి. అనేక దేశాల్లో పే చానల్స్ ప్రకటనలు ప్రసారం చేయటం నిషిద్ధం. ఇటీవలే రష్యా కూడా నిషేధం విధించింది. మనదేశంలో నిషేధం విధిమ్చకపోయినా కనీసం ఒక పరిమితి విధించటానికీ వెనకాడే పరిస్థితి. అంతెందుకు, గంటకు 12 నిమిషాలు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదని కేబుల్ టీవీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ నిబంధనను అమలు చేసే పట్టుదలగాని, అంకితభావం గాని ప్రభుత్వానికి లేవు. ఇది కూడా ప్రేక్షకులపట్ల ఉన్న చులకన భావనకూ, చానల్స్ మీద ఉన్న ప్రేమకూ నిదర్శనం. ప్రకటనల ప్రసారం మొదలుకాగానే ఒక్క సారిగా వాల్యూమ్ పెరిగి టీవీ దద్దరిల్లుతుంది. దీనిమీద కూడా ప్రభుత్వం ఎలాంటి కట్టడీ చేయలేకపోయింది. ఒకవైపు డిజిటైజేషన్ తో ప్రసారాల నాణ్యత పెరుగుతుందంటూ ఊదరగొడుతున్న ట్రాయ్, నాణ్యత పెరగటానికి వీలుగా చానల్స్ ఎంత బాండ్ విడ్త్ పెంచుకుంటున్నాయో పరిశీలించలేకపోతోంది. నాణ్యతానిబంధన చానల్స్ కు కూడా వర్తించినప్పుడే ప్రయోజనం ఉంటుంది. చానల్స్ ఇచ్చే ప్రసారాలు నాణ్యంగా లేనప్పుడు కేవలం సెట్ టాప్ బాక్స్ పెట్టుకోగానే వినియోగదారుడికి. నాణ్యమైన ప్రసారాలు అందటం భ్రమ మాత్రమే.

3. చందాల టోకు ధర నిర్ణయం
పే చానల్స్ వసూలు చేసే చందా రేట్ల విషయంలో ట్రాయ్ అపరిమిత స్వేచ్చ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే పే చానల్ యాజమాన్యాలు తాము నిర్ణయించుకున్న చిల్లర ధరలను వచ్చే ఐదేళ్ళకూ ప్రకటించాల్సి ఉంటుంది. టారిఫ్ ఆర్డర్ లో ఇచ్చిన మూడు స్లాబ్స్ గమనిస్తే సగటున ఒక్కో చానల్ కు నెలకు 5 రూపాయలుంటుంది. నిజానికి CAS లో కూడా ఇదే విధమైన లెక్కింపు జరిగింది. పెద్దగా వ్యతిరేకత లేకుండా అందరూ దీన్ని ఆమోదించారు కూడా. కానీ డిజిటైజేషన్ లో ట్రాయ్ ఏ విధంగానూ నియంత్రించలేకపోతోంది. ఇప్పుడు చూస్తుంటే సగటు ధర 10 రూపాయలకు ఏ మాత్రమూ తగ్గేలా లేదు. అంటే, ట్రాయ్ చెప్పిన ధరకు రెట్టింపు. స్పోర్ట్స్ చానల్స్ అయితే ఒక్కొక్కటి 30 రూపాయలకు తక్కువ లేవు. ఈ ధరలతో 12 కోట్ల ఇళ్ళకు ప్రసారాలు అందుతాయా? అసలు డిజిటైజేషన్ అంటేనే జనం మీద సెట్ టాప్ బాక్స్ భారమని అనుకుంటున్న సమయంలో ఇలా పే చానల్ ధరలకూ అడ్దూ అదుపూ లేకుండా పోతుంటే ట్రాయ్ అలా మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తే ఎలా ? వినియోగదారులకు ఇది పెనుభారంగా తయారవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వకపోవటంతో స్వయంగా సెట్ టాప్ బాక్స్ భారం మోస్తున్న వినియోగదారుడిమీద ఇలా నెలనెలా పడే భారాన్ని రెట్టింపు చేయటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. అందుకే మొదటి ఐదేళ్ళ డిజిటైజేషన్ కాలంలో ఒక్కో పే చానల్ చిల్లర ధర 5 రూపాయలకు మించకుండా ట్రాయ్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
మొత్తం మార్కెట్ ను నిర్ణయిస్తున్నది పే చానల్ నిర్వాహకులు, డిటిహెచ్ ఆపరేటర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలు మాత్రమే. ఈ వ్యవహారంలో నష్టపోతున్నది వినియీగదారులే. అందుబాటు ధరలో వినోదం అందే అవకాశమే కనబడటం లేదు. డిటిహెచ్ తీసుకున్నా, కేబుల్ కనెక్షన్ తీసుకున్నా, పే చానల్స్ బాదుడు పెనుసమస్యగా తయారైంది. పైగా, ఉచిత చానల్స్ విషయంలో ట్రాయ్ అనుసరించిన విధానం కూడా సమంజసంగాలేదు. డిజిటైజేషన్ పేరుతో పే చానల్స్ తో బాటు ఉచిత ( ఫ్రీ టూ ఎయిర్ – ఎఫ్ టి ఎ ) చానల్స్ ను కూడా బలవంతంగా ఎన్ క్రిప్ట్ చేయించటం వలన కోట్లాది ప్రేక్షకులకు ఈ చానల్స్ ను సులభంగా చూసే అవకాశం పోతోంది. అందులో దూరదర్శన్ చానల్స్ కూడా ఉన్నాయి. మరో వైపు చానల్స్ నడుపుతున్న పెద్ద పెద్ద గ్రూపులు తమ పే చానల్స్ కు బొకే పద్ధతిలో చందా ధరలు నిర్ణయించి ఒంటరి చానల్స్ ను అణగదొక్కు తున్నారు.

డిజిటైజేషన్ జరగని ప్రాంతాల్లో పే చానల్ యజమానులు అదే పనిగా దబ్బు గుంజే పనిలో పడ్డారు. ఎమ్మెస్వోలమీద వత్తిడి తెచ్చి కనెక్టివిటీ పెంచమంటారు. లేని కనెక్టివిటీ ఎక్కడ తేవాలని మొత్తుకుంటూనే ఎమ్మెస్వో ఈ భారాన్ని స్థానిక కేబుల్ ఆపరేటర్ మీద రుద్దుతాడు. ఫలితంగా ఆపరేటర్ నష్టపోతాడు. లేదంటే వినియోగదారుడిమీద నెలవారీ చందా భారాన్ని పెంచుతాడు. అలాంటి పే చానల్స్ చూడకపోయినా వినియోగదారుడు ఆ భారం భరించాల్సి వస్తుంది. అలా వసూలు చేయటం ఆపరేటర్ కు చాలా ఇబ్బందికరమైన పని. మరో వైపు అన్ని పే చానల్స్ కూ ఒకే విధమైన వ్యూయర్ షిప్ ఉండదు. అందువలన ఫలానా చానల్ కు ఇన్ని కనెక్షన్ల లెక్కన వసూలు చేసి ఇస్తున్నారు కాబట్టి మా చానల్ కూ అలాగే ఇవ్వాలంటూ పే చానల్ యజమానులు పట్టుబట్టటమూ సమంజసం కాదు. అందువలన క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని డిజిటైజేషన్ జరగని ప్రాంతాల్లో వ్యూయర్ షిప్ లెక్కించటానికి ట్రాయ్ ఒక ఫార్ములా రూపొందించాల్సిన ఆవసరముంది.

4. వినియోగదారుల బిల్లింగ్
డిజిటజేషన్ పూర్తయితే అంతా పారదర్శకంగా ఉంటుందని పదే పదే చెప్పారు. అందులో ప్రధానంగా కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ ద్వారా కనెక్షన్ల సంఖ్య, వసూళ్ళు అన్నీ పారదర్శకంగా ఉంటాయని, పే చానల్ యజమానులకు కచ్చితమైన ఆదాయం వస్తుందని, ప్రభుత్వానికి పన్ను వసూళ్ళూ బాగా జరుగుతాయని ట్రాయ్ అదే పనిగా ఊదారగొడుతోంది. కానీ అసలు సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. క్షేత్ర స్థాయిలో ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్యన వ్యాపార సంబంధమైన అవగాహనకు అవసరమైన ప్రాతిపదిక లేకపోవటం వలన బిల్లింగ్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అందుకే మొదటి రెండు దశల్లో పూర్తి స్థాయిలో డిజిటైజేషన్ అమలు కావటం లేదు.
ట్రాయ్ ఈ సమస్యను పరిష్కరించకుండా ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లే తేల్చుకోవాలంటూ సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆదాయ పంపిణీ విషయం ఇంకా తేలలేదు. పే చానల్స్ బొకే రూపంలోనూ, విడివిడిగానూ అందుబాటులో ఉండే విషయం ఒక కొలిక్కి రాలేదు. ఒకవేళ ఎమ్మెస్వో ఏదైనా కారణం వల్ల అకస్మాత్తుగా పే చానల్స్ ప్రసారాలు ఉపసంహరించుకుంటే పరిస్థితి ఏంటి అనే విషయాలమీద స్పష్టత లేదు. అటు ఎమ్మెస్వోకి, ఇటు ఆపరేటర్ కి ప్రత్యేకమైన కార్యక్షేత్రాలున్నప్పుడే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పుడే ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కాగలుగుతారు. కానీ వాస్తవానికి చాలాచోట్ల ఎమ్మెస్వోలే తన ప్రాంతంలో ఆపరేటర్ గా కూడా ఉండటం వల్ల అది సాధ్యం కావటం లేదు. ఇలాంటి మౌలిక సమస్యలు పరిష్కరించేదాకా బిల్లింగ్ సమస్య కొనసాగుతూనే ఉంటుంది, దీనివలన డిజిటైజేషన్ ప్రయోజనం నెరవేరదు.

5. ఎమ్మెస్వో, ఆపరేటర్ మధ్య ఆదాయపంపిణీ

కేబుల్ ఆపరేటర్ కి అయ్యే కనీస నిర్వహణ ఖర్చును ట్రాయ్ పరిగణనలోకి తీసుకోకపోవటం వలన న్యాయబద్ధమైన అదాయపంపిణీకి ఒక విధానాన్ని రూపొందించటంలో విఫలమైంది. ఆపరేటర్ తన వ్యాపారాన్ని కొనసాగించటానికైనా ఇది కనీస అవసరం. అదే విధంగా చందారేట్ల విషయంలోనూ ఒక పద్ధతి అనుసరించతం ద్వారా ఆపరేటర్ కు రావాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా ఉంటుంది. నిజానికి ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యాపారనమూనాను రూపొందించటంలో ట్రాయ్ విజయం సాధించలేకపోయింది.

నిజానికి డిజిటైజేషన్ క్రమంలో పరిశ్రమను పునర్నిర్మిస్తున్న సమయంలో ట్రాయ్ దృష్టిపెట్టాల్సిన విషయమిది. ఎవరూ తమ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్న అనుమానాలకు గురికాకుండా హామీ ఇవ్వాల్సిన ట్రాయ్ ఆ దిశలో కృషి చేయలేదు. పరస్పరం ఆమోదయోగ్యంగా బేరసారాలు జరుపుకోమని చెప్పటం వలన ఆచరణలో అది ముందడుగు వేయటం లేదు. 1994 లో మొదటిసారిగా ఎమ్మెస్వోలు మార్కెట్లో ప్రవేశించినప్పటినుంచి ఈ తరహా చర్చల మార్గ విఫలవుతూనే ఉంది. ప్రస్తుత తరుణంలో కేబుల్ ఆపరేటర్ తన పెట్టుబడికి, శ్రమకు భద్రత లేదనే అభిప్రాయంలో ఉన్నాడు. చిన్న చిన్న కారణాలు చూపించి కూడా పోస్టాఫీస్ రిజిస్ట్రేషన్, ఎమ్ ఐ బి రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశాలుండటం కూడా అందుకు కారణం. కనీసం వచ్చే ఐదేళ్ళకాలానికైనా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోగలిగే పరిస్థితి కల్పించటం ట్రాయ్ బాధ్యత.

ఏ కేబుల్ ఆపరేటర్ అయినా, స్వతంత్ర ఎమ్మెస్వో అయినా సొంతగా డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోవటానికి ముందుకొస్తే ట్రాయ్ నుంచి, ఎమ్ ఐ బి నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉండాలి. రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పే చానల్స్ తో ఒప్పందాల విషయంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి. మొదటి రెండు దశల్లో ఆపరేటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారు. దీనివల్లనే ఆపరేటర్లు, స్వతంత్ర ఎమ్మెస్వోల సంఖ్యతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య నామమాత్రం. పరోక్షంగానైనా ట్రాయ్ దీన్ని కేవలం పెద్దపెద్ద ఎమ్మెస్వోలకు మాత్రమే వీలయ్యే ప్రక్రియగా చెప్పే ప్రయత్నం చేసింది.

6. కోర్టు కెక్కుతున్న ట్రాయ్ నిర్ణయాలు
ట్రాయ్ చేసిన ప్రతి నిబంధననూ కోర్టులో సవాలుచేయటం ఒక ఆనవాయితీగా మారింది. పైగా నిబంధనలు రూపొందించటమే తప్ప క్షేత్ర స్థాయిలో వాటి అమలును పర్యవేక్షించటానికి అవసరమైన యంత్రాంగం ట్రాయ్ కి లేదు. పైగా ఉల్లంఘించే సంస్థ పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అయినప్పుడు ఆ వ్యవహారాన్బ్ని కోర్టుకు తీసుకెళుతున్నారు. ఎలాగూ ఖరీదైన లాయర్లను నియోగించుకుంటారు కాబట్టి చట్టంలో లొసుగులు వాడుకుంటూ స్టే తెచ్చుకొని ఒకపక్క నిబంధనల ఉల్లంఘన కొనసాగిస్తూ మరోవైపు కేసును సుదీర్ఘంగా సాగదీస్తారు. ఒక మాజీ న్యాయమంత్రిని, ఒక మాజీ సమాచార, ప్రసారాల శాఖామంత్రిని లాయర్లుగా పెట్టుకొని ట్రాయ్ నిబంధనలను అడ్డుకునే ప్రయత్నం చేసిన కార్పొరేట్ సంస్థలనూ చూశాం. ఇదే అవకాశంగా తీసుకొని మార్కెట్లో గుత్తాధిపత్యాలను మరింతగా పెంచుకున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో గందరగోళవాతావరణం కొనసాగుతూనే ఉంది.

మొత్తంగా చూస్తే డిజిటైజేషన్ అమలులో ఎన్నో తప్పటడుగులు, తప్పుటడుగులూ కనిపిస్తాయి. ట్రాయ్ మెతకవైఖరి కారణంగా జరిగినవి కొన్నయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేయకుండా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా జరిగినవి మరికొన్ని. వీటిని సరిదిద్దే ప్రయత్నం జరగకపోతే డిజిటైజేషన్ ఆశించిన ఫలితాలనివ్వదు. నిబంధనల అమలును పర్యవేక్షించటానికి రాష్ట్ర స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సహా అన్ని విభాగాల వారూ ఉండాలి. ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లూ కేబుల్స్ వేసుకోవటానికి వీలుకల్పించే రైట్ ఆఫ్ వే స్థానికంగా ఎలా అమలవుతున్నదో చూడాలి. అదే విధంగా స్థానికంగా తలెత్తే సమస్యలను సైతం ఇది పరిష్కరించ గలుగుతుంది.