• Home »
  • Cable »
  • ఇండియాకాస్ట్ – డిస్నీ పంపిణీ ఒప్పందం రద్దు

ఇండియాకాస్ట్ – డిస్నీ పంపిణీ ఒప్పందం రద్దు

చానల్స్ పంపిణీ విషయంలో డిస్నీ ఇండియాకు, ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ సంస్థకూ మధ్య ఉన్న ఒప్పందం ముగిసింది. డీంతో టీవీ చానల్స్ పంపిణీ వ్యాపారంలో ఒక కుదుపు వచ్చినట్టయింది. ఇకమీదట డిస్నీ అంతర్గతంగానే తన చానల్స్ పంపిణీ చేపట్టాలని నిర్ణయించుకుంది. ఒక స్వతంత్ర బృందాన్ని ఇందుకోసం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ బృందమే ఇకముందు పంపిణీ బాధ్యతలు చూస్తుంది.

నిజానికి డిస్నీ, ఇండియాకాస్ట్ మధ్య వచ్చే మార్చి వరకూ ఒప్పందం ఉన్నప్పటికీ ముందుగానే డిస్నీ ఇండియా ఈ తెగతెంపుల నిర్ణయం తీసుకుంది. డిస్నీ ఇండియా ఆధ్వర్యంలో పిల్లల చానల్స్, యూత్ చానల్స్ తో బాటు మూవీ చానల్స్ కూడా ఉన్నాయి. ఈ బొకేలో డిస్నీ చానల్, డిస్నీ జూనియర్స్, డిస్నీ ఎక్స్ డి, హంగామా, బిందాస్ ప్లే, యుటివి మూవీస్, యు టీవీ యాక్షన్ ఉన్నాయి.

టీవీ 18, వయాకామ్ 18 ల మధ్య భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండియా కాస్ట్ నుంచి ఇప్పుడు డిస్నీ వైదొలగినప్పటికీ మాతృ సంస్థల చానల్స్ ఎక్కువగానే ఉండటం వలన పెద్దగా నష్టం ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. టీవీ18 బ్రాడ్ కాస్ట్ ఆధ్వర్యంలో సిఎన్ బిసి, ఐబిఎన్ లాంటి 17 న్యూస్ చానల్స్ ఉండగా, వయాకామ్ 18 ఆధ్వర్యంలో కలర్స్, ఎంటీవీ, కామెడీ సెంట్రల్, సోనిక్, నిక్ తదితర చానల్స్ ఉన్నాయి.

ఇండియా కాస్ట్, డిస్నీ యుటివి మొదట్లో 74:26 వాటాతో ఉమ్మడి వ్యాపారం మొదలుపెట్టాయి. కానీ నిరుడు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కంటెంట్ అగ్రిగేటర్లమీద ఉక్కుపాదం మోపుతూ చానల్స్ ను గుదిగుచ్చి పంపిణీ చేయటాన్ని నిషేధించింది. ఒక బ్రాడ్ కాస్టర్ చానల్స్ ను మించి బండిల్ చేయటానికి వీల్లేదని తేల్చటంతో వీళ్ళ ఉమ్మడి వ్యాపారానికి తెరపడింది. కానీ భారత ఏజెంట్ హోదాలో డిస్నీ చానల్స్ ను మాత్రం ఇండియా కాస్ట్ పంపిణీ చేస్తూ వచ్చింది. కానీ అనేక ఉమ్మడి వ్యాపార ఒప్పందాలు క్రమంగా భగ్నమవుతున్న సమయంలోనే డిస్నీ కూడా ఇప్పుడు విడిపోయింది.

కంటెంట్ అగ్రిగేటర్లు దాదాపుగా కనుమరుగవుతూ ఉండటం, రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల ద్వారా చానల్స్ , ఎమ్మెస్వోలు అవగాహనకు రావటం కారణంగా టీవీ పంపిణీ రంగం చాలా కీలకమైన మార్పులకు లోను కాబోతున్నది. వినియీగదారుల పాకేజింగ్ కూడా బాగా జరిగి ఆరోగ్యకరమైన పే టీవీ ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకునే అవకాశాలు కనబడుతున్నాయి.