• Home »
  • National Channels »
  • భారత్-శ్రీలంక సిరీస్ ప్రసారహక్కులు సోనీ సిక్స్ కి

భారత్-శ్రీలంక సిరీస్ ప్రసారహక్కులు సోనీ సిక్స్ కి

ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1 వరకు భారత్-శ్రీలంక మధ్య జరిగే మూడు టెస్ట్ మాచ్ ల సిరీస్ ప్రసార హక్కులను మల్టీ స్క్రీన్ మీడియా సంస్థ తన సోనీ సిక్స్ చానల్ కోసం కొనుగోలు చేసింది. ఇందుకు గాను రూ. 3.2 మిలియన్ డాలర్లు (దాదాపు 200 కోట్ల రూపాయలు) చెల్లించింది.

మొత్తం 20 రోజుల వ్యవధిలో సాగే ఈ మూడు మాచ్ లు గాలె, కొలంబో, కాండీ నగరాలలో జరుగుతాయి. సోనీ సిక్స్ చానల్ ఈ మాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆసియాలో అతిపెద్ద క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే రెండు దేశాల జట్లు తలపడటం, దాని ప్రసార హక్కులు తాము దక్కించుకోవటం గర్వకారణమని సోనీ సిక్స్ బిజినెస్ హెడ్ ప్రసన్న కృష్ణన్ భావిస్తున్నారు.

నిజానికి బిసిసిఐ కి, ఎస్సెల్ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్రకూ మధ్య విభేదాలు పొడసూపాయన్న వార్తలమధ్య ఇది ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ జీ గ్రూప్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. శ్రీలంకతో తాము టెన్ స్పోర్ట్స్ కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో ఇది భాగం కాదని, గతంలో ఆగిపోయిన భారత్-వెస్టిండీస్ మాచ్ ల స్థానంలో జరుగుతున్నదని తేల్చి చెప్పింది. వర్షాకాలం కావటంతో ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చునన్న కారణంగానే ప్రత్యక్షప్రసార హక్కులకోసం పోటీపడలేదని తెలుస్తోంది.