• Home »
 • Editors Voice »
 • పే చానల్స్ వ్యవహారశైలిని సమీక్షించాల్సిన సమయం ఇది

పే చానల్స్ వ్యవహారశైలిని సమీక్షించాల్సిన సమయం ఇది

కేబుల్ టీవీ పరిశ్రమలో డిజిటైజేషన్ విజయవంతమైందని చెప్పుకోవటం కాగితాలమీద బాగానే ఉండవచ్చుగాని వాస్తవానికి వచ్చేసరికి గడిచిన ఐదేళ్ళలో మనం సాధించింది చాలా తక్కువనే చెప్పాలి. పూర్తిచేయటానికి ట్రాయ్ చెప్పిన గడువు ప్రకారం ఏ దశలోనూ పూర్తికాలేదు. ఇప్పటికే మనం గడువుతేదీలకు రెండేళ్ళు కలుపుకున్నాం. ఈ పరిస్థితిని మనం ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే మరిన్ని గడువు తేదీలు పెట్టుకుంటూ వెళ్ళకతప్పదు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) పెట్టే నియమనిబంధనలన్నీ కోర్టులలో మొగ్గుతున్నాయి. మొత్తంగా చూస్తే నష్టపోతున్నది మాత్రం చందాదారులే.

కేబుల్ టీవీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న సమస్యలలో  ప్రధానమైనవి ఇవి:

విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు చాలా తక్కువగా ఉండటం వలన ఈ రంగం అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదు. మరీ ముఖ్యంగా డిజిటైజేషన్ జరుగుతున్న సమయంలో భారీ పెట్టుబడులు అవసరమవుతుండగా ఆశించిన మేరకు పెట్టుబడులు రాకపోవటం వలన వేగం కూడా తగ్గింది. చందా రేట్లకు సంబంధించి ఈ రంగం అనేక కోర్టు కేసులు ఎదుర్కుంటోంది. నిబంధనలు రూపొందించిన ట్రాయ్ కి ఈ సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. దాదాపు 60 శాతం డిజిటైజేషన్ పూర్తయినట్టు టాయ్ ప్రకటించుకుంటున్నప్పటికీ వాస్తవాలు అందుకు అనుగుణంగా లేవు. కేవలం సెట్ టాప్ బాక్సులు అమర్చటాన్ని మాత్రమే డిజిటైజేషన్ అమలుగా చెప్పుకోవటంలో అర్థం లేదు. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ) అమలు చేయటం మొదలుకొని అనేక విషయాలలో ఇంకా స్పష్టత లేదు. చందాదారులకు సంబంధించినంతవరకు డబ్బు ఖర్చుపెట్టి సెట్ టాప్ బాక్సులు కొనటం తప్ప ఒరిగిందేమీ లేదు

డిజిటల్ లోకి మారే సందర్భంలో ఇవ్వదగిన రాయితీలు, ప్రోత్సాహకాల గురించి ప్రభుత్వానికి ట్రాయ్ సిఫార్సు చేయటమే తప్ప ఒక్కదానికీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. ఆ విధంగా నిబంధనలే తప్ప మరే ఇతర సిఫార్సులనూ పట్టించుకోవటం లేదన్న ఆందోళన ట్రాయ్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. అంతిమంగా అది ట్రాయ్ స్థాయినే దిగజార్చే విషయం. ప్రతి ట్రాయ్ నిబంధననూ వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కటం ద్వారా బ్రాడ్ కాస్టర్లు ఆ నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కుతున్నాయి. కోర్టులో ఉండటం వలన వాటి గురించి చర్చించే అవకాశం లేకుండా చేస్తున్నాయి. అది టారిఫ్ గురించి కావచ్చు, సేవల నాణ్యతకు సంబంధించి కావచ్చు, పరిశ్రమ పురోగతి చాలా నిదానంగా ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే బ్రాడ్ కాస్టర్లు ఆని విధాలుగా డిజిటైజేషన్ కు అవరోధాలు కల్పిస్తూనే ఉన్నారు.

నియంత్రణ సంస్థలు  చానల్స్ మీద అవగాహన ఏర్పడి చందా ధరలు నిర్ణయించటానికి వీలుగా వాటి ఆదాయ వివరాలమీద, వారు అందించే ప్రసారాలమీద వివరణ  కోరాయి. అయితే, బ్రాడ్ కాస్టర్లు వాళ్ళ ఆదాయ మార్గాలను, రాబడి వివరాలను వెల్లడించటానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకుంటున్న చందారేట్లు న్యాయబద్ధమైనవోకావో తెలిసే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు ఈ బ్రాడ్ కాస్టర్లు ప్రభుత్వాన్ని, ట్రాయ్ ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నియమనిబంధనలన్నీ తమకే అనుగుణంగా రూపొందించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.కేవలం కేబుల్ ఆపరేటర్ల ఆదాయాన్ని మాత్రమే తెలియజేస్తూ, వాళ్ళనే నిందిస్తూ సాగటం మరో సమస్యగా తయారైంది. మరికొంతమంది తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆధిపత్యాన్ని చెలాయించటం కూడా చూస్తున్నాం. నిజానికి  ఈ విషయాన్ని ఈ మధ్యనే టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ ట్రైబ్యునల్ కూడా ఈ విషయాన్ని గుర్తించింది. అయినప్పటికీ ట్రాయ్ ఆ సూచనలమీద చర్యలు తీసుకోలేకపోయింది.

ఈ వ్యవస్థలో కీలకమైనప్పటికీ చిన్న భాగస్వాములుగా పరిగణించబడే కేబుల్ ఆపరేటర్లు, చిన్న ఎమ్మెస్వోలు. చిన్న బ్రాడ్ కాస్టర్లు నష్టాలు భరిస్తున్నారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పంపిణీ సంస్థలు మాత్రమే లబ్ధిపొందుతున్నాయి. అవి మాత్రమే గుతాధిపత్యాలు ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇదంతా ట్రాయ్ కనుసన్నల్లోనే జరిగే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ పరిశ్రమలో మార్కెట్ శక్తులనేవే పనిచేయటం లేదు. బలవంతుడిదే పైచేయి అన్నట్టుగా సాగిపోతోంది.

ఈ రోజుకీ చందాదారుడికి ఏయే చానల్ ఎంత రేటో తెలియదు. చందా కట్టటమే తప్ప ఎందుకు కడుతున్నదీ తెలియదు. డిజిటైజేషన్ కాగానే కొరుకున్న చానల్స్ కి మాత్రమే కట్టాల్సి ఉంటుందని చెప్పారుగాని తాను ఏ చానల్స్ కోరుకుంటున్నాడో, వాటి ధర ఎంతో ఎవరూ చెప్పిన పాపాన పోలేదు. టీవీ చానల్స్ తమ చందాల చిల్లర ధర వెల్లడించి తీరాలని  ట్రాయ్ ఇంకా నిబంధన పెట్టలేదంటూ టీవీ చానల్స్ తప్పించుకుంటున్నాయి. దీంతో టోకు ధరల్లో విపరీతమైన తేడాలున్నాయి, అనేక అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. బ్రాడ్ కాస్టర్లు ఇవ్వజూపుతున్న ధరల్లో వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో పంపిణీ సంస్థకు ఒక్కో ధర నిర్ణయించటం వలన చిన్న పంపిణీ దారులకు ఎక్కువ ధరకు, పెద్ద పంపిణీ దారులకు తక్కువ ధరకు లభిస్తున్నాయి. మరోవైపు చందాదారులనూ బహిరంగంగానే మోసగిస్తున్నారు. చందాదారులతో ప్రత్యక్ష సంబంధాలుండే కేబుల్ ఆపరేటర్లు ఏం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. తన మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఈ వ్యాపారంలో అదనపు పెట్టుబడులు ఎలా పెట్టాలో అర్థం కావటం లేదు.

ఇప్పుడున్న చందారేట్లు, నియమనిబంధనల కారణంగా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా చిన్న నెట్ వర్క్స్ బలవంతంగా మూతపడే పరిస్థితి వస్తున్నది. చిత్రమేమిటంటే, తప్పనిసరి డిజిటైజేషన్ ప్రక్రియలో ప్రభుత్వానికి సహకరించాలని, చందాదారులను ఎక్కువ చందాలు చెల్లించేందుకు, సెట్ టాప్ బాక్సులు కొనేందుకు ఒప్పించాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మార్కెట్ అవసరాలకు చందాదారులను సిద్ధం చేయాలని చెబుతోంది. మరీ ముఖ్యంగా కేబుల్ పరిశ్రమను క్రమబద్ధం చేసి సజావుగా నిర్వహించాలంటే వ్యాపారాన్ని పెద్ద పెద్ద సంస్థలకే అప్పగించి తప్పుకోవాలని ఆపరేటర్లను పరోక్షంగా సూచిస్తోంది.

చందా ధరల నిర్ణయానికి 2004 ప్రాతిపదిక కావాలి

గడిచిన 12 సంవత్సరాలలో  ట్రాయ్ నియంత్రణలో పరిశ్రమ పునర్నిర్మాణం జరగటానికి బదులు యదాతథంగా ఉండిపోయింది. ఆవిధంగా చూస్తే పరిశ్రమ ఈ పన్నెండేళ్ళ కాలాన్ని వృధా చేసుకుంది. చర్చాపత్రాల్లో అంచనా వేసిన అభివృద్ధి మొత్తం కేబుల్ ఆపరేటర్ల అవిశ్రాంత కష్టం ఫలితమే. ఎన్ని కష్టాలెదురైనా చందాదారులమీద భారం పెరగకుండా వాళ్ళకు అనువైన సేవలందించటమే లక్ష్యంగా కేబుల్ ఆపరేటర్లు కృషి చేస్తూ వచ్చారు. నిజానికి కేబుల్ టీవీ పరిశ్రమలో చందా రేట్లను నియంత్రించటానికి తీసుకునే ఏ చర్యైనా క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవపరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జరగాలి. 26 సంవత్సరాలుగా ఈ పరిశ్రమ ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కున్నదో, ఏయే అనుభవాలు ఎదురయ్యాయో గమనిస్తే తప్ప దాని భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం కుదరదు. ఇప్పటిదాకా ఉన్న చందారేట్లు బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేర్లు, చందాదారులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయమైనవే.

కేవలం ఒకే ఒక్క చానల్ తో ప్రారంభమైన బ్రాడ్ కాస్టర్లు కేబుల్ నెట్ వర్క్ ల బలం చూసుకొని వాటిమీదనే స్వారీ చేస్తూ డజన్లకొద్దీ చానల్స్ జోడిస్తూ ముందుకు సాగాయి.  విపరీతమైన ఆదాయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతే కాదు, 1994 లో ఎమ్మెస్వో వ్యవస్థ కూడా తోడైంది. ఇంటింటికీ అందించటానికి సొంతగా ఎలాంటి కేబుల్ వ్యవస్థా లేకపోయినా, కేవలం పే చానల్స్ అందిస్తూ వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. చిన్న ఆపరేటర్ల ఆదాయం మీద బతుకుతూ  పెద్ద పెద్ద నగరాల్లో పెద్దపెద్ద ఎమ్మెస్వోలు తయారయ్యారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలు ఈ వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారు. ఇక చందాదారుల విషయానికొస్తే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. కేబుల్ ఆపరేటర్లు వసూలు చేసే చందాలు కూడా భరించదగినవిధంగానే ఉండటంతో పరిశ్రమ ఎదుగుదల సాధ్యమైంది.

స్థానిక కేబుల్ ఆపరేటర్లు చిన్న చిన్న ప్రాంతాలకే తమ వ్యాపారాన్ని పరిమితం చేసుకోవాల్సి వచ్చినప్పటికీ బాగానే నడుపుకుంటూ వచ్చారు. ఇంతకాలంగా జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యాపారం సాగించారు. సకుటుంబంగా రేయింబవళ్ళూ పనిచేస్తూ నెట్ వర్క్ నిర్మించుకుంటూ వచ్చారు. చివరికి ప్రభుత్వం కూడా పరిశ్రమ ఎదుగుదలకు ఆపరేటర్లకు ఎలాంటి రాయితీలుగాని, ప్రోత్సాహకాలుగాని, రుణ సదుపాయం గాని కల్పించకపోగా ఏకపక్షంగా  సర్వీస్ టాక్స్ విధించింది. ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లకు ఇచ్చిన ప్రోత్సాహకాలు సైతం కేబుల్ ఆపరేటర్లకు దక్కలేదు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి కేబుల్ ఆపరేటర్లు మాత్రం కనిపించరు. ఒకప్పటి స్టార్టప్స్ అయినా కేబుల్ ఆపరేటర్లకు మాత్రం అలాంటి గుర్తింపు ఇవ్వలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినోదపు పన్ను వసూలు చేసుకుంటూ కేబుల్ ఆపరేటర్లను ఆదాయ మార్గంగా చూసుకున్నాయే తప్ప ఏ విధంగానూ ఆదుకోలేదు. ప్రభుత్వం  దూరదర్శన్ చానల్స్ తప్పనిసరిగా ప్రసారం చేయాలనే నిబంధన విధించిందే తప్ప వాటిని ప్రసారం చేసినందుకు కనీస సాయం కూడా చేయలేదు. కారేజ్ ఫీజు ఎలాగూ లేకపోగా, పన్నులు మాత్రం వసూలు చేసుకుంది.

సమస్యల పరిష్కారంలోనూ ఎప్పుడూ ఆపరేటర్ ను పట్టించుకోలేదు.  సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వారికీ, ట్రాయ్ కీ మధ్య ఆటలో  బంతిలా మారాల్సి వచ్చింది. అక్కడికి పోతే ఇక్కడికి, ఇక్కడికొస్తే అక్కడికి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బాధ్యతలు ఒకరిమీదికొకరు నెట్టుకుంటూ కేబుల్ ఆపరేటర్ ను అయోమయంలోకి నెట్టేశారు. నిబంధనలు రూపొందించింది ట్రాయ్ కాబట్టి వాళ్ళకే తెలుస్తుందని ఎంఐబి అంటే, చట్టం చేసేది ఎంఐబి కాబట్టి వాళ్ళనే అడగాలని ట్రాయ్ సమాధానమిస్తుంది. టారిఫ్, ఇంటర్ కనెక్షన్, ఆదాయ పంపిణీ సంబంధమైన నియమనిబంధనలన్నిటినీ రూపొందించింది మాత్రం ట్రాయ్. ఇక ఇలాంటి పరిస్థితుల్లో టిడిశాట్ ను గాని కోర్టులను గాని ఆశ్రయించటం తప్ప దారిలేదు. కోర్టులు కేవలం చట్టం సరిహద్దులకు లోబడి పనిచేస్తాయి. మొత్తానికి ఈ క్రమంలో గత నాలుగేళ్ళుగా పరిశ్రమలో సమతుల్యత పూర్తిగా లోపించింది. కాబట్టి ఎలాంటి ప్రక్రియ తలపెట్టినా అది ప్రస్తుతమున్న చందాధరలను ఏ మాత్రమూ దెబ్బతీయని విధంగా ఉండాలే తప్ప మార్పుల ద్వారా భారం మోపే ప్రయత్నం చేస్తే మాత్రం దాన్ని చందాదారులు పూర్తిగా వ్యతిరేకించే ప్రమాదముంది. అది మొదటి దశలోఎలా ఉండేదో అలా ఉంచినప్పుడే ఆపరేటర్లు కూడా చందాదారులకు నచ్చజెప్పగలుగుతారు.

క్షేత్ర స్థాయి పనితీరుమీద తప్పుడు దృక్పథం

మన వ్యవస్థలో కనిపించే ప్రధానమైన తప్పిదమేంటంటే ప్రభుత్వం మనసులోగాని, ట్రాయ్ మనసులోగాని సరైన దృక్పథం లేకపోవటం. ప్రభుత్వ వైఖరిని, ట్రాయ్ వైఖరిని ఆర్థికంగా బలమైన, శక్తిమంతమైన మీడియా సంస్థలు ప్రభావితం చేస్తున్నాయి. ధనబలం, రాజకీయ అండదండలున్న అలాంటి సంస్థలు అక్షరాలా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను శాసిస్తున్నాయి. నియమనిబంధనలను తమకు అనుగుణంగా రూపొందించుకుంటున్నాయి. కేవలం పెద్ద సంస్థలు మాత్రమే తట్టుకొని నిలబడగలిగేలా నిబంధనలకు మెరుగులు దిద్దాయి. పెద్దపెద్ద ఎమ్మెస్వోలు, పే చానల్స్, పంపిణీ సంస్థలు మాత్రమే డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయగలవంటూ ప్రభుత్వాన్ని నమ్మబలికారు.

కానీ ఇది సత్యదూరమని ఇప్పటికే తేలిపోయింది. చెప్పుకోదగిన పెద్ద సంస్థ ఏదీ పూర్తి స్థాయిలో డిజిటైజేషన్ ను అమలు చేయలేకపోయింది. పూర్తిస్థాయిలో కాస్ వాడుకోవటంలో దాదాపుగా అన్ని సంస్థలూ విఫలమయ్యాయి. అన్ని నిఅయమనిబంధనలనూ ఆచరించి చూపలేకపోయాయి. ప్రస్తుతం పరిశ్రమలో ఏర్పడిన అయోమయ వాతావరణానికి కారణం క్షేత్రస్థాయిలో న్న కోట్లాది చందాదారుల పరిస్థితి గురించి, వాళ్లకు సేవలందిస్తున్న వేలాది మంది కేబుల్ ఆపరేటర్లగురించి ప్రభుత్వానికి గాని, ట్రాయ్ కి గాని ఎలాంటి అవగాహనా లేకపోవటమే. వాళ్ళ ప్రయోజనాలను ట్రాయ్, మంత్రిత్వశాఖ సహా పరిశ్రమలొని వివిధ వర్గాలు కూడా విస్మరించటమే.

డిజిటైజేషన్ అమలు చేయటం మొదలైన మరుక్షణమే ఈ పరిశ్రమలోని దాదాపు అందరు భాగస్వాములూ అటు ప్రభుత్వంతోను, ఇటు ట్రాయ్ తోనూ లాబీయింగ్ ద్వారా  గరిష్ఠంగా లబ్ధిపొందటానికే పథక రచన చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ మరొకరిని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలొ చందాదారుల ప్రయోజనాలను గాలికొదిలి ఎవరికి వారే వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందటం మీద దృష్టిపెట్టారు. ఈ గొలుసుకట్టులో అత్యంత బలహీనమైన లింకుగా భావించేది కేబుల్ ఆపరేటర్ ని మాత్రమే. అందుకే అటు బ్రాడ్ కాస్టర్లు, ఇటు ఎమ్మెస్వోలు ఆపరేటర్ మీదనే వత్తిడి తెస్తున్నారు. దీని ప్రభావం చందాదారుడి మీద పడుతోంది. అనలాగ్ నాటి కంటే ఇప్పుడు చందాలు పెరగటం వలన చందాదారుడు ప్రతిఘటించటం, ఆపరేటర్ మధ్యలో ఇరుక్కుపోవటం చూస్తూనే ఉన్నాం.

చందాదారు మీద పే టీవీని రుద్దకండి

మనం మాట్లాడుతున్నది 6 వేలమంది ఎమ్మెస్వోల గురించి, 60 వేలమంది కేబుల్ ఆపరేటర్లగురించి, 10 కోట్ల కేబుల్ టీవీ ఇళ్ల గురించి. అంటే, సగటున ఒక్కో ఆపరేటర్ 1700 ఇళ్లకు సేవలందిస్తున్నాడు. కానీ ఆచరణలో పరిస్థితి ఇలా లేదు.40% గ్రామీణ మార్కెట్  కు సేవలందిస్తున్నది మరీ చిన్న ఆపరేటర్. వాళ్ళకు సగటున 300 మంది చందాదారులే ఉంటారు. వాళ్ళలో చాలామందికి అసలు పే చానల్స్ అనేవే ఉండటం లేదు. ఒకవేళ ఉన్న ఐదారు స్థానిక పే చానల్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో అంతకుమించి డిమాండ్ కూడా ఉండదు. అందువల్ల రూ.100 లేదా అంతకంటే తక్కువ చందాతో కూడా ఆపరేటర్ మనుగడ సాగించగలుగుతాడు. ఈ నేపథ్యంలో ఒక గ్రామీణ చందాదారును నగరప్రాంత ధనిక చందాదారుతో కలిపి ఒకే గాటన కట్టాలనుకోవటం చాలా దారుణం. ఈ రకమైన టారిఫ్ నిర్ణయం చేయటమంటే క్షేత్రస్థాయి వాస్తవాలమీద ఏ మాత్రమూ అవగాహన లేకపోవటమే. బ్రాడ్ కాస్టర్లు తమ డజన్లకొద్దీ చానల్స్ ను గుదిగుచ్చి రుద్దటానికి వీలుగా ట్రాయ్ చేత ఇలాంటి టారిఫ్ నిర్ణయించటానికి లాబీయింగ్ జరుపుతున్నారు.

ఒక టీవీ చానల్ కు మార్కెట్లో గరిష్ఠంగా ఉన్న పే చానల్ డీకోడర్ల సంఖ్య ఆధారంగా ఎమ్మెస్వోల సంఖ్య 6 వేలుగా నిర్ణయించటం జరిగింది. ఈ గరిష్ఠ సంఖ్యను గర్వంగా చాటుకున్న చానల్ ఇఎస్ పి ఎన్ మాత్రమే. మిగిలిన చానల్స్ మాత్రం తమకున్న డీకోడర్ల సంఖ్య 3 వేల నుంచి 4 వేలుగానే వెల్లడించాయి. పైగా, ఈ ఆపరేటర్లందరూ ఎమ్మెస్వోలు కాదు. చాలామంది మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్వతంత్ర ఆపరేటర్లు మాత్రమే. వాళ్ళ కనెక్షన్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం ఆధారంగా చూస్తే ఇదేమీ పెద్ద సంఖ్య కాదు.  కాబట్టి పే టీవీ బ్రాడ్ కాస్టర్లు 10 కోట్ల చందాదారులను పే టీవీ చందాదారులుగా చెప్పుకోవటంలో అర్థం లేదు. పే చానల్స్ రాక చాలా ఆలస్యంగా జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు పదేళ్ళ తరువాత. ప్రధానంగా 2000 తరువాతనే పే చానల్స్ సంస్కృతి పుంజుకుంది. అందులోనూ అప్పటిదాకా ఉచిత చానల్స్ గా ఉన్నవే ఒక్కసారిగా పే చానల్స్ గా అవతరించాయి. అందువల్లనే చందాదారులు ఆ చందాలు పెంచి ఇవ్వటానికి ఇష్టపడలేదు. వాళ్లను ఒప్పించటానికి కేబుల్ ఆపరేటర్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో అడ్రెసిబిలిటీ లేదు. అందరూ పే చానల్స్ కు డబ్బులు కట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మరో రూపంలో పే చానల్స్ ను బలవంతంగా అంటగట్టబోవటమే దారుణం.

బ్రాడ్ కాస్టర్లనుంచి ఎమ్మెస్వోకి స్వతంత్రత కల్పించాలి

పే చానల్స్ అన్నీ గ్రూపులుగా తయారై పంపిణీకి పూనుకోవటాన్ని నియంత్రించాలి. పంపిణీ వేదికలు తయారై  ఒక సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. అప్పుడే కేబుల్ నెట్ వర్క్స్ ద్వారా బ్రాడ్ బాండ్ కూడా విజయవంత మవుతుంది. పైగా ఈ మధ్య కాలంలో పే చానల్స్ పంపిణీకి రకరకాల మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే, ఓవర్ ద టాప్ (ఒటిటి), ఇంటర్నెట్, అంతర్జాతీయ మార్కెట్ లాంటి సౌకర్యాలను వాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే అవకాశం వచ్చింది. ప్రకటనల ద్వారా, స్పాన్సర్ షిప్ ద్వారా ఆదాయానికి చాలా అవకాశాలు వచ్చాయి. ఇవేవీ ఎమ్మెస్వో మీదగాని, కేబుల్ ఆపరేటర్ మీద గాని ఆధారపడినవి కావు. అందువలన పే చానల్ చందాలలో తగ్గింపు ఇవ్వటం సమంజసం. అదే సమయంలో బ్రాడ్ బాండ్ ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాన్ని ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు అందిపుచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందుతరం నెట్ వర్క్స్ కు బ్రాడ్ బాండ్ ఆదాయం కూడా ఒక ప్రధానవనరుగా మారాలి.

సగటు ఆదాయం మీద కానరాని కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రభావం

ప్రస్తుతం డిటిహెచ్ ఆపరేటర్లతోబాటు బ్రాడ్ కాస్టర్లు కూడా డిజితైజేషన్ అనంతరం  ఒక్కొ కనెక్షన్ కు సగటు ఆదాయం  గణనీయంగా పెరగాలనే అంచనాతో ఉన్నారు. కానీ ఒక్కో కనెక్షన్ సగటు ఆదాయమన్నది చందాదారు చెల్లించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందే తప్ప పే చానల్స్ తమ చందా ధరలు పెంచుకుంటూ పోయినంత మాత్రాన పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఒక చందాదారు చెల్లించలేని పక్షంలో అత్యంతనాణ్యమైన డిజిటల్ సేవలకోసం చెల్లించటానికి ఆసక్తి చూపకపోవచ్చు.  కొద్దిపాటి డిజిటల్ నాణ్యత పెరిగినంత మాత్రాన ఎక్కువగా చెల్లించటానికి ఇష్టపడడు. మరీ ముఖ్యంగా పాకేజీల రూపంలో అన్ని చానల్స్ కూ గుదిగుచ్చి రేట్లు పెంచే వాతావరణంలో విడివిడిగా అ లా కార్టే పద్ధతికే మొగ్గుచూపుతాడు.  కేబుల్ టీవీ వ్యాపారం బతికి బట్టటానికి కారణం ఒక్కొ చోట ఒక్కొ విధమైన ధరపెట్టటం వల్లనే తప్ప కనెక్షన్ల సంఖ్య తక్కువగా చెప్పటం వల్ల మాత్రం కాదు. చాలా మంది బ్రాడ్ కాస్టర్లు మాత్రం కనెక్షన్ల సంఖ్య తక్కువగా చెప్పు కేబుల్ ఆపరేటర్లు వ్యాపారం చేస్తున్నారనీ, విపరీతంగా సంపాదించుకుంటున్నారనీ అపోహతో ఉంటారు.

భారతదేశంలో రెండున్నర కోట్ల మంది చందాదారులు ( 25% మంది ) మాత్రమే మెరుగైన సేవలకోసం అదనంగా చెల్లించటానికి మొగ్గు చూపే అవకాశముంది. దీనికి కారణమేంటంటే వాళ్ళకున్న ఎల్ ఇ డి/ ఎల్ సి డి టీవీ సెట్లలో డిజిటల్ వీడియో నాణ్యత బాగా ఉంటుందన్న నమ్మకం వల్ల. కానీ 50 శాతం ఇళ్లలో చందాదారులు పేదల విభాగంలోకి వస్తారు. వాళ్ళ దగ్గర చాలా పాతకాలపు టీవీ సెట్లుంటాయి. వాటిలో డిజిటల్ సిగ్నల్ఇచ్చినా ప్రయోజనముండదు. అలాంటివాళ్ళు అదనంగా చెల్లించటానికి ఇష్టపడరు. మిగిలిన 25 శాతం ఇళ్ళవారు వీలైనంత తక్కువ పాకేజ్ కే మొగ్గు చూపుతారు. ఈ కారణం వల్లనే ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు రూ.100 బేసిక్ పాకేజ్ తో బాటు అ లా కార్టే చానల్స్  ఇవ్వటానికి వెనకాడుతున్నారు. లేదంటే వాళ్ళకు ఇంతకు ముందుకంటే తక్కువ సగటు ఆదాయం వస్తుంది.

డిజిటైజేషన్ పూర్తయినచోట సగటు ఆదాయాలు పెరిగినట్టు గణాంకాలు చూపిస్తున్నవారున్నప్పటికీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయమేంటంటే ఆ పెరుగుదల కేవలం సర్వీస్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ వలన మాత్రమే. చాలాచోట్ల స్థానిక ఆపరేటర్లు  ఈ మొత్తాలను చందాదారులనుంచి వసూలు చేయలేకపోతున్నారు. వాళ్ళు సర్వీస్ టాక్స్ పరిధిలో లేకపోవటం కూడా ఒక కారణం. ఇక వినోదం పన్ను విషయానికొస్తే కచ్చితంగా కనెక్షనల సంఖ్య తకువగా వెల్లడిస్తున్నారని చెప్పకతప్పదు. ముఖ్యంగా టాక్స్ ఇన్స్ పెక్టర్ కూ, అక్కడి ఎమ్మెస్వో/ఆపరేటర్ కూ మధ్య ఉండే అవగాహన కారణంగా ఇలా జరుగుతుంది. కచ్చితమైన సంఖ్య కాకుండా బేర సారాల ద్వారా ఇరుపక్షాలూ ఒప్పుకున్న సంఖ్య ఒకటి ఉన్నప్పుడు దాని ఆధాంగానే వసూళ్ళు కూడా జరుగుతాయి.

చివరిగా, 2004 నుంచి ట్రాయ్ కి మొరపెట్టుకుంటున్న విషయాలనే మరోమారు పునరుద్ఘాటిస్తే అవి కచ్చితంగా కేబుల్ టీవీ పరిశ్రమ పునర్వ్యవస్థీకరణకు బాగా ఉపయోగపడతాయి. ఎదుగుదల, స్థిరత్వం ఏర్పడతాయి.

 1. స్థానిక కేబుల్ ఆపరేటర్ ను గుర్తించాలి : ఆధునిక ఇంటర్ కనెక్షన్ ఒప్పందం స్థానిక కేబుల్ ఆపరేటర్ హోదాను పరిరక్షించాలి. వాళ్ళే తమ అధీనంలోని కనెక్షన్లకు పూర్తిస్థాయి యజమానులన్న విషయాన్ని గుర్తించాలి. ఎమ్మెస్వోల దోపిడి నుంచి వాళ్లను రక్షించాలి. వత్తిడి, బెదరింపుల ద్వారా నెట్ వర్క్స్ ను స్వాధీనం చేసుకునే ఎమ్మెస్వోల బారినుంచి కాపాడే ప్రయత్నం చేయాలి.
 2. బలవంతపు స్వాధీనం నుంచి ఆపరేటర్ ని కాపాడాలి : గతంలో చాలామంది ఎమ్మెస్వోలు తమకున్న రాజకీయపు పలుకుబడి, అంగబలం, అర్థబలం ఉపయోగించుకొని బలవంతంగా నెట్ వర్క్స్  స్వాధీనం చేసుకున్నారు. పోస్టాఫీసు రిజిస్ట్రేషన్ రెన్యూ కాకుండా వత్తిడిచేసి రిజిస్ట్రేషన్లు రద్దయ్యేట్టు చేశారు. అందుకోసం పైరసీ లాంటి కేసులు బనాయించారు. దీనివలన ఎమ్మెస్వో తన సిగ్నల్స్ నిలిపివేసే అవకాశం వస్తుంది. దాన్నే ఆయుధంగా వాడుకుంటూ కారుచౌకగా నెట్ వర్క్స్ కొనేస్తారు. అతడి వ్యాపారం నాశనమవుతుంది. అలాంటి కేసులు పంజాబ్, తమిళనాడు తదితర రాష్టాలనుంచి వందల సంఖ్యలో నమోదవుతూ వస్తున్నట్టు తెలుస్తూనే ఉంది.
 3. ఆపరేటర్ వ్యాపారం నిలదొక్కుకునేలా కనీస ఆదాయవాటా: కేబుల్ ఆపరేటర్ కి ఇచ్చే ఆదాయం వాటా కనీస మొత్తం ఉండేటట్టు చూడాలి. కేవలం కొంత శాతం అనేది తక్కువ కనెక్షన్లు ఉన్నచోట పెద్దగా లాభదాయకం కాదు. నిబంధనలకు అనుగుణంగా ప్రాథమిక సేవలందించినా కనీస ఆదాయం లభించే విధంగా ఆదాయ పంపిణీ జరగాలి. పే చానల్స్ మీద వచ్చే ఆదాయాన్ని ట్రాయ్ అసలు పరిగణించటానికే వీల్లేదు. అది పూర్తిగా చందాదారు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎంతమంది తీసుకుంటారనేది స్పష్టంగా చెప్పటం కష్టం. అందుకే 35% ఇవ్వటమన్న నిబంధనమీద మళ్లీ సమీక్ష జరగాలి. ఒక సగటు కేబుల్ ఆపరేటర్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందన్న విషయం ఆధారంగా  ఆర్థికాంశాల నిర్థారణకు ట్రాయ్ ప్రయత్నించాలి.
 4. ఎమ్మెస్వో తన బాధ్యతను ఆపరేటర్ మీదికి నెట్టకూడదు : సెట్ టాప్ బాక్స్ సమకూర్చుకోవటం, సరఫరా చేయటం పూర్తిగా ఎమ్మెస్వో బాధ్యత మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని సెట్ టాప్ బాక్సులను ఆపరేటర్ ద్వారా చందాదారుకు అందించేలా ఒక వ్యవస్థ రూపొందించాలి. ఇన్వాయిస్, వారంటీ, వాయిదా కొనుగోలు ఒప్పందం తదితర డాక్యుమెంట్లన్నీ ఆపరేటర్ కు అప్పగించాలి. ఎవరైనా చందాదారు సెట్ టాప్ బాక్స్ సరిగా పనిచేయకపోతే అందుకు ఆపరేటర్ ను బాధ్యుణ్ణి చేయకూడదు. సేవల్లో అంతరాయం ఏర్పదకుండా ప్రత్యామ్నాయంగా బాక్స్ అందించే బాధ్యత కూడా ఎమ్మెస్వోమీదనే ఉండాలి.
 5. చందాదారు చందా కట్టకపొతే : ఒక చందాదారు చందా చెల్లించకపోతే ఆ విషయాన్ని ఆపరేటర్ తన దృష్టికి తీసుకురాగానే ఎందుకు చెల్లించలేదో ఎమ్మెస్వో దర్యాప్తు జరిపించాలి. వీలైనంతవరకు కనెక్షన్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ చందాదారుకు మరో అవకాశం ఇవ్వటానికే మొగ్గు చూపాలి. చాలా సందర్భాలలో కనెక్షన్లు ఆపరేటర్ వే కాబట్టి ప్రసారాలు నిలిపివేయటానికే ఎమ్మెస్వో మొగ్గుచూపటం వలన ఆపరేటర్ తన వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదముంది.

ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియవలన ఎలాంటి ప్రభావం ఉంటుందో చందాదారులందరికీ అర్థమయ్యే అవకాశం లేదు. అందువలన వారు అదనపుచందా చెల్లించటానికి ఇష్టపడకపోవచ్చు. అందుకు కారణాలున్నాయి:

 1. a) పెరిగిన చందాలు కట్టే స్తోమత లేకపోవటం వల్ల
 2. b) చందాదారు టీవీ సెట్ పాతది కావటం వల్ల డిజిటైజేషన్ తో ఒరిగేదేమీ లేదని అర్థం చేసుకోవటం
 3. c)  ఇచ్చిన పాకేజ్ లో చందాదారుడు కోరుకున్న చానల్స్ లేకపోవటం
 4. d) చందాదారుకు కేవలం ఉచిత చానల్స్ కావాల్సి ఉండటం, ఎమ్మెస్వో ఆ 100 రూపాయల పాకేజ్ ఇవ్వకపోవటం

ఇలాంటి సందర్భాలన్నిటిలో కేబుల్ ఆపరేటర్ వ్యాపారపరంగా నష్టపోవటంతోబాటు ప్రతిష్ఠకూడా కోల్పోతాడు. ఎమ్మెస్వోకి ఇది కొత్త వ్యాపారం కాబట్టి కొంత కాలం వేచి చూడగలుగుతాడు. కానీ ఆపరేటర్ కు మాత్రం ఎంతోకాలంగా కాపాడుకుంటూ వచ్చిన చందాదారుణ్ణి పోగొట్టుకున్నట్టే.  చాలా సందర్భాలలో  ఎమ్మెస్వో అసలు సమస్యలు వినటానికే ఇష్టపడడు. ఎప్పుడూ పూర్తి బకాయిల వసూళ్ల మీదనే దృష్టిసారిస్తాడు. అది ఆపరేటర్ వ్యాపారానికి విఘాతం. అలాంటి కేసులను నివారించాలి.

 1. సమీకృత నెట్ వర్క్ లను ప్రోత్సహించాలి: ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య శాశ్వత లేదా పాక్షిక శాశ్వత సంబంధాలు ఉండేలా ప్రోత్సహించటం ద్వారా వాళ్ళు ఒక సమీకృత నెట్ వర్క్ ఏర్పాటుచేసుకునేట్టు అవకాశం కలిగించాలి. అలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలి. బ్రాడ్ బాండ్ సౌకర్యం కూడా కల్పించటం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవటానికి ఈ అనుబంధం ఉపయోగపడుతుంది.
 2. పే చానల్స్ తప్పనిసరి చేయకండి: ఉచిత చానల్స్ మాత్రమే అందించే నెట్ వర్క్స్ ను సైతం ట్రాయ్ ఒప్పుకోవాలి. దీనివలన దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ వేదిక ఫ్రీడిష్ తో సమానంగా వ్యవహరించే అవకాశం లభిస్తుంది. ఇందులో ఇప్పుడు పే చానల్స్ కూడా ఉచిత చానల్స్ గా అందుబాటులోకి రావటంతోబాటు ప్రైవేట్ చానల్స్ కూ అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ జరుగుతున్నచోట నిరుపేదలు సైతం భరించగలిగేలా తక్కువ చందాలకు ఉచిత చానల్స్ అందించే వెసులుబాటు ఉంటుంది.