• Home »
  • MIB/Licencing »
  • సాక్షి యాజమాన్య సంస్థకు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు, త్వరలో నోటీస్

సాక్షి యాజమాన్య సంస్థకు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు, త్వరలో నోటీస్

ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు హోం మంత్రిత్వశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది. షో కాజ్ నోటీస్ పంపించే పని నడుస్తోందని సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పార్లమెంటుకు తెలియజేశారు. మా టీవీ నెట్ వర్క్ సహా ఎనిమిది సంస్థల విషయంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకోగా నాలుగింటికి ఇప్పటికే షో కాజ్ నోటీసులు జారీచేశారు. ఇందిరా టెలివిజన్ సహా నాలుగు సంస్థలకు ఇంకా నోటీసులు పంపటం పూర్తి కావాల్సి ఉందని చెప్పారు.

 

హోం శాఖ అక్టోబర్ 8 న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది. దీంతో ఈ సంస్థ ఆధ్వర్యంలో నడిచే సాక్షి టీవీ, దాని టెలిపోర్ట్ కొనసాగటం మీద నీలినీడలు పడినట్టయింది. శాటిలైట్ చానల్స్ కు, టెలిపోర్ట్స్ కు లైసెన్స్ మంజూరు కావాలంటే హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వటం తప్పనిసరి. అదే సమయంలో లైసెన్స్ మంజూరైన తరువాత కూడా క్లియరెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంది.

హోం శాఖ నిర్ణయం ఆధారంగా ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇందిరా టెలివిజన్ కు షో కాజ్ నోటీస్ పంపుతుంది. సమాధానం వచ్చిన తరువాత దాన్ని మళ్ళీ హోం మంత్రిత్వశాఖకు పంపి అభిప్రాయం తీసుకుంటుంది. ఆ అభిప్రాయం ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుంది. క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాల వంటి విషయాల ఆధారంగా హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. మా టీవీ నెట్ వర్క్ విషయంలోనూ, గతంలో సన్ నెట్ వర్క్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరించింది.