• Home »
  • Cable »
  • మూడో దశ డిజిటైజేషన్ లో భారీగా పెరిగిన సెట్ టాప్ బాక్సుల దిగుమతులు

మూడో దశ డిజిటైజేషన్ లో భారీగా పెరిగిన సెట్ టాప్ బాక్సుల దిగుమతులు

భారత దేశంలో మూడో దశ డిజిటైజేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతున్నదనటానికి నిదర్శనంగా సెట్ టాప్ బాక్సులు పెద్ద ఎత్తున దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. సార్క్ దేశాల మొత్తం సెట్ టాప్ బాక్సుల్ వినియోగంలో 97% భారతదేశం కోసమే కావటం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వీటిలో స్టాండర్డ్ డెఫినిషన్, హై డెఫినిషన్, హైబ్రిడ్ బాక్సులున్నాయి.

డేటాక్సిస్ సంస్థ తాజాగా ప్రచురించిన పరిశోధనానివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారతదేశంతోబాటు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ తో కూడిన సార్క్ దేశాల్లో 2015 వ సంవత్సరం మూడో త్రైమాసికానికి అంతకుముందు త్రైమాసికం కంటే 73% అమ్మకాలు పెరిగాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో సార్క్ దేశాలకు మొత్తం 73 లక్షల 40 వేల సెట్ టాప్ బాక్సులు అందగా అందులో 97% భారతదేశానికే చేరాయని అందులో వెల్లడించారు.

వాటిలో అత్యధికంగా స్కైవర్త్ కంపెనీకి చెందినవే ఉన్నాయని కూడా తేలింది. స్వదేశీ సెట్ టాప్ బాక్సుల వినియోగం భారీగా లేకపోయినా, స్థిరంగా పెరుగుతున్నట్టు మాత్రం గుర్తించారి. మొదటి రెండు త్రైమాసికాల్లో ఐదు శాతం మించకపోగా మూడో త్రైమాసికానికి 15 శాతానికి చేరుకుంది. నాలుగో దశలో మరింత పుంజుకోవచ్చునని భావిస్తున్నారు. ఉత్పత్తి రీత్యా చూస్తే స్వదేశీ సెట్ టాప్ బాక్సుల సంఖ్య దాదాపు నాలుగురెట్లు పెరిగినట్టు డేటాక్సిస్ నివేదిక తేల్చింది.

మూడో దశ గడువు దగ్గరపడుతుండటం వలన డిమాండ్ బాగా పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఎయిర్ టెల్ డిజిటల్, డిష్ టీవీ, వీడియో కాన్ సంస్థలు తమ డిటిహెచ్ కోసం స్వదేశీ బాక్సులనే వాడాలని నిర్ణయించుకోవటం కూడా మార్కెట్ ఎదుగుదలకు కారణమైందని డేటాక్సిస్ గుర్తించింది. స్టాండర్డ్ డెఫినిషన్ బాక్సులతోబాటు హెచ్ డి బాక్సులకు, అల్ట్రా హెచ్ డి బాక్సులకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దీనివలన సెట్ టాప్ బాక్స్ సగటు అమ్మకం ధర కూడా పెరిగింది. గడిచిన త్రైమాసికంలో ప్రధానంగా స్కై వర్త్, చాంగ్ హాంగ్, కోషిప్, హువావీ, మై బాక్స్ ట్రెండ్ ఎలక్ట్రానిక్స్, రిడ్సిస్, విలెట్ కమ్యూనికేషన్స్ సంస్థల సెట్ టాప్ బాక్సులు బాగా అమ్ముడయ్యాయి.