• Home »
  • MIB/Licencing »
  • గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి ఏటా రూ.3 కోట్ల ఉచిత బాండ్ విడ్త్ ఇస్తున్న ఇస్రో

గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి ఏటా రూ.3 కోట్ల ఉచిత బాండ్ విడ్త్ ఇస్తున్న ఇస్రో

గ్రామ్ శాట్ పథకం కింద గ్రామీణ ప్రాంతాలవారికి విద్యాకార్యక్రమాలు అందించటానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్రో ఏటా రూ.3 కోట్ల విలువచేసే బాండ్ విడ్త్ ఉచితంగా అందిస్తోంది. ప్రసారాల రూపకల్పన, నిర్వహణ ఖర్చులను మాత్రం ఆయా రాష్ట్రప్రభుత్వాలే భరిస్తాయి.  కొన్ని రాష్ట్రాలు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఇస్రో తన నివేదికలో పేర్కొంది.

తొలివిడతగా అప్పట్లో 2002 లో ఆంధ్రప్రదేశ్ కు ప్రయోగాత్మకంగా మన టీవీ పేరుతో ఐదు చానల్స్ కోసం బాండ్ విడ్త్ కేటాయించగా ఒక చానల్ ను అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి ఇచ్చేసింది. మధ్యలో వై ఎస్ హయాంలో మిగిలిన నాలుగూ ఇచ్చేసే ప్రయత్నం చేయగా కేంద్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండేసి చొప్పున కేటాయించగా వాటిని ఎలా నడపాలో అర్థం కాక అలాగే నెట్టుకొస్తున్నారు. ఆ తరువాత కేరళ ప్రభుత్వానికి కూడా కేటాయించగా అక్కడ చానల్ అద్భుతంగా నడుస్తోంది. పైగా, ఇంటింటికీ ఆ చానల్ అందే ఏర్పాట్లు, వెబ్ స్ట్రీమింగ్ కూడా నడుస్తోంది.

మరికొన్ని రాష్ట్రాలు కోరటంతో ఇస్రో గత మూడేళ్ళలో గుజరాత్, కర్నాటక, మధ్య ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు బాండ్ విడ్త్ కేటాయించింది. ఈ నాలుగు రాష్ట్రాలకు ఏటా మూడేసి కోట్ల విలువచేసే బాండ్ విడ్త్ ఇస్తూ వస్తోంది. విద్య, సంస్కృతి, అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ, మత్స్య సంపద అభివృద్ధి, అటవీ విభాగం, పర్యావరణం లాంటి అంశాలకోసం ఈ చానల్స్ ను వాడుకోవాలి.

గ్రామ్ శాట్ ఉపగ్రహంలో ఆరు నుంచి ఎనిమిది వరకు శక్తిమంతమైన సి బాండ్ ట్రాన్స్ పాండర్లుంటాయి. వీడియో కంప్రెషన్ టెక్నిక్ సాయంతో మామూలు టీవీ సెట్లలో ఈ చానల్స్ ప్రసారమయ్యేలా చేయవచ్చు.మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం చేరేలా చిన్నపాటి డిష్ యాంటెన్నాతో నేరుగా అందించవచ్చు. దీని సాయంతో ఈ గవర్నెన్స్, టెలీకాన్ఫరెన్సింగ్, ప్రసారాల ద్వారా గ్రామీణ విద్య సాధించాలన్నది ప్రభుత్వలక్ష్యం.