• Home »
  • BARC »
  • తెలుగు రాష్త్రాల్లో 55% కొత్త గ్రామీణ ప్రేక్షకులు : బార్క్ ఫలితాల్లో దిగ్భ్రాంతికర మార్పులు?

తెలుగు రాష్త్రాల్లో 55% కొత్త గ్రామీణ ప్రేక్షకులు : బార్క్ ఫలితాల్లో దిగ్భ్రాంతికర మార్పులు?

టామ్ శకం అంతరించి పోతుండటంతో భారతదేశపు టీవీ ప్రేక్షకుల వీక్షణను లెక్కించే ఏకైక సంస్థగా మారబోతున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడించటానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటిదాకా టామ్ వివక్ష కారణంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రేటింగ్ శాంపిల్స్ ఇప్పుడు గ్రామాలకూ విస్తరించటంతో ఈ నెలాఖరునుంచి వెల్లడయ్యే అక్కడి ప్రేక్షకుల అభిప్రాయాలు కలకలం రేపబోతున్నట్టు తెలుస్తోంది.

ఇకమీదట గ్రామీణ ప్రేక్షకుల అభిరుచులే టీవీ కార్యక్రమాలను నిర్దేశించబోతున్నాయి. రేటింగ్స్ కోసం ఇన్నాళ్ళూ పట్టణ ప్రాంత ప్రజలనే గీటురాయిగా భావించిన చానల్స్ ఇకమీదట ఆ ధోరణి మార్చుకోక తప్పదు. అదే సమయంలో శాంపిల్స్ తీసే ప్రదేశాల సంఖ్య గణనీయంగా పెరగబోతుండటం వలన ఇన్నాళ్ళూ పెద్ద మొత్తంలో కారేజ్ ఫీజు డిమాండ్ చేసిన ఎమ్మెస్వోలు కాస్త వెనకడుగేయక తప్పదు. కారేజ్ ఫీజు అందుకునే ఎమ్మెస్వోల సంఖ్య పెరగవచ్చునే తప్ప గట్టుగా బేరమాడే శక్తి మాత్రం కచ్చితంగా తగ్గిపోతుంది.

“ ఇక గ్రామాలకు తరలివెళ్ళే సమయం ఆసన్నమైంది “ అంటున్న బార్క్ ఇప్పుడు భారత గ్రామీణ ముఖ చిత్రంలో వస్తున్న మార్పులను ఆవిష్కరించబోతోంది. జాతీయ సగటు కంటే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలవల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో సూచనప్రాయంగా వెల్లడించింది.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో

హిందీ మాట్లాడే గ్రామీణ ప్రాంతాలలో అదనంగా మరో 39 కోట్లమంది చేరబోతున్నారు. దీనివలన హిందీ చానల్స్ ప్రేక్షకుల సంఖ్య 90 కోట్లకు చేరుకుంటుంది. బార్క్ రేటింగ్స్ లెక్కింపు మొదలైనప్పటినుంచి 12 వారాలపాటు ఫలితాలు గ్రామాల వలన ఎలా మారతాయో గమనిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడతాయి. ఇప్పటివరకు లెక్కలోకి వచ్చిన వారిలో 15 శాతం మంది నగరవాసులు, 41 శాతం మంది పట్టణ ప్రజలు కాగా మిగిలిన 44 శాతం మంది ఇప్పుడు కొత్తగా లెక్కలోకి వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అదనంగా 55 శాతం గ్రామీణ ప్రేక్షకులు

ఇప్పటిదాకా టామ్ చెప్పిన లెక్కలు గ్రామీణ ప్రేక్షకులను లెక్కలోకి తీసుకోకపోవటం అన్ని దక్షిణాది రాష్ట్రాలకంటే తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ నష్టం కలిగించింది. ఏకంగా 55 శాతం మందిని శాంప్లింగ్ లో విస్మరించినట్టు లెక్కతేలింది. అంటే, 45 శాతం మంది ప్రేక్షకుల అభిప్రాయన్నే ప్రజాభిప్రాయంగా లెక్కగట్టి ఇన్నాళ్ళూ రేటింగ్స్ ఇస్తూ వచ్చింది. తెలుగు మూవీ చానల్స్ కోసం తీసిన శాంపిల్స్ అయితే 66 శాతం మంది గ్రామీణ ప్రజలను పక్కనబెట్టి లెక్కగట్టింది. న్యూస్ చానల్స్ కోసం తీసిన శాంపిల్స్ లో 42 శాతం గ్రామీణ ప్రజలను ఇన్నాళ్ళూ పక్కనబెట్టింది.

మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా ఇన్నాళ్ళూ 50 శాతానికి పైగా ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోలేదు. అందుకే ఇప్పటిదాకా టీవీ రేటింగ్స్ నిజమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేదు. మార్కెట్లవారీగా ఒడిశాలో 65 శాతం మంది, బీహార్ లో 59 శాతం మంది, జమ్మూ కాశ్మీర్ లో 59 శాతం మంది, అస్సాం/ఈశాన్యరాష్ట్రాల్లో 58 శాతం మంది, ఉత్తరప్రదేశ్/ఉత్తరాఖండ్ లో 55 శాతం మంది, రాజస్థాన్ లో 54 శాతం మంది, ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో 53 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. కర్నాటకలో 48%, చత్తీస్ గఢ్ లో 47%, తమిళనాడులో 46%, కేరళలో 45%, జార్ఖండ్ లో 40%, పశ్చిమబెంగాల్ లో 38%, మధ్యప్రదేశ్ లో 37%, గుజరాత్, మహారాష్ట్ర, గోవాలలో 36% గ్రామీణ ప్రజలున్నారు.
అయితే, తక్కువ సేపు టీవీ చూసేది గ్రామీణ ప్రేక్షకులేనని ఈ సర్వే నిర్థారించింది.

నగరాలు 3 గంటల24 నిమిషాల 17 సెకెన్లు
పట్టణాలు ( లక్ష పైబడిన జనాభా ఉన్న పట్టణాలు) 3 గంటల 31 నిమిషాల 30 సెకెన్లు
గ్రామాలు 2 గంటల 43 నిమిషాల 26 సెకెన్లు
భారతదేశ సగటు 3 గంటల 3 నిమిషాల 25 సెకెన్లు

గ్రామీణ ప్రాంతాల్లోనే యువకులు అధికం

యువకులు, అంటే 22-30 ఏళ్ళ మధ్య వయసున్నవారు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా బార్క్ సర్వే తేల్చింది. మొత్తం ప్రేక్షకులలో యువత శాతం గ్రామీణ ప్రాంతాల్లో 20.6% ఉండగా, నగరాలలో 19.2%, లక్ష పైబడిన జనాభా ఉన్న పట్టణాలలో 19.5% ఉన్నట్టు తేలింది. గ్రామీణ జనాభాలో 15-40 మధ్య వయసున్నవారి శాతం 55.6% అని కూడా బార్క్ వెల్లడించింది/

మొత్తంగా చూస్తే, బార్క్ ఇప్పుడు గ్రామీణ ప్రేక్షకులను లెక్కలోకి తీసుకోవటం వలన అనేక కీలకమైన మార్పులు కనపడబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు త్వరగా నిద్రపోతారు కాబట్టి ప్రైమ్ టైమ్ నిర్వచనం మారిపోవచ్చు. ఇటీవలికాలంలో రాత్రి 11 దాకా సాగిన సమయం మళ్ళీ 10 గంటలకే తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం ఇప్పుడు పెరిగిన శాంపిల్ సైజు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల మొత్తం మార్కెట్ కంటే ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రభావాన్ని తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు.

2001 తో పోల్చి చూసినప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ/నగర ప్రాంతాల్లో టీవీ సెట్ల సంఖ్య లో పెరుగుదల 20 శాతం నమోదు కాగా అదే గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల 75% టీవీ సెట్లు పెరిగాయి. ఇప్పుడు 2011 జనాభా లెక్కలప్రకారం భారతదేశంలో టీవీ ఉన్న ఇళ్ళ సంఖ్య 15 కోట్ల 35 లక్షలు కాగా అందులో పట్టణప్రాంతాలవి 7 కోట్ల 75 లక్షలు. అందులోఈ లక్ష జనాభా పైబడిన పట్టణాలలోని ఇళ్ళు 5 కోట్ల 71 లక్షలు. ప్రస్తుతం బార్క్ లెక్కిస్తున్న ఇళ్ళ సంఖ్య 5 కోట్ల 50 లక్షలు. మొత్తం శాంపిల్ తీయటానికి ఇంకో రెండేళ్ళు పట్టవచ్చు.