• Home »
  • Legal Issues »
  • సన్ టీవీ వ్యవహారం మీద ప్రధానితో సమావేశం

సన్ టీవీ వ్యవహారం మీద ప్రధానితో సమావేశం

సన్ టీవీ నెట్ వర్క్ చానల్స్ కు లైసెన్స్ పునరుద్ధరణ వ్యవహారం ఇక ప్రధాని తేల్చాల్సి ఉంది. హోం శాఖకూ, సమాచార, ప్రసారాల శాఖకూ మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తం కావటంతో ఈ విషయంలో నేరుగా ప్రధానిని కలిసి తేల్చుకొవాలని సమాచార, ప్రసారాల శాఖామంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నారు. ఆ తరువాతనే మంత్రిత్వశాఖ తరఫున అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

సన్ గ్రూప్ లోని 33 చానల్స్ కు లైసెన్స్ పునరుద్ధరణ కోరుతూ  పెట్టుకున్న దరఖాస్తు మీద హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవటం తెలిసిందే. అల క్లియరెన్స్ నిరాకరించినప్పుడు సహజంగానే లైసెనుల పునరుద్ధరణ జరగదు. అయితే ఇది 33 చానల్స్ కు స్అంబంధించిన వ్యవహారం కావటంతో కొంత ఆచితూచి వ్యవహరించాలని అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నారు. అదే విషయం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేక రాస్తూ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. కానీ ఆయన ఒప్పుకోలేదు.

ఈ లోపు సన్ గ్రూప్ అధిపతి  కళానిధి మారన్ హోంమంత్రి కి లేఖరాస్తూ తనతో బాటు అనేకమంది చానల్ అధిపతులమీద కేసులున్నాయని, అయితే, వాళ్ళందరికీ వర్తింపజేయని నిబంధనను సన్ మీదనే ప్రయోగించటం తగదన్నారు. 16 సంస్థలకు చెందిన 61 చానల్స్ మీద చర్య తీసుకోకుండా వదిలేశారంటూ ఆరోపించారు. నిందితులను దోషులుగా నిర్థారించటంలో అర్థం లేదన్నారు. మరోవైపు జైట్లీ కోరికమీద అటార్నీ జనరల్ ఈ కేసు పరిశీలించి లైసెన్సులు పునరుద్ధరించకపోవటం సమంజసం కాదన్నారు.

ఈ పరిస్థితుల్లోనూ హోం శాఖ ససేమిరా అనటంతో రెండు మంత్రిత్వశాఖల మధ్య ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొన్నదంటూ పత్రికలలో వార్తాకథనాలు మొదలయ్యాయి. దీంతో అరుణ్ జైట్లీ చొరవ తీసుకొని ప్రధానిని కలిసి ఆయన సలహా ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు ప్రధాని నిర్ణయం కోసం సన్ గ్రూప్ తో బాటు మొత్తం పరిశ్రమ ఎదురుచూస్తోంది.