• Home »
  • Broadband »
  • ఐపి టీవీ: డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లేకుండా కేబుల్ వ్యాపారానికి దగ్గరి దారి?

ఐపి టీవీ: డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లేకుండా కేబుల్ వ్యాపారానికి దగ్గరి దారి?

  • అందిపుచ్చుకున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
  • బ్రాడ్ బాండ్ ద్వారా ఇంటర్నెట్ తో బాటే టీవీ
  • స్థానిక ఎమ్మెస్వోలకు వ్యాపారావకాశమా, పోటీనా?
  • ఇతర రాష్ట్రాలకూ మార్గదర్శకమవుతుందా?
  • ఇంటర్నెట్ లైసెన్సుకూ, ఐపిటీవీ కీ తేడా లేదా?
  • అన్ని రాష్ట్రాలూ కేబుల్ వ్యాపారంలో ప్రవేశిస్తే ఎమ్మెస్వో గతేంటి?

 

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ప్రతి నిబంధనకూ ఓ మినహాయింపు. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఇవ్వటానికి ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం లైసెన్స్ రాకపోతే దానికీ ఒక అడ్డ దారి ఉంది. నిజానికి అది అడ్డదారి కాదని, రాజమార్గమని స్వయానా రాష్ట్రప్రభుత్వాలే సమాధానం చెప్పుకొని కేబుల్ వ్యాపారం నడుపుకోవటానికి మార్గం సుగమం చేసుకున్నాయి. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అరసు కేబుల్ నెట్ వర్క్ నాలుగేళ్ళపాటు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం కేంద్రం చుట్టూ తిరుగుతూ రావటం, మరో వైపు న్యాయపోరాటం చేయటం తెలిసిందే. అయితే, అకస్మాత్తుగా ఐపిటివి ఆలోచన వచ్చింది. దీనికి ఎలాంటి అవరోధమూ ఇప్పటిదాకా లేదు కాబట్టి ఇంటర్నెట్ ద్వారా తీసుకొని పంపిణీ చేయటం సులభమని గుర్తించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది.

తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా మారన్ సోదరులను దెబ్బకొట్టటానికి అరసు కేబుల్ టీవీ అనే కార్పొరేషన్ ను ఏర్పాటు చేయటం ద్వారా కేబుల్ టీవీ పంపిణీ రంగంలోకి దిగాలనుకోవటం తెలిసిందే. అప్పట్లో కలైంజ్ఞర్ సహా తన సొంత చానల్స్ ను పంపిణీ చేయకుండా మారన్ సోదరుల సుమంగళి కేబుల్ విజన్ (ఎస్ సివి) అడ్డుకుంటుందనే భయంతో ఆ ఎస్ సి వి కే చెక్ పెట్టాలని ఈ కార్పొరేషన్ ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ సంస్థే ఒక ఎమ్మెస్వోగా ఉంటుందని చెప్పారు. ఒక ఐఎ ఎస్ అధికారిని నియమించారు. అయితే, మారన్ సోదరులు మళ్ళీ తాత దగ్గరికొచ్చి దాసోహమనటంతో అరసు కేబుల్ సంస్థ మూలన పడింది, ఐ ఎ ఎస్ అధికారిని మరో సంస్థకు బదలీ చేశారు.

అయితే, ఆ తరువాత వచ్చిన జయలలిత ప్రభుత్వం ఆ సంస్థను పునరుద్ధరించింది. మొత్తం కేబుల్ వ్యాపారాన్ని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆ విధంగా దాదాపు 80 శాతం కేబుల్ కనెక్షన్లు అరసు కేబుల్ కిందికి వచ్చాయి. ఆపరేటర్లకు నష్టం వాటిల్లకుండా వాళ్ళకు ఇచ్చే కమిషన్ వాళ్ళక్లు ఇవ్వటం వలన ఎవరూ ఉపాధి కోల్పోలేదు. పెద్ద ఎమ్మెస్వోలు మాత్రమే తప్పుకోవాల్సి వచ్చింది. వంద రూపాయలకే కేబుల్ ద్వారా టీవీ చానల్స్ ఇచ్చే అవకాశం వచ్చింది. అంతవరకూ బాగానే ఉన్నా, డిజిటైజేషన్ లో ట్రాయ్ విధించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలేవీ టీవీ రంగంలో ప్రవేశించకూడదు. సొంత చానల్స్ పెట్టుకోవటం గాని, పంపిణీ చేయటం గాని నిషిద్ధం. ఆ సాకుతో తమిళనాడు ప్రభుత్వం డిజిటైజేషన్ లో కార్యకలాపాలు సాగించే వీల్లేకుండా పోయింది. ఇదే విషయం కోర్టుకెళ్ళినా ప్రభుత్వం తన విధానమనే మాటను పదే పదే చెబుతూ వస్తోంది. ఈ లోపు చెన్నై లాంటి నగారాలలో కొంత మంది కార్పొరేట్ ఎమ్మెస్వోలు విస్తరించినా మిగిలిన గ్రామీణ ప్రాంతాలలో మాత్రం అరసు కేబుల్ ఆధిపత్యం అలాగే కొనసాగుతూ వస్తోంది.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ బ్రాడ్ బాండ్ అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భారత్ నెట్ కార్యక్రమం తమిళనాడు ప్రభుత్వానికి అయాచిత వరంగా మారింది. పైగా దీనికయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఇచే అవకాశం అంది వచ్చింది. ఈ బ్రాడ్ బాండ్ సౌకర్యాన్ని టీవీ చానల్స్ పంపిణీ చేయటానికి కూడా వాడుకోవాలన్నది జయలలిత ఆలోచన. కమ్యూనికేషన్స్, ఐటి శాఖ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా లైసెన్స్ వచ్చినట్టు గత సెప్టెంబర్ లో   ముఖ్యమంత్రి జయలైత స్వయంగా శాసనసభలో ప్రకటించారు. ఐపిటీవీ లైసెన్స్ తో టీవీ చానల్స్ కూడా అందించే అవకాశముంటుంది. ప్రభుత్వం బ్రాడ్ బాండ్ పంపిణీ కోసం ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం టీవీకి కూడా ఉపయోగించుకోవటం, పైగా కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే మౌలిక సదుపాయాలు కల్పించుకోవటం గమనార్హం.  హైస్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అందించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జయలలిత శాసనసభలో ప్రకటించటానికి ఇదే కారణం.

2011 అక్టోబర్ 25న కేంద్రం తలపెట్టిన నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామపంచాయితీలను అనుసంధానం చేయాల్సి ఉంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్స్, ఐటి మంత్రిత్వశాఖ, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఈ పథకానికి నిధులు సమకూర్చుతున్నాయి. మూడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ ఎన్ ఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రైల్ టెల్ దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వాలకు నిధులు కేటాయించటంతో ఆయా రాష్ట ప్రభుత్వాలు ఈ పథకాన్ని తమకు అనుగుణంగా మలచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పథకం ద్వారా  తమిళనాట మొత్తం 12,500 గ్రామీణ స్థానిక సంస్థల కార్యాలయాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానం చేయటానికి రూ. 3,000 కోట్లు అందిస్తుండగా తమిళనాట ఇంటర్నెట్ సర్వీసుతోబాటు ఐపిటివి ద్వారా టీవీ చానల్స్ అందిస్తామని జయలలిత చెప్పారు. ఇందుకోసం తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అదే సమయంలో ఆమె ప్రత్యేకం గా టీవీ చానల్స్ పంపిణీ గురించి కూడా ప్రస్తావించారు. హైస్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ తోబాటు ఇంటర్నెట్ ప్రొటోకాల్ టీవీ (ఐపిటీవీ ) సేవలు కూడా అందుతాయన్నారు. ఇది కూదా అడ్రెసబిలిటీ ఉండే డిజిటల్ టీవీ పంపిణీ కిందికే వస్తుంది కాబట్టి ఐపిటీవీ హెడ్ ఎండ్ నుంచి సెట్ టాప్ బాక్సును నియంత్రించే వీలు కలుగుతుంది. ఆ విధంగా తమిళనాడు ప్రభుత్వం దొడ్డిదారిన టీవీ చానల్స్ పంపిణీ చేసే అవకాశాన్ని పొందగలిగింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ రాకపోయినా, ఇప్పుడు పరోక్షంగా ఇంటింటికీ టీవీ చానల్స్ అందించే అవకాశం వచ్చింది. ఇప్పటికే ఇంటర్నెట్ పంపిణీ కోసం 552 మంది కేబుల్ ఆపరేటర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

నిజంగా కేంద్రప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా రాష్ట్రప్రభుత్వాలకు అలా ఐపిటీవీ లైసెన్స్ ఇవ్వదలచుకుంటే ఆ విధానాన్ని స్పష్టంగా ప్రకటించి ఉండాల్సింది. ఇప్పుడిలా పరోక్షంగా అనుమతి ఇవ్వటం ద్వారా అన్ని రాష్ట ప్రభుత్వాలూ తమ సొంత చానల్స్ పెట్టుకొని వాటిద్వారా తమ ప్రచారం సాగించుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అబ్యంతరమూ లేకపోతే అదే విషయం స్పష్టంగా చెప్పాలి. అదే విధంగా కేబుల్ వ్యాపారాన్ని రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించదలచుకుంటే ఆ విషయం కూడా నేరుగా చెప్పాలే తప్ప ఇలా డొంకతిరుగుడుగా వ్యవహరించటం సరైన పద్ధతి కాదు.

ఇప్పుడు తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐపిటీవీ ద్వారా టీవీ చానల్స్ అందిస్తామంటోంది. అంటే, ఇంటర్నెట్ ఇస్తామంటూనే ఫోన్, కేబుల్ సేవలూ ఇవ్వటానికి సిద్ధమని ప్రకటించింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నదాన్నిబట్టి ఈ పథకం ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతోంది. అంటే, ఆ తరువాత అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తుంది. అప్పుడు అన్ని రాష్టాలలో కేబుల్ వ్యాపారం ఆయా రాష్ట ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడున్న ఎమ్మెస్వో వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం అవుతుంది. ఏ ఎమ్మెస్వో ద్వారా సేవలందించాలన్నది అక్కడి రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. అంటే, అనారోగ్యకరమైన ధోరణులను ప్రోత్సహించే ప్రమాదం ఉంది. పరోక్షంగానైనా ఇందులో రాజకీయాలు ప్రవేశించి అధికారపక్షానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెస్వోలు మాత్రమే రంగంలోకి దిగుతారు.

మరోవైపు రాష్ట్రప్రభుత్వాలు తమ ప్రచారానికి వీటిని వేదికలుగా వాడుకునే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా గుత్తాధిపత్యం అనుభవించేటప్పుడు సహజంగానే ఆ ఆధిపత్యాన్ని అనుకూలంగా మార్చుకోవటానికే ఏ రాష్టప్రభుత్వమైనా ప్రయత్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రాల ప్రచారం యధేచ్ఛగా సాగిపోతుంది. పంజాబ్ లో అక్కడి ముఖ్యమంత్రి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఉన్న కేబుల్ టీవీ నెట్ వర్క్ తన గుత్తాధిపత్యంతో ఎలాంటి ప్రచారం చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే చానల్ ప్రసారాలనే కత్తిరించే ప్రమాదమూ ఉంది. ఇలాంటి ప్రమాదాలను ఊహించకుండా కేంద్ర ప్రభుత్వం ఇలా ఐపిటీవీ లైసెన్స్ ఇస్తూ చానల్స్ పంపిణీకి అనుమతించటం మీద ఎమ్మెస్వోలు  కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయకపోతే అతి తక్కువకాలంలోనే పెను ప్రమాదం ముంచుకురావచ్చు.